వరద ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు

వరద ‍ప్రభావిత ‍ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు 
 

అమరావతి: ఎగువన కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్‌, ప్రకాశం బ్యారేజీలు నిండుకుండలా మారాయి. అయితే ఎగువ నుంచి భారీ వరదను వదలడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ప్రాజెక్టు దిగువ పలు గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి.  వరదలను ముందే పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మరోవైపు వరదల్లో చిక్కుకున్న వారి కోసం ప్రత్యేకంగా పునారావాస కేంద్రాలను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. గత నాలుగు రోజుల నుంచి వరద ఇలానే కొనసాగుతుండటంతో సహాయ చర్యల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇదివరకే ఆదేశాలు జారీచేశారు.

బాధితులకు అండగా మంత్రులు, ఎమ్మెల్యేలు
వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. మంత్రులు అధికారులను సమన్వయం చేసుకుంటూ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. సహాయ చర్యలను ముమ్మరం చేస్తున్నారు. ప్రచారానికి, ఆర్భాటానికి దూరంగా ప్రజలకు దగ్గరగా ఉంటూ వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అధికారలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. బాధితులకు అండగా నిలుస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు క్షత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ.. సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. పలు ప్రాంతాల్లో వరద బాధితులకు మంచినీళ్లు, ఆహారం అందిస్తూ.. బాధితులను ఆదుకుంటున్నారు. నది ముంపు ప్రాంతాలైన భుపేష్ గుప్తా నగర్, కృష్ణ లంక, బాలాజీ నగర్ ప్రాంతాల్లో ఇళ్లలోకి భారీ ఎత్తున వరద నీరు చేరుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో మంత్రులు కొడాలి నాని, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌, పేర్ని నాని పర్యటించారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను వెంటనే పునారావాస ప్రాంతాలకు తరలించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మరోవైపు పామర్రు నియోజకవర్గంలో 9లంక గ్రామాలు పూర్తిగా జలమయ్యం అయ్యాయి. దీంతో  ఆయా గ్రామాల్లో గల 4000 మంది జనాభాను పునారావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరద పెరిగే అవకాశం ఉండడంతో చర్యలను మరింత వేగవంతం చేయాలని మంత్రి అనిల్‌ ఆదేశించారు. వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 10 బోట్లకు పైగా సిద్ధం చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో  ఎమ్మెల్యేలు పెనమలూరు పార్థసారథి, కైకలూరులో అనిల్‌కుమార్, అవినగడ్డలో సింహాద్రి రమేష్, మంగళగిరిలో ఆర్కే, నందిగామలో డాక్టర్‌ జగన్‌మోహన్‌రావు, విజయవాడలో మల్లాది విష్ణులు పర్యటించారు. 

Back to Top