పల్నాడు: బీసీల గౌరవాన్ని కాపాడుతూ వారికి రాజకీయ, సామాజిక జీవితంలో సముచిత స్థానం కల్పించినది వైయస్ కుటుంబమేనని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ రోజు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖరరెడ్డి పాలన నుంచి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి వరకు బీసీలు, బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా పాలన సాగిందని తెలిపారు. వైయస్ కుటుంబ పాలనలోనే బీసీలకు న్యాయం జరిగిందని, సంక్షేమం–అభివృద్ధి సమపాళ్లలో అందించారని అన్నారు. ప్రస్తుత రాష్ట్రంలో “రెడ్‌బుక్ రాజ్యాంగం” పేరుతో అణచివేత పాలన సాగుతోందని ఎంఎన్ ప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు కనీసం మాట్లాడే హక్కు కూడా లేకుండా పోలీసు పాలన అమలవుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర ప్రమాదమని హెచ్చరించారు. ఇటువంటి అణచివేత ధోరణి పాలకుల పతనానికి నాంది అవుతుందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై స్పందించిన ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌కు చేసిన ద్రోహాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని అన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వ నిధులతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హయాంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవుల్లో బీసీలు, ఎస్టీలకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, అప్పట్లో సామాజిక న్యాయం ఎలా అమలయ్యిందో ఇది స్పష్టంగా చూపిస్తోందని చెప్పారు. ప్రస్తుతం వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలంలో కూటమి నాయకుల మాటలే చట్టంగా మారాయని, లా అండ్ ఆర్డర్‌ను పక్కనపెట్టి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను విచ్చలవిడిగా వేధిస్తున్నారని పోలీసు వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు చేశారు. టిడిపి నాయకులను మెప్పు కోసం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను బెదిరించడం ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధమని ఎంఎన్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈపూరు మండలంలో పోలీస్ వ్యవస్థ వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొంటూ, ఇటువంటి చర్యలను వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఇటీవల జుజ్జూరి ఐరా మూర్తిపై టీడీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, లేనిపక్షంలో పార్టీ పరంగా తీవ్ర ప్రజా పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.