చంద్రబాబు అధికారంలో లేకపోతేనే బ్రాహ్మణులు గుర్తుకు వస్తారా? 

విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజ‌య‌వాడ‌: చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడే ఈనాడుకు బ్రాహ్మణ మేధావుల మాటలు బాగా రుచిగా ఉంటాయని, వారు అనకపోయినా అన్నారని అర్ధం వచ్చేలా హెడ్డింగ్‌లు పెట్టి, వార్తా కధనాలు అల్లుతున్నారని విజయవాడ సెంట్రల్‌ శాసనసభ్యుడు మల్లాది విష్ణు అన్నారు. ఉండవల్లి అరుణ్‌కుమార్, దువ్వూరి సుబ్బారావు, ఐవైఆర్‌ కృష్ణారావు, ఎల్వీ సుబ్రమణ్యం... ఇలా వీరంతా ఈనాడుకు, రామోజీరావుకు, చంద్రబాబునాయుడుకి బంధువులు అన్నట్లుగా వారి పేరిట వార్తలు రాసే బదులు బాబు, రామోజీల సామాజికవర్గం వారి వ్యాఖ్యలనే మేధావుల వ్యాఖ్యలుగా ఇప్పుడెందుకు రాయడం లేదని విష్ణు ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికి వాక్‌ స్వాతంత్య్రం ఉందని, కాకపోతే ఈనాడుకు, తెలుగుదేశం పార్టీకి రెండు మూడు వాక్‌ స్వాతంత్య్రాలు ఉన్నట్లు కనబడుతోందని విష్ణు అన్నారు.
1). అనని మాటలు అన్నట్లు చెప్పే వాక్‌ స్వాతంత్య్రం.
2). తమకు అనుకూలంగా మాట్లాడితే దాన్ని పదింతలు చేసి ప్రచురించే వాక్‌ స్వాతంత్య్రం.
3). తమకు నచ్చని పార్టీ అధికారంలో ఉంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమకు ఎవరు ఉపయోగపడితే వారిని ఉపయోగించుకునే వాక్‌ స్వాతంత్య్రం. 

ఈ మూడూ టీడీపీకి, ఈనాడుకు ఉన్నట్లు కనబడుతోందని మల్లాది విఫ్ణు ఎద్దేవా చేశారు.
ఇవాళ మనం చూశాం ఈనాడు పత్రికలో దువ్వూరి సుబ్బారావు ఇంటర్వ్యూను మొదటిపేజీలో ప్రచురించారు. ఆయన ఏపీ ప్రభుత్వాన్ని ఏమీ అనకపోయినా అన్నట్లుగా భావించేలా హెడ్డింగ్‌లు పెట్టారు. ఇలా వేరే సామాజికవర్గాల వారిని చంద్రబాబుకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇదే బ్రాహ్మణ సామాజికవర్గం గురించి, చంద్రబాబుగారు కానీ, లేదంటే తెలుగుదేశం పార్టీ కానీ ఏరోజు కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు ఆలోచించే పరిస్థితి లేదు. ఏనాడూ ఒక టికెట్‌ ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచాలనే ఉద్దేశంతో దువ్వూరి సుబ్బారావు ఐటెమ్‌ ఫ్రంట్‌ పేజీలో వేశారు. అది కూడా వక్రీకరించి వేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోతే ఉండవల్లి అరుణ్‌కుమార్‌గారి వ్యాఖ్యలను ఫ్రంట్‌ పేజీలో వేస్తారు. ఐవైఆర్‌ కృష్ణారావుగారి వ్యాఖ్యలను తమకు అనుకూలంగా ఉంటేనే ప్రచురిస్తారు. ప్రభుత్వం మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు, మాట్లాడనటువంటి మాటలు ప్రచురిస్తారు. అయితే ఐవైఆర్‌ కృష్ణారావుగారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో, ఆయనను ఏ విధంగా అవమానపర్చారో ఆరోజు ఇదే ఈనాడు పత్రికకు కానీ, ఈ ఎల్లో మీడియాకు కానీ గుర్తుకు రాలేదు. కానీ ఈరోజు ఆయన వారికి గుర్తుకొస్తున్నారు. వారు ప్రభుత్వం మీద మాట్లాడకపోయినా, మాట్లాడినట్లు రాసే పరిస్థితి ఈరోజు ఆంధ్రరాష్ట్రంలో తయారైంది. 
ఇవాళ కులాల వారీగా, మతాల వారీగా విడగొట్టి ప్రభుత్వం మీద ఉన్నవి లేనివి, లేనివి ఉన్నవి అన్నీ పోగేసి జగన్‌గారి ప్రభుత్వాన్ని కించపర్చే విధంగా, ప్రజల్లో తేలికయ్యే విధంగా ఉన్న పత్రికలను ఈరోజు మనం చూస్తున్నాం. దీన్ని మనం అధిగమించాలి. దీన్నించి మనం బయటపడాలి అంటే మనమంతా కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను మనవి చేస్తున్నాను.

Back to Top