తాడేపల్లి: నిజం అనే సీఎం వైయస్ జగన్ ముందు చంద్రబాబు అనే అబద్ధం నిలబడలేదని, ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఎల్లోమీడియాతో చేతులు కలిపి ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా ప్రజలు నమ్మరని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. జూమ్ యాప్ మీటింగ్‌లతో ప్రజల మైండ్ జామ్ చేయాలని చూస్తున్నాడని, బాబు జూమ్ మీటింగ్‌లు ఎల్లోమీడియాకు మాత్రమే పనికొస్తాయన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఏలూరులో అంతుచిక్కని వ్యాధి వచ్చి ప్రజలంతా భయాందోళనలో ఉంటే ముఖ్యమంత్రి వైయస్ జగన్ స్వయంగా ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శిస్తే.. పెళ్లికి వెళ్లారని చంద్రబాబు ప్రచారం చేస్తున్నాడని మంత్రి వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. చంద్రబాబుకు మానసిక రుగ్మతతో పాటు దృష్టిలోపం కూడా వచ్చినట్లుందని ఎద్దేవా చేశారు. ఎల్లోమీడియా బలంతో ప్రజలను మభ్యపెట్టొచ్చని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని ధ్వజమెత్తారు. సీఎం ఏలూరు వెళ్లి∙పరిస్థితిని సమీక్షించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రతినిధులను రప్పించారన్నారు.
చంద్రబాబుకు తోడు ఆయన తాబేదారు పవన్ కల్యాణ్ చేరాడు. బాబు ఇల్లే కదలడు అంటే.. పవన్ బెడ్‌రూమ్ వదలడని ఎద్దేవా చేశారు. సినిమా సెట్టింగ్ ఏర్పాటు చేసుకొని, ఫ్యాన్సీ డ్రెస్ వేసుకొని.. ఫొటోలు తీసుకుంటూ రైతుదీక్ష చేస్తున్నాడని, ఫాంహౌస్‌లో కూర్చొని ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. పవన్‌కల్యాణ్ ఎప్పుడైనా ప్రజల పట్ల, ప్రజా సమస్యలు, ప్రజాలోచనకు అనుగుణంగా నడిచారా..? అని ప్రశ్నించారు. కేవలం తనకున్న సినీ గ్లామర్‌తో అభిమానులను వాడుకొని ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీకి మద్దతు ఇస్తూ నాయకుడికి ఉండే లక్షణాలు అతని దగ్గర లేవని అర్థమైందన్నారు. రెండు చోట్ల ఓడిపోయి ప్రజాప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఎలా..? అని నిలదీశారు.
నిజం తెలియని పత్రిక ఈనాడు.. ప్రభుత్వంపై బురదజల్లడం, ప్రజల దృష్టి మరల్చడం, ప్రజలకు నిజాలు తెలియకుండా చూడాలనే ఆలోచనను దినచర్యగా పెట్టుకుందని మంత్రి వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. ఇటీవల జరిగిన పంట నష్టంపై వివిధ కథనాలు రాస్తూ ప్రభుత్వంపై బురదజల్లాలని కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో పంట నష్ట పరిహారం సీజన్ పూర్తవక ముందే ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. పంట పరిహారం రెండున్నరేళ్లు దాటిన ఇవ్వని దౌర్భాగ్యం బాబు పాలనలో చోటు చేసుకుందని దుయ్యబట్టారు. ఎప్పుడూ, ఎక్కడా లేని విధంగా ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చే సంప్రదాయానికి సీఎం వైయస్ జగన్ శ్రీకారం చుట్టారన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలన – సీఎం వైయస్ జగన్ 18 నెలల పాలనలో రైతాంగ సంక్షేమంపై పోలిక రాయగలరా..? అని ఎల్లోమీడియాను ప్రశ్నించారు.