కోవిడ్‌ థర్డ్ వేవ్ పై అప్రమత్తంగా ఉండండి

 అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి

అనంతపురం : ప్రస్తుతం కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని, కానీ ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించకుడదని,కోవిడ్ థర్డ్ వేవ్ ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని  అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి సూచించారు. నగరంలోని నీరుగంటి వీధిలో వైయ‌స్ఆర్‌ సిపి బిసి నాయకులు భాస్కర్ ఆధ్వర్యంలో స్థానికులకు ‘ఆనందయ్య’ మందు పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ..  కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆనందయ్య మందు చాలా మందికి మనోధైర్యాన్ని ఇచ్చిందన్నారు. దీన్ని ఆయుర్వేద మందుగా గుర్తించకపోయినా సంప్రదాయబద్ధంగా వాడచ్చని తెలిపారు. ఈ మందు వాడడం వల్ల ఎలాంటి నష్టం లేదని భావించి దీని పంపిణీకి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఆనందయ్య మందును ఎలా వాడాలో పూర్తిగా తెలుసుకుని దానికి అనుగుణంగా వేసుకోవాలని సూచించారు.
కరోనా థర్డ్ వేవ్ వస్తున్నట్లు వార్తలొస్తున్న తరుణంలో ప్రభుత్వం కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుందని,దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇప్పటికే నగరంలోని సర్వజనాస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులలో కోవిడ్ చికిత్సకు కావాల్సిన వసతులను కల్పించారాని, అంతేకాకుండా నగరంతో పాటు జిల్లాలో పలు చోట్ల తాత్కాలిక కోవిడ్ సెంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చారని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి  స్పష్టం చేశారు.

ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు. కోవిడ్ వలన ఇప్పటికే మనం చాలామంది ఆప్తులను కోల్పోయాం అని ఇకనైనా కరోనా పట్ల నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.మాస్క్ ను తప్పనిసరిగా ధరించడం తో పాటు,సామాజిక దూరాన్ని పాటించాలని,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, కార్పొరేటర్ బాబా, పార్టీ సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి, బిసి రమేష్ గౌడ్,గోపాల్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top