అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్‌ మంజూరు  

పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ప‌రిశీలించిన ఎమ్మెల్యే ఆర్కే

మంగ‌ళ‌గిరి:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాక‌ సంతృప్త స్థాయిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్‌ మంజూరు చేసే విధానాన్ని అమలులోకి తెచ్చార‌ని మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ కొనసాగుతోంది. 62.69 లక్షల మంది పెన్షనర్లకు రూ.1594.66 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. తెల్లవారుజాము నుంచే ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఇవాళ  ఉదయం 6.00 గంటలకు మంగళగిరి శాలివాహన నగర్లో ఎమ్మెల్సీ హనుమంతరావుతో క‌లిసి మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని పరిశీలించారు. వాలంటీర్ల‌తో క‌లిసి ఇంటింటికి తిరిగి పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవ్వా తాతలు, వితంతువులు, దివ్యాంగులు, వివిధ రకాల చేతి వృత్తుల వారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితరులకు ఇచ్చే పింఛన్ల సంఖ్య మూడేళ్లగా ఎప్పటికప్పుడు పెరుగుతూ రికార్డులు సృష్టిస్తోంద‌న్నారు.  ఈ ఏడాది ఆగస్టు నెల‌లో  62,79,486 మందికి పంఛ‌న్ సొమ్ము అందింద‌న్నారు. టీడీపీ హ‌యాంలో ఎన్నికలకు కొద్ది నెలల ముందు వరకు  43 నుంచి 44 లక్షల మందికే పింఛన్లు అందేవి అన్నారు.  ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత అవ్వా తాతలతో పాటు ఇతరులకు ఇచ్చే పింఛన్ల సంఖ్య భారీగా పెరిగింద‌న్నారు. గత ప్రభుత్వ హయాంలో పింఛనుదారులలో ఒకరు చనిపోతేనే ఆ స్థానంలో మరొకరికి పింఛన్‌ ఇచ్చే వారు. అమానవీయమైన ఈ  విధానానికి సీఎం వైయ‌స్‌ జగన్‌ స్వస్తి పలికార‌ని గుర్తు చేశారు. నేడు అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను అందుతోంద‌ని స్ప‌ష్టం చేశారు. పైగా, పింఛను కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా లబ్ధిదారులు ఉన్న చోటుకే వలంటీర్లు వెళ్లి పింఛను ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టార‌ని తెలిపారు.  పింఛనుదారులకు వ్యయప్రయాసలు తప్పాయ‌ని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు. 

Back to Top