చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఈఎస్‌ఐ కుంభకోణం

త్వరలో మరికొన్ని అరెస్టులు తప్పవు

మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తాడేపల్లి: ఈఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడుతో పాటు చంద్రబాబుకు కూడా సంబంధం ఉందని, బాబు డైరెక్షన్‌లోనే దోపిడీ జరిగిందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈఎస్‌ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడును అరెస్టు చేస్తే దానిపై టీడీపీ కుల ప్రస్తావన తీసుకురావడం దారుణమని మండిపడ్డారు. వందల కోట్ల ప్రజాధనం నొక్కేసి ఇప్పుడు కులాలను ఎలా ప్రస్తావిస్తారంటూ ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు ఇంకా చాలా ఉన్నాయన్నారు. అందరి బండారం తొందరలోనే బయటపడుతుందన్నారు. త్వరలో మరికొన్ని అరెస్ట్‌లు తప్పవన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు పెద్దపీట వేశారని, బీసీ సంక్షేమ కోసం తొలి ఏడాదిలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని చెప్పారు. 
 

Back to Top