అనంతపురం: అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి సర్పంచ్ బండా అంజి యాదవ్ పై టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డాయి. డీజే పెట్టుకున్నారనే సాకుతో దాడి చేశారు. వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడూ లేని విధంగా పంచాయతీలో అభివృద్ధి పనులు జరిగాయి. దీంతో టీడీపీ నాయకుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. దీన్ని జీర్ణించుకోలేక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... సిండికేట్ నగర్ లో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు బుధవారం ఏర్పాట్లు చేశారు. పోలీసుల అనుమతి తీసుకుని డీజే సౌండ్ పెట్టుకున్నారు. స్థానికులు ఆనందంగా సంబరాలు చేసుకుంటుండగా.. సర్పంచ్ అంజియాదవ్ కూడా పాలుపంచుకున్నారు. అదే సమయంలో టీడీపీ వర్గీయులు ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాన్ని కూడా నిమజ్జనం చేసేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. డీజే సౌండుతో వస్తున్న వినాయకుడి ఊరేగింపును చూసి ఓర్చుకోలేక టీడీపీ మండల కన్వీనర్ సూర్యనారాయణ ప్రోద్బలంతో అతని బంధువులు దేవరకొండ రామాంజనేయులు, దేవరకొండ మహేష్ తో పాటు బద్దెల మంజునాథ్, బద్దెల మహేష్, దుబ్బర రమేష్, బుల్లెట్ రఫి, భానుకోట నాగరాజు, పననాచారి తదితరులు సర్పంచ్ అంజియాదము దుర్భాషలాడుతూ దాడికి తెగబడ్డారు. విచక్షణారహితంగా దాడి చేయడంతో చిటికెన వేలుకు బలమైన గాయమైంది. ఛాతిపై బాదారు. రాళ్లతో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. గాయపడిన సర్పంచును స్థానికులు వెంటనే అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పరామర్శించిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్ అంజి యాదవ్ ను ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరామర్శించి.. ధైర్యం చెప్పారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ప్రజాదరణ ఓర్వలేకనే దాడి..! ప్రజాదరణ చూసి ఓర్వలేకనే రాచానపల్లి సర్పంచ్ బండా అంజి యాదవ్ పై దాడి జరిగిందని వైయస్ఆర్‌సీపీ నాయకులు పేర్కొన్నారు. బుధవారం రాత్రి వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు పంచాయతీ పరిధిలో సర్పంచ్ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. జగనన్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ తీసుకెళ్తున్నారన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా నేనున్నాంటూ అంజియాదవ్ ముందుంటున్నారన్నారు. ఆయన చొరవతోనే పంచాయతీ పరిధిలో దాదాపు 600 మందికి ఇళ్లు వచ్చాయని, అదే స్థాయిలో ఇళ్లపట్టాలు కూడా మంజూరయ్యాయని గుర్తు చేశారు. ప్రజల్లో మంచి పేరు వస్తుండడం జీర్ణించుకోలేని టీడీపీ మండల కన్వీనర్ జింకా సూర్యనారాయణ సహకారంతో సర్పంచ్ పై దాడి చేశారని మండిపడ్డారు.