గుడులు కూల్చిన చరిత్ర టీడీపీ–బీజేపీదే

ఆలయాలు పునఃనిర్మిస్తున్న ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

టీడీపీ–బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి

ఏపీ ప్రయోజనాల గురించి జీవీఎల్‌ ఎప్పుడైనా రాజ్యసభలో మాట్లాడారా?

విగ్రహాల విధ్వంసంపై సిట్‌ దర్యాప్తులో నిజాలు నిగ్గు తేలుతున్నాయి

హిందూ మత పరిరక్షణకు ప్రభుత్వం కృషి

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో హిందూ దేవాలయాలు కూల్చిన చరిత్ర తెలుగు దేశం పార్టీ–బీజేపీలదేనని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. టీడీపీ హయాంలో కూల్చిన దేవాలయాలను మహానుబావుడు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పునఃనిర్మిస్తున్నారని మంత్రి తెలిపారు. ఇవాళ రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహులు ఏపీలో 140 దేవాలయాలు కూల్చి వేశారని అవాస్తవాలు మాట్లాడారని వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఖండించారు. బుధవారం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

మాణిక్యాలరావు మంత్రిగా ఉన్నప్పుడే..
గత టీడీపీ ప్రభుత్వంలో బీజేపీకి చెందిన మాణిక్యాలరావు దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలో విజయవాడలో 40 హిందూ దేవాలయాలను చంద్రబాబు కూల్చివేయించారని వెల్లంపల్లి శ్రీనివాస్‌ గుర్తు చేశారు. విగ్రహాలు మాత్రమే కాదు..ఏకంగా గుడులు కూల్చి చెత్త బండ్లలో వాటిని తరలిస్తుంటే బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ఆరోజు జీవీఎల్‌ ఒక్కసారైనా చంద్రబాబును ప్రశ్నించారా అని నిలదీశారు. ఈ రోజు రాజ్యసభలో మైక్‌ దొరికిందని రాష్ట్రాన్ని అవమానించేలా 141 దేవాలయాలు కూల్చారని అబద్ధాలు చెప్పారన్నారు.మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రయోజనాల గురించి జీవీఎల్‌ ఎప్పుడైనా రాజ్యసభలో మాట్లాడారా అని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలపై జీవీఎల్‌ రాజ్యసభలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

విగ్రహాల విధ్వంసం వెనుక రాజకీయ నేతలు
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన విగ్రహాల విధ్వంసం వెనుక రాజకీయ నేతలు ఉన్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ వెల్లడించారు. విగ్రహాల విధ్వంసంపై సిట్‌ దర్యాప్తులో నిజాలు నిగ్గు తేలుతున్నాయని చెప్పారు. విగ్రహాలు కూల్చిన వారిలో టీడీపీ, బీజేపీ నేతలు ఉన్నారని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోనంది విగ్రహం తరలింపు కేసులో అరెస్టు అయిన వారందరూ టీడీపీ నేతలే అన్నారు. అందుకే వారిలో భయం మొదలై..అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ–బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ సాయంత్రం టీడీపీ ఎంపీలు కేంద్ర హోం మంత్రి అమీత్‌షాను ఏ ముఖం పెట్టుకుని కలుస్తున్నారని ప్రశ్నించారు. మోదీ, అమీత్‌షాను చంద్రబాబు, టీడీపీ నేతలు దూషించినంతగా ఎవరూ తిట్టలేదని గుర్తు చేశారు. చంద్రబాబు కూల్చిన దేవాలయాలను వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం పునఃనిర్మిస్తుందని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దుర్గా గుడి అభివృద్ధికి సీఎం వైయస్‌ జగన్‌ రూ.70 కోట్లు ఇచ్చారని తెలిపారు. రామతీర్థం ఆలయానికి టీడీపీ నేత అశోక్‌ గజపతిరాజు రూ.1 లక్ష చెక్కును పంపించారని, అందులో విగ్రహాలకు మాత్రమే ఈ డబ్బులు ఉపయోగించాలని ఆయన కండీషన్‌ పెట్టారన్నారు. ఈ విగ్రహాలను టీటీడీ ఏర్పాటు చేస్తుండటంతో ఆ చెక్కును వెనక్కి పంపినట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

 

Back to Top