వైయ‌స్ జగన్‌ పాలనపై ప్రజల్లో నమ్మకం

 టీడీపీ పాలనలో ఇన్ని పథకాలు అందేవా?
 
ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సూటిప్రశ్న

అనంతపురం  : ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన పట్ల ప్రజల్లో నమ్మకం రెట్టింపు అయ్యిందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశామని, పథకాలు అందుతున్న తీరుపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. శనివారం నగరంలోని 23వ డివిజన్‌ పరిధిలో కార్పొరేటర్‌ హరిత ఆధ్వర్యంలో చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్‌’ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనంత హాజరయ్యారు. వైయ‌స్ఆర్‌ సీపీ సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, పార్టీ శ్రేణులతో కలిసి పలు కుటుంబాలను కలిసి ప్రజామద్దతు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ.. జగనన్నే మా భవిష్యత్‌లో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు పాలనకు, జగన్‌ పరిపాలనకు మధ్య తేడాను వివరిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో సంక్షేమ పథకాలు అందుతున్న తీరు, ఇంకా ఏమైనా మార్పులు చేసుకోవాల్సి  ఉందా? అని అడుగుతున్నామన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన ఉందని, భవిష్యత్‌లోనూ ఈ ప్రభుత్వం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు అమలు అవుతున్న పథకాలన్నీ ఇలాగే కొనసాగాలని అందరూ కోరుతున్నారన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా జగనన్నే మా భవిష్యత్‌ స్టిక్కర్లను తమ ఇళ్లకు తగిలించుకుంటున్నారని చెప్పారు. ఈనెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తమ పార్టీ గృహ సారథులు, కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు వెళ్తారని తెలిపారు. ఇక నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేస్తూ ప్రసంగిస్తున్న తీరుపై ఎమ్మెల్యే అనంత మండిపడ్డారు. అసత్య ఆరోపణలు చేస్తూ లోకేష్‌ ముందుకు వెళ్తున్నారన్నారు. లోకేష్‌ తండ్రి చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారని, లోకేష్‌ మంత్రిగా కూడా ఉన్నారని.. ఇప్పుడు అందిస్తున్నట్లు నిజాయితీగా సంక్షేమ పథకాలను టీడీపీ పాలనలో ఎందుకు ఇవ్వలేదో జవాబు చెప్పాలన్నారు. కేవలం ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను విమర్శించడమే పనిగా పాదయాత్ర కొనసాగుతోందన్నారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ప్రతిపక్షాలన్నీ కలవాలని ప్రయత్నిస్తున్నారని, ఎన్ని కుట్రలు పన్నినా 2024లో మరోసారి వైయ‌స్ఆర్‌ సీపీ విజయం ఖాయమని స్పష్టం చేశారు.  కార్యక్రమంలో జేసీఎస్‌ క్లస్టర్‌ 2 కన్వీనర్‌ చింతకుంట మధు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top