ద‌మ్ముంటే ఆ 40 మంది ఎమ్మెల్యేల పేర్లు బయట పెట్టండి 

టీడీపీకి ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి సవాల్‌ 
 

నెల్లూరు: 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ టీడీపీ నేత‌లు చెప్పుకుంటున్నార‌ని, ద‌మ్ముంటే వారి పేర్లు బ‌య‌ట పెట్టాల‌ని కోవూరు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి స‌వాలు విసిరారు.  40 మంది వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని చంద్ర‌బాబు మైడ్ గేమ్ అడుతున్నార‌ని మండిప‌డ్డారు. ఆంబోతు అచ్చెన్నాయుడుకు మెదడులో తెలివి లేదు.. కానీ, మోకాల్లో ఉంది అంటూ ఫైర్‌ అయ్యారు.. దేనికి పనికిరాని దద్దమ్మ అచ్చెన్నాయుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యం ఉంటే మీతో టచ్ లో ఉన్న 40 మంది  ఎమ్మెల్యేల పేర్లు బయట పెట్టండి అంటూ సవాల్‌ విసిరారు.. ఇదంతా చంద్రబాబు నాయుడు ఆడే మైండ్ గేమ్ గా అభివర్ణించిన ఆయన.. ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారంటూ ఒక పెద్ద నాటకానికి తెరతీస్తున్నారు అంటూ దుయ్యబట్టారు.
 
డబ్బుకు అమ్ముడుపోయిన వారు పార్టీ నుంచి వెళ్లిపోయారు.. చెరో పది కోట్లు తీసుకుని తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించారు అంటూ పార్టీ సస్పెండ్‌ చేసిన ఎమ్మెల్యేలపై  ప్రసన్నకుమార్‌రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. మాది రాజకీయ కుటుంబమైనా వైయ‌స్‌ జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచానని పేర్కొన్నారు.  తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో  ప్రచారం చేయ‌డం స‌రికాద‌న్నారు.   ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా.. మంత్రిగా పనిచేశా.. సీఎం వైయ‌స్‌ జగన్‌ నన్ను ఎంతో ఆప్యాయంగా చూస్తారు.. అసలు నేను పార్టీ మారడం ఏంటి? అని ప్రశ్నించారు. 2012లో ఉప ఎన్నికల్లో కోవూరు నుంచి గెలిచా.. నా చివరి రక్తపు బొట్టు వరకూ వైయ‌స్‌ జగన్‌తోనే ఉంటానని స్పష్టం చేశారు.  నెల్లూరు బ్యారేజ్ కు మా నాన్న శ్రీనివాసులు రెడ్డి పేరు పెట్టారు అని గుర్తుచేశారు. 

Back to Top