ఢిల్లీ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయంతో స్థానిక ఎన్నికలను వాయిదా వేశారని, ఇది సరికాదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. లోక్‌సభలో జీరో అవర్‌లో ఎంపీ కృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ఎన్నికల కమిషనర్ ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఏకపక్ష నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తి చేశారని. జిల్లా కలెక్టర్లు యంత్రాంగాన్ని సిద్ధం చేసి ఉంచారని, ఇలాంటి సమయంలో ఎన్నికలు వాయిదా వేయటం సరైన చర్య కాదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుందని, వ్యాధి వ్యాప్తి రేటు చాలా తక్కువగా ఉందని వివరించారు. మూడు, నాలుగు వారాలపాటు వ్యాప్తి అదుపులో ఉంటుందని, ఈలోగా తగిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 5100 కోట్లు ఆగిపోయే పరిస్థితి ఉందన్నారు.