ఎమ్మెల్యేకు ఉన్న పరిజ్ఞానం పవన్‌కు లేదు

చంద్రబాబు ప్యాకేజీలకు పవన్‌ లొంగిపోయారు

బలవంతపు భూసేకరణ చేయకూడదని పవన్‌కు తెలియదా?

రైతులను రెచ్చగొట్టడం కరెక్టేనా?

రాజధాని రైతులను ప్రభుత్వం ఆదుకుంటోంది

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

గుంటూరు: జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్‌కు ఉన్న పరిజ్ఞానం కూడా ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌కు లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్‌ ఇచ్చే ప్యాకేజీలకు పవన్‌ లొంగిపోయారని ఘాట్‌గా విమర్శించారు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన పవన్‌..పేదలకు, దళితులకు, సామాన్యులకు అండగా ఉన్న వైయస్‌ఆర్‌సీపీని మాత్రమే ప్రశ్నిస్తున్నారని, పేద రైతుల భూములు కాజేసిన చంద్రబాబును మాత్రం ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పర్యటనను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తప్పుపట్టారు. గుంటూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..పవన్‌..రాజధాని ప్రాంతంలో పర్యటించే ముందు మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.  గత ఐదేళ్లు పవన్‌ చంద్రబాబుతో లోపాయికారిగా స్నేహం చేసి, ఆయన ఇచ్చిన ప్యాకేజీలు తీసుకున్నారు. రైతులకు చంద్రబాబు మోసం చేసినప్పుడు ఏ ఒక్క రోజు కూడా రాజధాని ప్రాంతంలో పవన్‌ పర్యటించలేదు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఏ రోజు కూడా పవన్‌ చంద్రబాబును ప్రశ్నించలేదు. రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ నుంచి ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టలేదు. గత ఐదేళ్లు చంద్రబాబు ప్యాకేజీలకు లొంగి..ఈ రోజు రాజధాని ప్రాంతానికి వచ్చి రైతుల సమస్యలను తెలుసుకోకుండా వారిని రెచ్చగొట్టడం ఎంతవరకు వరకు సమంజసం. మేం రాజధాని ప్రాంత రైతులం..ఇటీవల ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను కలిసి రిజర్వ్‌ జోన్లను తొలగించాలని కోరాం. సమస్య ఏంటో తెలుసుకోకుండా పవన్‌ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అసలు రాజధాని అమరావతి నుంచి తరలించడం లేదు. ఇక్కడే శాసన సభ ఉంటుంది. అధికార వికేంద్రీకరణ కావాలి. ఎగ్జిక్యూటీవ్‌ రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలును చేయబోతున్నాం. చంద్రబాబు వదిలిపెట్టిన పనులు పూర్తి చేయాలంటే లక్షల కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది. రాజధాని రైతులకు సీఎం వైయస్‌ జగన్‌ న్యాయం చేస్తుంటే రైతులను రెచ్చగొట్టడం సరికాదు. రాజధాని అంశం రాష్ట్రం పరిధిలో ఉంటుందని తెలిసీ కూడా రైతులను రెచ్చగొట్టడం సరికాదు. చంద్రబాబు ఎం చెబితే..అదే పవన్‌ మాట్లాడుతున్నారు. పవన్‌కు లోక పరిజ్ఞానం లేదు. ఇది తప్పు అయితే చంద్రబాబు, లోకేష్‌ ఇస్తున్న ప్యాకేజీలు తీసుకొని మాట్లాడుతున్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటించే ముందు ఇక్కడ ఎన్ని గ్రామాలు ఉన్నాయి..రైతులు, రైతు కూలీలు, పేదలు ఎంత మంది ఉన్నారో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. సీఎం వైయస్‌ జగన్‌ అడగకుండానే రైతులకు కౌలు 15 ఏళ్లు పెంచారు. కూలీలకు రూ.2500 నుంచి రూ.5000 వరకు పరిహారం పెంచారు. సీఎం నిర్ణయాన్ని హర్షించాల్సింది పోయి చంద్రబాబు, లోకేష్‌లు చెప్పినట్లు పవన్‌ మాట్లాడటం సమంజసం కాదు. 
సుమారు 4500 ఎకరాల భూములు బినామీల పేరుతో, తెల్ల రేషన్‌కార్డు దారులతో కొనుగోలు చేయించారు. ఇవాళ కేసులు కూడా నమోదు అయ్యాయి. వీటిపై పవన్‌ నోరు మెదపడం లేదు. దళితుల భూములను చంద్రబాబు కాజేస్తే..ఆ భూములు తిరిగి దళితులకు సీఎం వైయస్‌ జగన్‌ ఇప్పించారు. ఈ విషయాలపై పవన్‌ మాట్లాడటం లేదు. చంద్రబాబు, లోకేష్‌ చెప్పిన మాటలు వళ్లవేయడంలో పవన్‌ ఉన్నారు. చంద్రబాబు బినామీ కంపెనీలతో వేల కోట్లు డబ్బులు దోచేశాడు. దీనిపై పవన్‌ మాట్లాడటం లేదు. తాత్కాలిక భవనాలకు వేల కోట్లు ఖర్చు చేసి దోచుకున్నా మాట్లాడటం లేదు. రాజధాని పేరుతో ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ కట్టకపోయినా పవన్‌ ప్రశ్నించడం లేదు. ఇన్ని బొక్కలు పెట్టుకొని ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్‌..పేదలకు, దళితులకు, సామాన్యులకు అండగా ఉన్న వైయస్ఆర్‌సీపీని ప్రశ్నిస్తానని పవన్‌ అంటున్నారు. ఇవాళ జనసేన పార్టీ ఎమ్మెల్యే కూడా సీఎం వైయస్‌ జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతు తెలిపారు. పవన్‌ ఎందుకు ఈ విషయాలపై మాట్లాడటం లేదు. పవన్‌ రైతులను, జనసేన కార్యకర్తలను కూడా మోసం చేస్తున్నారు. రాజధాని పర్యటనకు తన పార్టీ ఎమ్మెల్యేను ఎందుకు పిలువలేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. 
 

Back to Top