చంద్రబాబు.. ప్రతిపక్ష నేతా..? సంఘ విద్రోహ శక్తా..?

వికేంద్రీకరణతో బాబుకు జరిగే నష్టమేంటీ..?

నా కులమే బాగుండాలనేది చంద్రబాబు సిద్ధాంతం

అన్ని ప్రాంతాల ప్రజలు బాగుండాలనేది సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యం

వికేంద్రీకరణతో మళ్లీ ఉద్యమాలు రావు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

 

అసెంబ్లీ: అన్ని ప్రాంతాల ప్రజలు బాగుండాలనేది సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, వికేంద్రీకరణతో మళ్లీ ఉద్యమాలు రావన్నారు. రాజధాని రైతులకు వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం ఎప్పుడూ అన్యాయం చేయదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే చంద్రబాబు జరిగే నష్టం ఏంటని ప్రశ్నించారు.  ప్రధాన ప్రతిపక్ష నాయకులా..? లేక సంఘ విద్రోహ శక్తులా..? తేల్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ బాగుండాలి.. అందులో నేను ఉండాలనేది సీఎం వైయస్‌ జగన్‌ విధానమని, చంద్రబాబుది.. అందరూ నాశనం కావాలి.. నేనే బాగుండాలి.. అన్ని ప్రాంతాలు నాశనం కావాలి.. నా ప్రాంతమే బాగుండాలి.. అన్ని కులాలు బాగుండాలి.. నా కులమే బాగుండాలనేది చంద్రబాబు సిద్ధాంతమన్నారు.

అసెంబ్లీలో ఎమ్మెల్యే అంబటి ఏం మాట్లారంటే.. ‘తెలుగువారు ఎక్కడున్నా.. ఈ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఏం జరగబోతుంది. ఎలాంటి చర్చ జరుగుతుందని టీవీల్లో చూస్తున్నారని నా అభిప్రాయం. చరిత్రాత్మకమైన సమావేశాల్లో రాష్ట్ర భవిష్యత్తును, ముఖ్యంగా మూడు ప్రాంతాల అభివృద్ధిని కాంక్షించే విధంగా ఈ ప్రభుత్వం అధికారాన్ని వికేంద్రీకరణ చేస్తూ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును సభ్యులే కాకుండా రాష్ట్రంలోని ప్రజలంతా హర్షించాలని కోరుతున్నాను. ఐదు సంవత్సరాల క్రితం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడ్డాం.

హైదరాబాద్‌ రాజధానిగా ఏర్పడక ముందు కర్నూలును రాజధానిగా చేసుకొని కొంతకాలం పరిపాలన సాగింది. అయితే తెలుగు మాట్లాడేవారంతా ఏకంగా ఉండాలని, పెద్దలు, మేధావులు అందరూ కలిసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేసుకొని తెలుగు మాట్లాడేవారంతా ఒకే ప్రాంతంగా ఉండాలని, దేశ భాషలందు తెలుగు లెస్సా.. హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని పరిపాలన సాగించినప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర నాలుగు ప్రాంతాలుగా ఉంది. భాష ఒక్కటే అయినా యసలు వేరుగా ఉండేవి. సమైఖ్య ఉద్యమం జరిగినప్పుడు నందమూరి తారక రామారావు గారు ఓ చిత్రంలో పాటను చిత్రీకరించారు. తెలుగు జాతి మనది.. నిండుగా వెలుగు జాతి మనది. తెలంగాణ నాది.. రాయలసీమ నాది.. సక్కారు నాది.. నెల్లూరు నాది అన్నీ కలిసిన తెలుగు నాడు మనదే అని ఎన్టీఆర్‌ చెప్పారు. ఆయన వారసులని చెప్పుకుంటున్న వారు తెలుగు రాష్ట్రాలను వదిలివేశారు. ఇవాళ చంద్రబాబు.. తుళ్లూరు నాది. రాయపూరు నాది.. ఉద్దండరాయపాలెం నాది.. అన్ని కలిపిన అమరావతి నాది అని విశాఖ నాది కాదు, కర్నూలు నాది కాదు.. ఈ అమరావతి మాత్రమే నాది అనే స్థాయికి ఎందుకు దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలి.

1989లో శాసనసభ్యుడిగా హైదరాబాద్‌ వెళ్లినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా.. హైదరాబాద్‌ నాది.. చార్మినార్‌ నాది అనే భావనతో ఆ రోజున శాసనసభకు వెళ్లాను. అలాంటి హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉండి ఏకైక మహానగరంగా ఎదిగింది. అది చూసి మన హైదరాబాద్‌ అని గర్వించాం. తెలంగాణ వాసులు, మిత్రులు హైదరాబాద్‌ వదిలివెళ్లాలని హుక్కుం జారీ చేశారు. తెలంగాణ ఉద్యమం వచ్చి హైదరాబాద్‌ నుంచి మెడపట్టుకొని బయటకు గెంటారు. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. హైదరాబాద్‌కు దీటు అయిన నగరం ఏర్పాటు చేసుకోలేకపోవడం చారిత్రకమైన తప్పిదం అని గుణపాఠం ఏర్పడింది.

రాష్ట్రం విడిపోయిన తరువాత అనుభవం పేరుతో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఐదేళ్ల పాటు ఏం చేశారు. అందరికీ కావాల్సిన రాజధానిగా అమరావతిని ఎంచుకున్నారు. గుంటూరు పక్కన ఉన్నది అమరావతి. విజయవాడ పక్కన ఉన్నది మనం నిల్చున్న ప్రాంతం. అసలైన అమరావతిని పక్కనబెట్టారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే ప్రయత్నం చంద్రబాబు చేశారు. రాజధాని పెట్టాలంటే ప్రభుత్వానికి 10 వేల ఎకరాల భూమి ఉన్న ప్రాంతం లేదా..? అటవీ భూమి 22 వేల ఎకరాలు ఉందని గుర్తించి పూలింగ్‌కు ఎందుకు వెళ్లారా..? రియలెస్టేట్‌ ఎందుకు చేశారని ప్రశ్నిస్తున్నాను. బాధ్యత కలిగిన వ్యక్తి రియలెస్టేట్‌ అధిపతిగా తయారై స్కామ్‌ను సృష్టించింది వాస్తవం. దాంట్లో అన్ని తాత్కాలికమే.

స్వలాభం కోసం, వ్యాపార దృక్పధంతో తన వాళ్లకు దోచిపెట్టాలనే సంకల్పంతో బినామీలతో పెట్టుకొని వెరసి అమరావతి నిర్మాణం అనే పేరును చంద్రబాబు తీసుకువచ్చారు. అమరావతిలో పెద్ద స్కామ్‌ చేసే ప్రయత్నం చేశారు. అమరావతి నిర్మాణానికి, రాజధాని ఏర్పాటుకు శివరామకృష్ణన్‌ కమిటీని కేంద్రం నియమిస్తే.. ఆ కమిటీ అన్ని ప్రాంతాలు తిరిగి అధ్యయనం చేసి అనేక రకాల సూచనలు చేశారు. పరిపాలన వికేంద్రీకరణతో కూడుకున్నదై ఉండాలని ప్రధాన సూచన ఆ కమిటీ చేసింది. పంట భూములు రాజధానికి ఉపయోగించవద్దని చెప్పారు. కానీ, అప్పటి ప్రభుత్వం ఎందుకు వాటిని విస్మరించిందో అర్థం కాలేదు. ఆలోచన చేస్తే.. 4 వేల ఎకరాలు బినామీల పేరుతో కొనుగోలు చేసి వేల కోట్లు సంపాదించాలనే దుష్టబుద్ధితో అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారు.

ల్యాండ్‌ పూలింగ్‌ అనే విధానాన్ని తీసుకువచ్చి అసైన్డ్‌ భూములకు ప్లాట్లు, ప్యాకేజీ ఇవ్వమని మొదట చెప్పారు. ఆ భూములు చంద్రబాబు బినామీలు కొనుగోలు చేసిన తరువాత ల్యాండ్‌ పూలింగ్‌లోకి వచ్చే అసైన్డ్‌ భూములను కూడా ప్లాట్లు, ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. ఇది కేవలం బలహీనవర్గాలను దెబ్బతీసేందుకు కుట్ర పూరితంగా చేశారు. చివరకు పీఓటీని తుంగలో తొక్కే ప్రయత్నం. ఈ విధంగా అనేక స్కాములు తీసుకువచ్చారు. ఊరూరు వెళ్లి మూడు రాజధానుల గురించి, సీఎం వైయస్‌ జగన్‌ది తుగ్లక్‌ పాలన అని చంద్రబాబు అంటున్నారు. ఎవరు తుగ్లక్‌.. పది సంవత్సరాల పాటు హైదరాబాద్‌లో ఉండి పరిపాలన చేసుకునే సౌలభ్యాన్ని పార్లమెంట్‌ కల్పించింది. పది సంవత్సరాలు ఉండకుండా.. ఇక్కడ నిర్మాణాలు చేపట్టకుండా.. అర్థాంతరంగా పారిపోయి వచ్చిన పరిపాలన తుగ్లక్‌ పరిపాలన. బస్సులు పడుకున్నానని ప్రకటనలు ఇచ్చిన మీది తుగ్లక్‌ పరిపాలన. ఎవరో  నిబంధనలకు విరుద్ధంగా నిర్మించుకున్న భవనంలో నివాసం ఉంటున్న వ్యక్తిది తుగ్లక్‌ పరిపాలన. ఏదో నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకోం.

చంద్రబాబు ఏం మాట్లాడితే అది ఫ్రంట్‌ పేజీలో వేసే పత్రికలు కొన్ని ఉన్నాయి. ఆంధ్రజ్యోతి, ఈనాడు, చంద్రబాబు కలిసి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. శాసనసభలో న్యాయబద్ధంగా జరుగుతున్న చర్చపై ప్రభావం చూపించాలని ప్రజలను రెచ్చగొట్టి దౌర్జన్యం చేయించాలనే ఒక విషపూరిత ఆలోచన చేస్తున్నారు ఇది ధర్మమేనా..? మా ఎమ్మెల్యేలు పిన్నెళ్లి, కైలా అనిల్‌కుమార్‌పై దాడులు చేయించారు. అంతేకాకుండా ఉద్యమాన్ని వ్యాపింపజేయడానికి చందాలు వసూలు చేస్తున్నారు. గాజులు ఇస్తున్నారు. గాజులు, చందాలే ఇస్తున్నారా.. లేక రాళ్లు, రప్పలు కూడా ఇస్తున్నారా.. మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకులా..? లేక సంఘ విద్రోహ శక్తులా..? తేల్చుకోవాల్సిన అవసరం ఉంది.

జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ కమిటీ ఈ రెండు శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పిన విషయాలకు దగ్గర రిపోర్టులు ఇచ్చారు. 1970 నుంచి 2012 వరకు గ్రీన్‌ఫీల్డ్‌ సిటీస్‌ 30 కట్టాలని నిర్ణయిస్తే అందులో అన్ని ఫెయిల్‌ అయ్యాయి. రెండు మాత్రమే 50 శాతం చేరాయి. అలాంటి గ్రీన్‌ఫీల్డ్‌ రాజధానిని నిర్మించాలని చంద్రబాబు చేయడం తప్పు అని అన్ని కమిటీలు చెప్పినా.. ఇవాళ అమరావతి కావాలంటున్నారంటే.. కేవలం ధనాన్ని దోచేయాలనే కుట్రతో చేస్తున్న కార్యక్రమం తప్ప మరొకటి కాదు. రాజధాని కోసం కాదు.. ఆస్తుల కోసం పోరాటం చేస్తున్నారు. అందరూ బాగుండాలి.. అందులో నేను ఉండాలనేది సీఎం వైయస్‌ జగన్‌ విధానం. చంద్రబాబుది.. అందరూ నాశనం కావాలి.. నేనే బాగుండాలి.. అన్ని ప్రాంతాలు నాశనం కావాలి.. నా ప్రాంతమే బాగుండాలి.. అన్ని కులాలు బాగుండాలి.. నా కులమే బాగుండాలనేది చంద్రబాబు సిద్ధాంతం.

అమరావతిలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్‌ క్యాపిటల్‌ ఉంటే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాయనే భావన ఉంటుంది. మళ్లీ తెలంగాణ లాంటి ఉద్యమాలు వచ్చే అవకాశం ఉండదు. ప్రాంతీయ విభేదాలు లేకుండా చేస్తుంటే.. ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారు. సుజనా చౌదరి రైతా..? నిజమైన రైతులకు వైయస్‌ఆర్‌ సీపీ అన్యాయం చేయదు.

హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేస్తామని బీజేపీ చెప్పింది. ఇవాళ మా ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయబోతుంది. బీజేపీ మేనిఫెస్టోలో.. అమరావతి నిర్మాణం ఒక రియలెస్టేట్‌ వ్యాపారం లాగా సాగుతుందని పెట్టారు. మూడు పంటలు పండే భూములను మోసం చేసి టీడీపీ తీసుకుంది. బీజేపీ అధికారంలోకి రాగానే అభ్యతరించిన వారికి భూములు తిరిగి ఇస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ చెప్పింది. ఇవాళ ఆ పార్టీ అధ్యక్షుడు ఒకాయనా.. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లి ఒకాయనా ఏదేదో మాట్లాడుతున్నారు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలకు బీజేపీ కట్టుబడి ఉందా.. లేదా..? రాజధాని కోసం 24 మంది చనిపోయారని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఎవరో ఎక్కడో చనిపోతే వాళ్ల ఫొటోలను ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలకు పంపించి శవరాజకీయాలు చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు.

Back to Top