తాడిపత్రి నియోజకవర్గంలో పంచాయతీ నిధుల దుర్వినియోగం

సమగ్ర విచారణ కోరుతూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

అనంతపురం : తాడిపత్రి నియోజకవర్గంలో పంచాయతీ నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ, వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే  కేతిరెడ్డి పెద్దారెడ్డి  అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు.  ఈ సందర్భంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి  మాట్లాడుతూ, నియోజకవర్గంలోని పలు గ్రామ పంచాయతీలలో అభివృద్ధి పనులు చేపట్టకుండానే సుమారు రూ.5 కోట్ల మేర పంచాయతీ నిధులు డ్రా చేసినట్లు ఆరోపించారు. పనులు కాగితాలపై మాత్రమే చూపించి, వాస్తవంగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు.

గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి పనులు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు పూర్తయ్యాయని రికార్డుల్లో చూపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ పనులు ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఘోర అవినీతి చర్యగా ఆయన పేర్కొన్నారు. పంచాయతీ నిధులు గ్రామాల అభివృద్ధి కోసం వినియోగించాల్సి ఉండగా, కొందరు కూటమి నేతలు, అధికారుల కుమ్మక్కుతో నిధులు దోపిడీకి గురవుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా డ్రా చేసిన మొత్తాన్ని తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టి, నిజాలు వెలికి తీసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేసే ఇలాంటి అవినీతి చర్యలను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Back to Top