కర్నూలు: 60 దశాబ్దాలుగా స్వప్నాన్ని నిజం చేసిన మనసున్న మారాజు సీఎం వైయస్ జగన్ అని, కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్‌గా ప్రకటించి రాయలసీమ ప్రజల ఆకాంక్షలు తీర్చిన తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అన్నారు. మూడో దశ వైయస్‌ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని కర్నూలులో ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 56.88 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. ఎస్టీబీసీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. ‘ఏ ముఖ్యమంత్రి అయినా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు హామీలు ఇచ్చి మరిచిపోతారు. కానీ, సీఎం వైయస్ జగన్ మాట ఇచ్చి.. జ్యుడిషియల్ క్యాపిటల్‌గా ప్రకటించిన తరువాత కర్నూలుకు వచ్చారు.
గత ముఖ్యమంత్రి 2014 ఆగస్టు 15న కర్నూలు వచ్చి 60కిపైగా హామీ ఇచ్చి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం మన హక్కు అయిన రాజధానిని కూడా కర్నూలు నుంచి గద్దలాగా తన్నుకొని వెళ్లిపోయాడు. తొలిసారి కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం వైయస్ జగన్ రాయలసీమ ప్రజల ఆకాంక్షలు తీర్చిన తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు. రాయలసీమ వాసుల 60 సంవత్సరాల స్వప్నం అయిన హైకోర్టు ఏర్పాటు చేసి కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్ చేసిన మనసున్న మహరాజు మన జగనన్న. రాజకీయాల్లో సంస్కరణలు రావాలని చెప్పి ఆ మాటలను నిజం చేస్తూ.. బడుగు, బలహీనవర్గాలకు, మైనార్టీలకు పెద్దపీట వేస్తూ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించి దేశానికి ఆదర్శంగా నిలిచారు.
గడిచిన ఎనిమిది నెలల కాలంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. నవరత్నాల అమలు, వలంటీర్ల వ్యవస్థ, దిశ చట్టం, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, వాహనమిత్ర, జగనన్న గోరుముద్ద వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైయస్ జగన్‌ది. ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచిన ఏకైక కుటుంబం వైయస్‌ఆర్ కుటుంబం మాత్రమే. ముస్లింలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా వైయస్‌ఆర్ కుటుంబం నిలుస్తుంది. ఎన్‌ఆర్‌సీని అమలు చేయమని చెప్పినందుకు, ఎన్‌పీఆర్ ప్రస్తుత ఫార్మాట్‌ను వ్యతిరేకించినందుకు ముస్లింల తరుఫున ధన్యవాదాలు’ తెలిపారు.