చిత్తూరు: తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో సీఎస్‌డీ బిపిన్‌రావత్‌తో పాటు మరణించిన లాన్స్‌నాయక్ సాయి తేజ కుటుంబానికి అండగా ఉంటామని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి ధైర్యం చెప్పారు. శుక్రవారం ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి సాయితేజ కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిత్తూరు చిల్లా కురబలకోట మండలం, ఎగువరేగడవారిపల్లెలో లాన్స్‌నాయక్ సాయి తేజ మృతదేహం కోసం జనం ఎదురు చూస్తున్నారు. భార్య శ్యామల, ఇద్దరు పిల్లలు గురువారం ఎగువరేగడవారిపల్లెకు చేరుకున్నారు. సాయితేజ అంత్యక్రియలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ అశోక్‌కుమార్, ఇన్‌చార్జ్ తహసీల్దార్ సయ్యద్ అంతిమయాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అనంతపురం–కృష్ణగిరి జాతీయరహదారి నుంచి ఎగువరేగడకు వెళ్లే దారిని వాహనాల రాకపోకలకు వీలుగా జేసీబీతో జంగిల్‌క్లియరెన్స్ చేయించారు. లాన్స్‌నాయక్ సాయితేజకు సైనికలాంఛనాలతో అంత్యక్రియలు జరపాల్సి ఉన్నందున అందుకు తగ్గట్టుగా అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసి కావాల్సిన ఏర్పాట్లు సిద్ధం చేశారు. సాయితేజ పార్థివదేహాన్ని తల్లిదండ్రులు ఇంటికి సమీపంలోని వ్యవసాయ పొలంలో ఖననం చేస్తామని చెప్పడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేశారు.