మంగళగిరి: పోలీసుల నిర్లక్ష్య వైఖరితోనే మందా సాల్మన్ హత్య జరిగిందని, సీఎం చంద్రబాబు కుట్రతోనే పక్కా పథకం ప్రకారం సాల్మన్‌ని అతి దారుణంగా పట్టపగలు ఇనుప రాడ్లతో కొట్టి చంపారని వైయస్ఆర్‌సీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో ఎస్సీ నాయకుడు మందా సాల్మన్ దారుణ హత్య నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర డీజీపీని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి ఆయన కార్యాలయానికి వెళ్లారు. రాష్ట్రంలో దిగజారిపోతున్న శాంతిభద్రతలు, ఎస్సీలపై జరుగుతున్న దాడులపై డీజీపీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. మందా సాల్మన్ ది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యేనని, దీన్ని సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సాల్మన్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతోపాటు కోటి రూపాయల పరిహారం, ఐదెకరాల పొలం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై అట్రాసిటీ కేసు నమోదు చేయడంతోపాటు ఈ హత్య ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులపై దాడులు నిత్యకృత్యమై పోయాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలు నిర్వీర్యం అయ్యాయని చెప్పడానికి మందా సాల్మన్ హత్యే తాజా నిదర్శనమని నాయకులు వివరించారు. కళ్ల ముందు దారుణాలు జరుగుతున్నా చోద్యం చూస్తున్న పోలీసులు రాబోయే వైయస్ఆర్‌సీపీప్రభుత్వంలో మూల్యం చెల్లించుకోకతప్పదని వారు హెచ్చరించారు. డీజీపీకి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో డీజీపీ కార్యాలయం గేటు వద్దనే బైఠాయించి ధర్నా చేశారు. దీంతో దిగివచ్చిన పోలీసులు వారిని లోపలికి అనుమతించి ఏడీజీకి వినతిపత్రం ఇప్పించి పంపించారు. ముందస్తు సమాచారం ఉన్నా తమను కలవకపోవడంతో ప్రజా సమస్యలను వినడానికి కూడా డీజీపీకి ఓపిక లేదా అని వైయస్ఆర్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే న్యాయస్థానాలను, ఎన్‌హెచ్చార్సీసీని, నేషనల్ ఎస్సీ కమిషన్‌ని ఆశ్రయిస్తామని, వారి కుటుంబానికి న్యాయం జరిగేదాకా వైయస్ఆర్‌సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయానికి వెళ్లిన వారిలో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, రుహుల్లా, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, విడదల రజినీ, మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి, మల్లాది విష్ణు, పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఇతర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. వారు ఇంకా ఏమన్నారంటే... ● సాల్మన్ హత్యపై ఎన్‌హెచ్చార్సీ, ఎస్సీ కమిషన్‌ని ఆశ్రయిస్తాం - మాజీ ఎమ్మెల్యే, కాసు మహేష్ రెడ్డి గతంలో బీహార్‌లో జంగిల్ రాజ్ గురించి దేశమంతా మాట్లాడుకునేది. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో అమలవుతున్న దొంగల రాజ్యం, డెకాయిట్ రాజ్యాన్ని ప్రజలు కళ్లారా చూస్తున్నారు. ఎంతోమంది వేధింపలు అనుభవిస్తున్నారు. ఒక్క పిన్నెల్లి గ్రామంలో దాదాపు 200 కుటుంబాలను ఊరి నుంచి వెలివేస్తే.. పోలీసు ఉన్నతాధికారులకు చెప్పినా ఫలితం శూన్యం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఊరి బయటే ఉంటున్న సాల్మన్.. తన భార్య అనారోగ్యంతో ఉందని వస్తే పట్టపగలు నిర్దాక్షిణ్యంగా చంపేశారు. కోమాలో ఉన్న వ్యక్తి మీద 324 సెక్షన్ కింద కేసు పెట్టారు. ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేశామని కూడా పోలీసులు ప్రకటించలేదు. ఆఖరుకి మృతుడిని, వారి కుటుంబ సభ్యులను గ్రామంలోకి కూడా అనుమతించలేదు. ఆధార్ కార్డులు చూపిస్తేనే స్మశానానికి అనుమతిస్తామంటూ దిక్కుమాలిన నిర్ణయం తీసుకున్నారు. దేశ చరిత్రలో తొలిసారి అంత్యక్రియలు చేయడానికి కూడా ధర్నా చేయాల్సిన దుస్థితిని కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకొచ్చింది. దారుణ హత్యపై డీజీపీకి ఫిర్యాదు చేయడానికి మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ప్రతిపక్ష పార్టీ నాయకులు వస్తే కనీసం మాతో మాట్లాడి వినతిపత్రం తీసుకునే ఓపిక కూడా డీజీపీకి లేకపోయింది. ఇలాంటి వారు శాంతిభద్రతలు కాపాడతారా? సాల్మన్ హత్యపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎస్సీ కమిషన్‌ని ఆశ్రయిస్తాం. వారి కుటుంబానికి న్యాయం జరిగేదాకా వైయస్ఆర్‌సీపీ పోరాటం ఆపదు. సాల్మన్ కుటుంబానికి ఇప్పటికే వైయస్ఆర్‌సీపీ తరఫున రూ. 5 లక్షల పరిహారం ప్రకటించాం. ● పోలీసుల నిర్లక్ష్యంతోనే సాల్మన్ హత్య - అంబటి రాంబాబు, గుంటూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడటానికి వచ్చిన మందా సాల్మన్ ని తెలుగుదేశం గూండాలు దారుణంగా కొట్టి చంపేశారు. పోలీసుల ఉదాసీన, నిర్లక్ష్య వైఖరి కారణంగానే సాల్మన్ హత్య జరిగింది. సాల్మన్ మీద జరిగిన దాడి గురించి ఫోన్ చేసి చెప్పినా, ఆయన భార్య స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. పైగా చావు బతుకుల మధ్య ఉన్న సాల్మన్ పైనే ఉల్టా 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. పోలీసుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేయడానికి ప్రతిపక్ష నాయకులు వచ్చినా డీజీపీ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక 15 సార్లకు పైగా వివిధ అంశాలపై ఫిర్యాదు చేయడానికి వచ్చినా డీజీపీ కనీసం బాధ్యతగా వ్యవహరించలేదు. సాల్మన్ హత్యపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి. ● సాల్మన్ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి - మేరుగ నాగార్జున, మాజీ మంత్రి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా ఇప్పటికీ రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో దళితులు వెలివేతకు గురవుతున్నారు. ఎస్సీలు ధైర్యంగా బతకలేని పరిస్థితిని కూటమి నాయకులు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి దళితులు ప్రాణాలతో ఉండాలంటే ఊర్లు వదిలేసి బయట తలదాచుకోవాల్సిన దుస్థితి నెలకొంది. భార్యకు ఆరోగ్యం బాలేదని చూడటానికి వెళ్లిన వ్యక్తిని ఇనుపరాడ్లతో అతి దారుణంగా చంపేశారు. నిందితులను అరెస్ట్ చేయాల్సిన పోలీసులు.. వారిచ్చిన ఫిర్యాదుతో ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్న సాల్మన్ మీదనే కేసు పెట్టిన దౌర్భాగ్య పరిస్థితి. సాల్మన్ హత్య పక్కా పథకం ప్రకారమే జరిగింది. రాష్ట్రంలో దళితులు వైయస్ఆర్‌సీపీకి అండగా ఉంటున్నారన్న కక్షతో వారిని భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా ఈ హత్య జరిగింది. ఆఖరుకి సాల్మన్ మృతదేహానికి తన స్వగ్రామం పిన్నెల్లిలో అంత్యక్రియలు జరగకుండా చేయాలని చూశారు. సాల్మన్ హత్యపై ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణ జరిపించాలి. మందా సాల్మన్ హత్య ఖచ్చితంగా ప్రభుత్వ హత్యే. వారి కుటుంబానికి రూ. కోటి నగదు, ఐదెకరాల భూమి ఇచ్చి ప్రభుత్వమే ఆదుకోవాలి. సాల్మన్ హత్యపై డీజీపీకి ఫిర్యాదు చేయడానికి వస్తే డీజీపీ ఆఫీసులోకి కూడా అనుమతించలేదు. నాయకులమంతా రోడ్డుపై గేటు వద్ద ధర్నాకి దిగితేకానీ లోపలికి అనుమతించారు. డీజీపీని కలవనీయకుండా ఏడీజీకి మాతో వినతిపత్రం ఇప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు నిత్యకృత్యమైపోయాయి. అనంతపురంలో దళిత బాలికపై 14 మంది అత్యాచారం చేశారు. ఆదోనిలో ఒక మహిళను తెలుగుదేశం నాయకులు కారుతో గుద్దించి చంపేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో పాఠశాల మహిళా ప్రిన్సిపల్ ను ఎమ్మెల్యేనే దారుణంగా వేధించాడు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్టులు చూస్తే దేశంలోనే ఎక్కువ నేరాలు ఏపీలోనే నమోదవుతున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగంతో దళిత బిడ్డల్ని వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైయస్ జగన్ ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం మీద దాడులు చేయడం ద్వారా దళితులకు చంద్రబాబు హెచ్చరికలు పంపాడు. ● సాల్మన్ హత్యతో దళితులను వైయస్ఆర్‌సీపీకి దూరం చేసే కుట్ర - టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే మందా సాల్మన్ దారుణ హత్యపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు ముందస్తుగా అనుమతి తీసుకుని వచ్చిన మమ్మల్ని ధర్నా చేస్తే కానీ కార్యాలయం లోపలికి అనుమతించలేదు. డీజీపీని కలవడానికి ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వచ్చినా ఆయనకు సమయం లేకపోయింది. సాధారణ వ్యక్తులతో వ్యవహరించినట్టు కూడా పోలీసులు ప్రవర్తించలేదు. స్థానిక సీఐ, ఎస్సైల తీరుని వివరించాలని వచ్చిన మమ్మల్ని కనీసం సమస్య చెప్పుకోనివ్వలేదు. ప్రతిపక్ష నాయకులు చెప్పే సమస్యలు వినే ఓపిక, తీరిక కూడా డీజీపీకి లేకపోవడం చూసినప్పుడు, ఈ ఆఫీసులో సామాన్యుల పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తే బాధకలుగుతుంది. వైయస్ఆర్‌సీపీకి అండగా ఉన్న దళితులను దూరం చేయాలన్న కుట్రతోనే దళితులపై పథకం ప్రకారం సీఎం చంద్రబాబు దాడులు చేయిస్తున్నాడు. దళితుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతీయాలన్న వ్యూహాలు రచిస్తున్నారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మీద అట్రాసిటీ కేసు నమోదు చేసి సాల్మన్ కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి పరిహారం ఇచ్చే వరకు వైయస్ఆర్‌సీపీ ఉద్యమిస్తుంది. ● చట్ట విరుద్ధంగా వ్యవహరించిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి - గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పల్నాడు జిల్లా వైయస్ఆర్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే మందా సాల్మన్ హత్య కేసులో నిందితులను తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా నిండుప్రాణం బలైపోయింది. సాల్మన్ చనిపోయేవరకు కూడా కేసు పెట్టకుండా పోలీసులు టీడీపీ నాయకులతో కుమ్మక్కైయ్యారు. చట్ట విరుద్ధంగా వ్యవహరించిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి. పిన్నెల్లి గ్రామం నుంచి భయంతో వెళ్లిపోయిన 200 కుటుంబాలను పీస్ కమిటీ ఏర్పాటు చేసి వెంటనే తిరిగి రప్పించాలి. ● కళ్ల ముందు దారుణాలు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు - విడదల రజిని, మాజీ మంత్రి మందా సాల్మన్ హత్యతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని మరోసారి రుజువైంది. పౌరులకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకుల పక్షాన పనిచేస్తోంది. వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తల మీద రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసమే పోలీస్ యంత్రాంగం పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. కూటమి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల మీద దాడులు మితిమీరిపోతున్నాయి. కళ్ల ముందు దారుణాలు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. రాష్ట్ర డీజీపీకి ప్రజా సమస్యల గురించి ఆలోచించే ప్రయత్నం చేయడం లేదు. పోలీసులు బాధ్యతగా వ్యవహరిస్తే సాల్మన్ హత్య జరిగేది కాదు. పోలీసులే దగ్గరుండి హత్యలు చేయిస్తున్నారు. చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీసులను రాబోయే వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో న్యాయస్థానాల్లో ముద్దాయిలుగా నిలబెడతాం. ● సాల్మన్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి - మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్సీ దళితుడిని పట్టపగలు దారుణంగా తల పగలగొట్టి చంపితే ప్రభుత్వం నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ కనీస స్పందన లేదు. ఎన్నికలొచ్చినప్పుడల్లా నేను పెద్ద మాదిగనని చెప్పుకునే సీఎం చంద్రబాబు.. మాదిగ కులస్తుడు మందా సాల్మన్‌ని దారుణంగా చంపితే ఎందుకు పట్టించుకోవడం లేదు? వైయస్ఆర్‌సీపీప్రభుత్వ హయాంలో ఆత్మవిశ్వాసంతో బతికిన దళితులు కూటమి ప్రభుత్వం వచ్చాక బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. దళితులను దారుణంగా వేధిస్తున్న ఈ ప్రభుత్వానికి పతనం తప్పదు. సాల్మన్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలి. తెలుగుదేశం పార్టీలో ఉన్న దళిత నాయకులు కూడా చంద్రబాబుపై ఒత్తిడి తేవాలని మొండితోక అరుణ్‌కుమార్ అన్నారు.