గుంటూరు: నిన్న దుర్గిలో జరిగిన ఘటన దురదృష్టకరమని, ఈ సంఘటను పూర్తిగా ఖండిస్తున్నానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనకు, వైయస్ఆర్ సీపీకి ఎలాంటి సంబంధం లేదు.. ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అన్నారు. ఎన్టీ రామారావు అంటే అందరికీ గౌరవమే అన్నారు. దివంగత మహానేత స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి, స్వర్గీయ ఎన్టీ రామారావులాంటి వారు రాష్ట్రాన్ని పరిపాలించిన గొప్ప వ్యక్తులు.. వారి గౌరవార్థం విగ్రహాలను ప్రజలు పెట్టుకున్నారని తెలిపారు. ఈ సంఘటనను టీడీపీ రాజకీయంగా వాడుకోవడానికి చూస్తుంది.. ఇది చాలా దురదృష్టకరమన్నారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన మొదటి వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ ను మానసికంగా కుంగదీసి ఆయన చావుకు కారణమైన చంద్రబాబు, టీడీపీ నాయకులు ఈ చిన్న సంఘటనను రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న వ్యక్తిని, 15 ఏళ్ళు నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తిని మాచర్ల నియోజకవర్గానికి కొత్త ఇన్ ఛార్జ్ గా తీసుకువచ్చారు. ఆయనకున్న ఫ్యాక్షన్ నేపథ్యంతో భయబ్రాంతులకు గురిచేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలని చేస్తున్నారు. టీడీపీ. ఆ పార్టీ నాయకులు చేసే దుష్ప్రచారం.. ప్రజలు ఎవరూ నమ్మవద్దు.. ఇలాంటి ఘటనలను వైయస్ఆర్ సీపీ ఖండిస్తుంది. ఇలాంటివారిని ప్రోత్సహించే పరిస్థితి లేదు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఆతని తండ్రే అతన్ని పోలీసులకు అప్పగించిన పరిస్థితి. పోలీసులు కూడా తక్షణమే కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఘటనను టీడీపీ రాజకీయంగా వాడుకోవడం, రాష్ట్రవ్యాప్తంగా ఏదో చేయాలనే ప్రయత్నాలు దురదృష్టకరం.. ప్రజలు అర్థం చేసుకోవాలి. పల్నాడు ప్రాంతంలో ఇలాంటి ఘటన జరిగినప్పుడు పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అలాగే నియోజకవర్గానికి కొత్తగా వచ్చి అలజడి సృష్టించి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేసేవారిపై కూడా పోలీసులు యాక్షన్ తీసుకోవాలని రామకృష్ణారెడ్డి కోరారు.