వైయస్ఆర్ జిల్లా: కులం, మతం పేరుతో బీజేపీ ప్రజలను మభ్యపెడుతోందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. బద్వేలు ఉపఎన్నికపై వైయఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, వైయస్ఆర్ సీపీ అభ్యర్థి దాసరి సుధ పాల్గొన్నారు. ఉపఎన్నికల ప్రచారం, ప్రణాళికలపై బూతుస్థాయి నేతలతో సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. బద్వేలు ఎన్నికల్లో భారీ విజయం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం మొత్తం బద్వేలు వైపు చూస్తోందన్నారు. నియోజకవర్గ పరిధిలోని అందరూ కలిసికట్టుగా కృషిచేసి భారీ మెజారిటీ అందించాలన్నారు. ఇప్పుడు వచ్చే మెజార్టీ రాబోయే ఎన్నికల్లో వచ్చే సీట్లను పెంచే స్థాయిలో ఉండాలి అని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.