సార్లంక అగ్నిప్రమాద బాధితులకు అండగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ

బాధితులకు భరోసా కల్పించిన దాడిశెట్టి రాజా, ముద్రగడ గిరిబాబు

కాకినాడ జిల్లా: రౌతులపూడి మండలం సార్లంక గ్రామంలో ఇటీవల జరిగిన ఘోర అగ్నిప్రమాదం హృదయ విదారకంగా మారింది. ఈ ప్రమాదంలో సుమారు 46 కుటుంబాలు పూర్తిగా నివాసాలు కోల్పోయి, కట్టుబట్టలతో రోడ్డున పడటం అత్యంత బాధాకర పరిణామంగా మారింది. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు అండగా నిలుస్తూ కాకినాడ జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గారు, అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్  ముద్రగడ గిరిబాబు గారు నేడు సార్లంక గ్రామాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారి కష్టాలు, అవసరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా  దాడిశెట్టి రాజా గారు తన ఉదారతను చాటుకుంటూ బాధితులకు తక్షణ ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ, అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నివసిస్తున్న దుస్థితిని ప్రభుత్వం గమనించి యుద్ధప్రాతిపదికన పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ప్రమాదంలో బాధితులు భూమి పత్రాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎస్టీ సర్టిఫికెట్, హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ సహా పలు కీలక పత్రాలు కోల్పోయారని, వీటిని తిరిగి పొందేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని అదే గ్రామంలో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించి అన్ని సర్టిఫికెట్లు వెంటనే జారీ చేయాలని కోరారు. బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు  మాట్లాడుతూ, ఇంత పెద్ద అగ్నిప్రమాదం జరిగినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గమని తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని వీడి బాధితులకు న్యాయం చేయాలని, తక్షణమే గృహ నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. 
సార్లంక అగ్నిప్రమాద బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా నిలుస్తుందని నాయకులు భరోసా ఇచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు 25 ఇళ్లు దగ్ధమై, సర్వం కోల్పోయిన 33 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయ‌కులు మురళి రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Back to Top