చంద్రబాబు సభలు ప్రజలకు ప్రాణ సంకటం

మంత్రులు ఫైర్

ప్రజల ప్రాణాలు తీసే హక్కు బాబుకు ఎవరిచ్చారు?

కందుకూరు, గుంటూరు ఘటనల్లో బాబును అరెస్టు చేయాలి

చేసిన తప్పుకు చెంపలేసుకోవాల్సింది పోయి.. మాపై విమర్శలా

గుంటూరు తొక్కిసలాట ఘటనలో బాధితులకు ప్రభుత్వ సాయం అందించిన మంత్రులు

తాడేప‌ల్లి: గుంటూరు టీడీపీ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన కుటుంబాలకు, గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు,  వైయ‌స్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులు చెక్కులు పంపిణీ చేశారు. తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వారు పరామర్శించారు.  ఈ కార్యక్రమంలో  రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, రాష్ట్ర సాంఘికసంక్షేమశాఖ మంత్రి  మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు మీడియాతో మాట్లాడారు. 

సభలకు చంద్రబాబు విరామం ప్రకటించాలి: మంత్రి అంబటి రాంబాబు
 పేదలకు కానుకల పంపిణీ పేరిట గుంటూరులో టీడీపీ దుర్మార్గమైన చర్యను సమాజమంతా ముక్తకంఠంతో ఖండిస్తుంది. టీడీపీ నేతలు సేవాకార్యక్రమాలు చేయడంలో తప్పేమీ లేదు. అయితే, అక్కడ ప్రమాదం జరిగి ముగ్గురు మహిళలు మృతిచెందడం, మరికొందరు తీవ్రంగా గాయపడటంతో టీడీపీ యూటర్న్‌ తీసుకుంది. ఎందుకంటే, రాజకీయాల్లో సందర్భాలను బట్టి యూటర్న్‌లు తీసుకోవడంలో చంద్రబాబుకు కొత్తేమీ కాదుకదా.. సరే, వారు చెప్పినట్లు గుంటూరులో జరిగిన సేవా కార్యక్రమం టీడీపీకి సంబంధించినది కాదని.. ఎవరో ఉయ్యూరు ఫౌండేషన్‌ వారిదే అనుకుందాం.. మరి, ఆ కార్యక్రమంలో చంద్రబాబు, అతని మనుషులు ఏవిధంగా మాట్లాడారు..? ఒక సేవా కార్యక్రమంలో మీరు ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నోటికొచ్చినట్టు విమర్శిస్తారా..?  తిడతారా..?. 
పేదలకు పంచే కార్యక్రమం అంటే, మీరిచ్చే సరుకులను ప్యాక్‌ చేసి మీ ఫోటోలు వేసుకుని ఇంటింటికీ పంచండి. ఎవరూ అభ్యంతరం పెట్టరు. కానీ, మీ ఇష్టానుసారంగా ఒకేచోటికి ముప్పైవేల మందిని తరలించి, సక్రమంగా ఏర్పాట్లు చేయకపోవడంతో,  తోపులాట, తొక్కిసలాట జరిగి, మనుషులు చనిపోయేంత ప్రమాదం జరగదా..? ఇలా  మనుషులను చంపే దుర్మార్గమైన చర్యకు చంద్రబాబు చెంపలేసుకోవాల్సిందిపోయి.. ఇదంతా వైఎస్‌ఆర్‌సీపీ, ప్రభుత్వం కుట్ర అని ప్రచారం చేసుకోవడం ఎంత అనైతికం. కనీసం, బాబు చెప్పే అబద్ధాలైనా అతికేటట్టు ఉండాలి. చాలా దుర్మార్గమైన విషయం ఇది. ప్రజలంతా ఆలోచించి అర్ధం చేసుకోవాలి. మొన్న కందుకూరు, నిన్న గుంటూరులో జరిగిన ఘోరాలు, ప్రాణనష్టాలకు చంద్రబాబు బాధ్యుడు కాదా..? అని నిలదీస్తున్నాను. ‘ఈరోజు రాష్ట్రంలో అశేష ప్రజాదరణ కలిగిన నాయకుడు, ప్రజావెల్లువ కలిగిన నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు అయితే.. తనకు కూడా జనం వస్తారని, ఇరుకు సందుల్లో, రోడ్లు మూసేసి జనాన్ని రకరకాల తాయిలాలతో తరలించి, డ్రోన్ షాట్లు తీసి, వాటిని మీ పచ్చ మీడియాలో చూపించుకోవాలనే కక్కుర్తి పడటం వాస్తవం కాదా చంద్రబాబూ..’ అని నిలదీస్తున్నాను.
మీ సభలకు ఏదో ఆశపడి వచ్చి అమాయక జనం ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన ఖర్మ ఏంది బాబూ..? అని అడుగుతున్నాను. నీ హయాంలో ఇది మూడో సంఘటన. గోదావరి పుష్కరాలు, కందుకూరు, గుంటూరు ఘటనల్లో అమాయకుల్ని మీరు చంపారు. కనుక, కొన్నాళ్లు చంద్రబాబు తన సభలు, పర్యటనలకు విరామం ప్రకటిస్తే బాగుంటుంది. బహిరంగ సభలు పెట్టి ఇలాంటి దుర్ఘటనలకు తావు ఇవ్వకండని నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మొన్న కందుకూరులో చనిపోయిన వారు టీడీపీ కార్యకర్తలే అయి ఉండొచ్చు.. మరి, గుంటూరులో మృతిచెందినవారు, తీవ్రంగా గాయపడినవారంతా నిరుపేదలు కాదా..? రాజకీయ కార్యకర్తలైనా.. సామాన్యులైనా..వారి ప్రాణాలు తీసేసే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారు...అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఏదిఏమైనా, ఈ ఘటనల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు, గాయపడ్డ వారికి ఈ రాష్ట్రప్రభుత్వం, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు అన్నివిధాలా అండగా ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు గుంటూరు తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2లక్షలు, గాయపడ్డవారికి రూ.50వేలు ఇవ్వడం జరిగింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వారికి ప్రత్యేకశ్రద్ధతో వైద్యసదుపాయం అందిస్తున్నాము. ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న వారు ఇంకా ఎవరైనా ఉంటే, వారి వివరాలు కూడా తీసుకుని జిల్లా కలెక్టర్‌ గారు ప్రభుత్వసాయం అందించనున్నారు. 

చంద్రబాబును అరెస్టు చేయాలి: మంత్రి  మేరుగ నాగార్జున
ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగనన్న ఆదేశాల ప్రకారం గుంటూరు తొక్కిసలాటలో మృతుల కుటుంబాలు, గాయపడిన వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు మేము ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాం. ఇక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాము. బాధితులకు ప్రభుత్వసాయం పంపిణీ చేశాం. రాష్ట్రంలో ఈరోజు చంద్రబాబు - పేదల పాలిట శాపంగా, యముడుగా తయారయ్యాడు. పేదల బతుకులపై కుట్ర చేసి.. వారి కడుపులు కొట్టాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. మొన్న కందుకూరు సభలో 8 మంది చనిపోతే.. నెల్లూరు పర్యటనకు వెళ్లిన చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఇదిగో నా సభలో మాదిగలు, మాలలు, బీసీలు, మైనార్టీలు.. ఫలానా కులాల వాళ్లు చనిపోయారు..’ అని చెబుతాడా..? ‘ఏవేవో కానుకలు ఇస్తామంటూ వాళ్లను సభలకు తీసుకెళ్లడమే కాకుండా.. ఆ కులాలన్నీ నీకోసం, నీ పార్టీ కోసం చనిపోయారని చెప్పుకుంటావా.. చంద్రబాబూ..? ’ ఇదేనా చంద్రబాబు రాజకీయ సీనియార్టీ..? మోసపూరిత కార్యక్రమాలతో జనాన్ని చంపడమేనా చంద్రబాబు రాజకీయ విజ్ఞత. గుంటూరులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ చంద్రబాబు సభ కోసమని పోలీసుల దగ్గర అనుమతి తీసుకుంటే.. జనం చనిపోయాక,  ఆ కార్యక్రమంతో మాకెటువంటి సంబంధం లేదంటారా..? ఇంకా ఎంతమందిని పొట్టనబెట్టుకుంటావు చంద్రబాబు.? చంద్రబాబు మీద చట్టప్రకారం సెక్షన్‌ 304, 506ల ప్రకారం సుమోటోగా కేసు పెట్టాలి. చంద్రబాబును అరెస్టు చేయాలి. రాజకీయపబ్బం గడుపుకోవడానికి ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలను బలిచేస్తావా.. చంద్రబాబూ..? గుంటూరులో జరిగిన ఘోరంపై చర్చకు వస్తే.. నీ తప్పేమీ లేదని తేలితే, నేను మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం. చర్చకు వస్తారా..? .రాబోమేకాలంలో ఇలాంటి చెత్తమీటింగులకు స్వస్తిపలకాలని చంద్రబాబును కోరుతున్నాను.  

అందుకే బాబు వెన్నులో వణుకు:  మంత్రి విడదల రజిని
గుంటూరులో జరిగిన కానుకల పంపిణీ కార్యక్రమంలో మృతిచెందిన, గాయపడిన వారి కుటుంబాలకు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు అండగా ఉండి.. ప్రభుత్వం తరఫున ప్రకటించిన సాయాన్ని ఈరోజు బాధితులకు అందించాము. ముగ్గురు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడ్డ 19 మందికి రూ.50 వేలు చొప్పున పంపిణీ చేశాము. ఇంకా, గాయపడిన వారు ఎవరైనా ఉంటే జిల్లా కలెక్టర్‌ గారు వారి అందించిన వివరాల ప్రకారం ప్రభుత్వ సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. గుంటూరు జీజీహెచ్‌లో ప్రస్తుతం ఇంకా ఐదుగురుకి ప్రత్యేక వైద్యం అందజేస్తున్నాం. పేదలపక్షాన నిలబడి.. వారి సంక్షేమం కోసం పనిచేస్తున్న జగనన్నకు ప్రజలంతా మద్ధతుగా ఉన్నారని తెలిసి చంద్రబాబు వెన్నులో వణుకుపుడుతుంది. 
చంద్రబాబు ప్రచారయావలో భాగంగా అమాయక జనాన్ని సభకు తరలించి ఈ విధమైన ప్రాణనష్టానికి గురిచేయడం దుర్మార్గమైన చర్యగా చూడాలి. ప్రజల్లో టీడీపీ, చంద్రబాబు ఉనికి కోల్పోయారు కనుకనే ఏదేదో ఆశలు చూపెట్టి జనాల్ని సభలకు తరలిస్తున్నారనేది ఈరోజు రాష్ట్రం మొత్తానికి తెలిసిపోయింది. ఇంత జరిగినా.. గుంటూరులో జరిగిన కార్యక్రమం టీడీపీది కాదని.. ప్రయివేటు కార్యక్రమంగా చంద్రబాబు ప్రకటించడం సిగ్గుచేటు. చంద్రన్న కానుక అని పేరుపెట్టుకుని.. టీడీపీ కార్యక్రమం అంటూ అనుమతులు కోరడం ఇవన్నీ ప్రజలకు తెలియదనుకుంటున్నారా..? చంద్రబాబుకు ఇప్పటికైనా బుద్ధిరావాలి. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు తన సభలకు వచ్చిన 40 మందిని బలితీసుకుంటారా..? ఈ చావులన్నింటికీ చంద్రబాబే బాధ్యుడు.. అని అన్నారు. 

తాజా వీడియోలు

Back to Top