వైయ‌స్ జ‌గ‌న్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యం

వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ స‌భ్యుడు, మాజీ మంత్రి డాక్ట‌ర్ సాకే శైల‌జానాథ్‌

25న శింగణమలలో వైయ‌స్ఆర్‌సీపీ విస్తృతస్థాయి సమావేశానికి సన్నాహాలు 

అనంత‌పురం:   వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడమే వైయ‌స్ఆర్‌సీపీ లక్ష్యమని పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్‌ స్పష్టం చేశారు. శింగణమల నియోజకవర్గంలో ఈ నెల 25న నిర్వహించనున్న వైయ‌స్ఆర్‌సీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతపురం నగరంలోని నాయక్‌నగర్‌లో ఆయన ఆధ్వర్యంలో సంస్థాగత కమిటీల నిర్మాణంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడిన డా. శైలజానాథ్‌, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రతి మండలం, గ్రామ స్థాయిలో బాధ్యతల స్పష్టత, సమన్వయం, ప్రజలతో నిరంతర అనుసంధానం ఉండాలన్నారు. రాష్ట్రంలో దళితులు, పేదలు, బలహీన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలను వైయ‌స్ఆర్‌సీపీ సహించదని స్పష్టం చేస్తూ, ప్రజా సమస్యలపై పోరాటమే పార్టీ మార్గమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయడంక మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ, వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే రాష్ట్రానికి నిజమైన అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని తెలిపారు. సమావేశంలో మండలాల అధ్యక్షులు, అబ్జర్వర్లు, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్‌, గ్రామపంచాయతీ అబ్జర్వర్లు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top