పల్నాడు: సారా సొమ్ముతో చంద్రబాబు జూబ్లీహిల్స్‌లో రూ.300 కోట్లతో భవనం నిర్మించారని, అందుకే నారా లోకేష్‌ను సారా లోకేష్ అంటారని వైయస్ఆర్‌సీపీ గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. యరపతినేని జనాభాను లూటీ చేసి.. గుంటూరులో రూ.50 కోట్లతో ఇల్లు కట్టాడని ఆరోపించారు. ఇలాంటి నాయకులు నీతి, నిజాయితీ గురించి మాట్లాడుతున్నారని కౌంటర్ వేశారు. బుధవారం పల్నాడులో కాసు మహేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న సారా లోకేష్.. మరుగుదొడ్లు, స్మశానాలు నిర్మిస్తున్నామని చెప్పి కోట్లు మింగాడంటూ విమర్శించారు.
బ్రహ్మానంద రెడ్డి ట్రస్ట్ భూమితో ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక కాంప్లెక్స్ నిర్మాణం చేసుకుంటుంటే.. టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా కామెంట్లు చేస్తున్నారని మహేశ్ రెడ్డి మండిపడ్డారు. లోకేష్ పిడుగురాళ్లకొచ్చి, ఏం పీకాడు? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిడుగురాళ్ళకు, గురజాలకు ఏం చేశారో వాళ్లు చెప్పలేకపోయారని అన్నారు. ఏం చేసావో చెప్పడానికి చర్చకి రమ్మంటే తుస్సుమని లోకేష్ పారిపోయాడని ఎద్దేవా చేశారు. మీరు మాట్లాడే ఉత్తర ప్రగల్భాలకు, మాటమీద నిలబడే వైయస్ జగన్ లాంటి వ్యక్తులకు ప్రజలు తేడా తెలుసుకున్నారని చెప్పారు. గురజాల ప్రాంతంలో మెడికల్ కాలేజీ, ఇంటింటికి త్రాగునీరు, బైపాస్ రోడ్లతో సహా అన్ని తామే పూర్తి చేశామన్నారు. ఇంకా మీరు పూర్తి చేసేదేంటో చెప్పండని ఎమ్మెల్యే నిలదీశారు.