పేదింటి పిల్లలూ ఎదగాలంటే ఇంగ్లీష్ కావాలి

వరప్రసాద్  

 

ప్రభుత్వ ఉన్నతాధికారిగా పని చేసాను. కలెక్టర్ గా చేసాను కనుకే గ్రామాల్లో ఉన్న తారతమ్యాలు నాకు తెలుసు. ఉన్నవాళ్లు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటారు. పేదవాళ్లు కూడా అప్పో సొప్పో చేసి ఇంగ్లీష్ మీడియం కోసమే ప్రైవేటు పాఠశాలకు పంపడం చూసాను. అప్పుడే దేవుడిని కోరుకునేవాడిని వీరికి కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకునే అవకాశం దక్కాలి అని. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం పెట్టేలా నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. మచిలీపట్నంలో నోబుల్ హైస్కూల్లో ఆరో తరగతి నుంచీ ఇంగ్లీష్ మీడియంలో చదివాను. మా అమ్మగారు నన్ను ఇంగ్లీష్ మీడియంలోనే చదివించాలని కోరుకున్నారు. అప్పట్లో నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని ఉండకపోతే ఇన్సూరెన్స్ పరీక్షగానీ, తర్వాత స్టేబ్యాంక్ పరీక్షగానీ, తర్వాత రిజర్వబ్యాంక్ కానీ, ఇనకమ్ టాక్స్ ఆఫీసర్ కానీ, IPS ఆఫీసర్ కానీ, IAS కానీ అయ్యుండేవాడిని కాదని గట్టిగా చెప్పగలను. ఎందుకంటే ఇంగ్లీష్ ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆంధ్రా దాటి బయటకు వెళ్లిన తర్వాత ఎవరితో మాట్లాడాలన్నా, మన భావాలు ఎవరికైనా తెలియజేయాలన్నా ఇంగ్లీష్ అన్నది చాలా చాలా అవసరం. తెలుగుదేశం వారు రాజకీయాలు చేసుకోవచ్చు. కానీ దేనితో రాజకీయం చేయాలో దేనితో చేయకూడదో ఇంగితం ఉండాలి. ఇది ప్రజలకు ఎంతో లాభిస్తుంది. మాతృభాష ఎవరికైనా వస్తుంది. నేను తెలుగు మీడియం చదవకపోయినా, 30 ఏళ్లు నేను రాష్ట్రం వదిలి వేరే చోట ఉన్నా ఇప్పటికీ నా భాష నాకు అన్ని విధాలా వస్తుంది. కానీ ఇంగ్లీష్ మాత్రం నేర్చుకునే తీరాలి. యుపీఎస్సీలో ఇంటర్వ్యూ బోర్డులో ఒకే ఒక్కరు తెలుగు వ్యక్తి ఉంటారు. మిగిలిన వారు ఇతర ప్రాంతాల వారుంటారు. ఇంటర్వ్యూలో వారిని మెప్పించాలంటే ఇంగ్లీష్ అవసరం. ఏ సబ్జెక్టు మీద పీహెచ్‌డీ చేయాలన్నా ఇంగ్లీష్ అవసరం. వెనుకబడిన వారందరూ బాగుపడాలంటే ఇంగ్లీష్ కావాలి. ఇంగ్లీష్ మీడియం నన్నెంతో ముందుకు తీసుకు వచ్చింది. అందుకే నేను ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నందుకు మనఃస్ఫూర్తిగా ముఖ్యమంత్రిగారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. గ్రామాల్లో ఉన్న పిల్లలకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. పెద్ద పెద్ద ఇనిస్టిట్యూషన్స్ కు వెళ్లి, అక్కడ ఇంగ్లీష్ భాషలో చదవలేక, అర్థం చేసుకోలేక, ఆత్మన్యూనతకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు 10th తర్వాత డ్రాపవుట్స్ పెరగడానికి కారణం కూడా అదే. టీడీపీవారు చాలా సార్లు సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.  కానీ దయచేసి ఈ విషయంలో రాజకీయం చేయొద్దని కోరుకుంటున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో పేద పిల్లలు ముందుకు రావాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేయడం ఖచ్చితంగా న్యాయమే. మన పిల్లలను మనం ఎలా నర్సరీ నుంచి ఏబీసీడీలు నేర్పిస్తూ ఆంగ్ల మీడియంలో చదివించాలని తాపత్రయ పడుతున్నామో, అలాగే పేదింటి పిల్లలకు కూడా చదువుకోవాలనుకోవడం సముచితం. 

Read Also: బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి స్పీకర్‌గా ఉంటే ఓర్వలేకపోతున్నాడు

 

Back to Top