‘ఇంగ్లిష్‌’ బోధనకే తల్లిదండ్రుల మద్దతు

సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తూ తీర్మానాలు చేసి పంపడం హర్షణీయం

పేదలంతా ఉన్నతంగా చదవాలనేది సీఎం వైయస్‌ జగన్‌

కుప్పం నుంచి వందశాతం తీర్మాన ప్రతులు వచ్చాయి

విద్యా శాఖ మంత్రి ఆదిమూలసు సురేష్‌

సచివాలయం: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెట్టడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సమర్థిస్తున్నారని, సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తీర్మానాలు చేసి పంపించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదించిన తల్లిదండ్రులకు, పేరంట్స్‌ కమిటీలకు మంత్రి సురేష్‌ ధన్యవాదాలు తెలిపారు. సచివాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన విప్లవాత్మక నిర్ణయమన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అనేక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు హర్షించాయన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ దూరదృష్టితో ఆలోచించి లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ అందించాలని ఇంగ్లిష్‌ మీడియం బోధన విధానాన్ని తీసుకువచ్చారన్నారు. దీనిపై ప్రతిపక్షాలు వితండవాదాలు చేశాయని, మరికొన్ని పత్రికలు వక్రీకరిస్తూ రాశాయన్నారు. 

రాష్ట్రంలోని 43 వేల పైచిలుకు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పేరంట్స్‌ కమిటీలు ఇంగ్లిష్‌మీడియం బోధనపై అవగాహన కల్పించాయన్నారు. జగనన్న అమ్మఒడి వారోత్సవాల్లో భాగంగా జగనన్న అమ్మఒడి, నాడు – నేడు, ఇంగ్లిష్‌మీడియంపై అవగాహన కల్పించారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇంగ్లిష్‌ అవసరమని ఏకాభిప్రాయంతో చెప్పారన్నారు. 43 వేల పైచిలుకు ఉన్న ప్రభుత్వ పాఠశాలల నుంచి వందకు వందశాతం ఆంగ్ల మాధ్యమాన్ని బోధనను పేరంట్స్‌ కమిటీలు మద్దతు తెలుపుతూ తీర్మానాలు అందించాయి. సీఎం నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నామని తీర్మానాలు చేసి వాటిని ఎంఈఓలు, డీఈఓల ద్వారా కమిషనర్‌కు అందజేశారన్నారు. ప్రకాశం జిల్లాలో ఉన్న 3349 పాఠశాలల నుంచి వందశాతం తీర్మానాలు చేసి పంపించారు. చిత్తూరు జిల్లాలో సుమారు 4762 పాఠశాలలు ఉంటే వాటిల్లో 74 జీరో ఎండ్రోల్‌మెంట్స్‌ వాటిని మినహాయించుకుంటే 99.15 శాతం తీర్మానాలు చేసి పంపించారన్నారు. చిత్తూరు జిల్లాలో పుట్టిన చంద్రబాబు ఆంగ్ల మాధ్యమం గురించి ఏ విధంగా మాట్లాడారో.. రెండు నాలుకల ధోరణితో ఎలా యూటర్న్‌ తీసుకున్నారో ప్రజలంతా చూశారన్నారు. కుప్పం మండలంలో ఉన్న 140 ప్రభుత్వ పాఠశాలలకు గానూ.. 140 పేరంట్‌ కమిటీలు ప్రభుత్వ నిర్ణయాన్ని వందకు వందశాతం సమర్థిస్తూ తీర్మానం చేసి పంపించారని వివరించారు. యనమల, ప్రత్తిపాటి పుల్లారావు, అశోక్‌ గజపతిరాజు ఇలా టీడీపీ నాయకుల అందరి సొంత గ్రామాల నుంచి వందశాతం సమర్థిస్తూనే తీర్మానాలు వచ్చాయన్నారు. ఒక అంశంపై ఇంత పెద్ద ఎత్తున ప్రజలు స్పందించడం దేశ చరిత్రలోనే ఇది మొదటిదన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఇచ్చిన రెఫరండంగా భావిస్తున్నామన్నారు.  

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట ఇస్తే దాని కోసం ఎందాకైనా వెళ్తారని, ఎన్ని అడ్డంకులు వచ్చినా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడతామన్నారు. కీ రిసోర్స్‌ పర్సన్స్‌ని 30 మందిని ట్రైన్‌ చేసుకొని వారి ద్వారా ప్రతి జిల్లాకు 20 మందిని మొత్తం 260 మందికి వారం రోజులు తర్ఫీదు, మండలం నుంచి నలుగురును తీసుకొని సుమారు 2700 మందికి తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా దఫాలుగా టీచర్లకు ట్రైనింగ్‌ ఇచ్చామన్నారు. ఇప్పటికే 67,145 మందికి రెండు దఫాలుగా తర్ఫీదు ఇవ్వడం జరిగిందని చెప్పారు. జగనన్న విద్యా కానుక ద్వారా ప్రతి విద్యార్థికి కిట్‌ ఇవ్వడం జరుగుతుంది. కిట్‌లో పుస్తకాలు, నోట్‌బుక్స్, మూడు జతల యూనిఫాం, బెల్టు, షూస్‌ సుమారు రూ. 13 వందల నుంచి 15 వందలు విలువ చేసే కిట్‌ను ఇవ్వనున్నట్లు వివరించారు. 
 

Back to Top