పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధికి పెద్దపీట

ఆరోగ్యశ్రీకి రూ. కోటి విరాళం అందజేసిన రైస్‌ మిల్లర్స్‌

గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని, అనేక ముఖ్య పథకాలను జిల్లా నుంచే శ్రీకారం చుడుతున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. సీఎం శ్రీకారం చుట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి పశ్చిమగోదావరి జిల్లా రైస్‌ మిల్లర్స్‌ రూ. కోటి విరాళంగా అందజేశారని చెప్పారు. రాజన్న రాజ్యం తీసుకువస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చారని, ఆరు నెలల పాలన నిండకుండానే ఇచ్చిన మాటను నిరూపించుకున్నారన్నారు. ఆరోగ్యశ్రీ పైలెట్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేదికపై మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పశ్చిమ గోదావరి జిల్లా మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. పైలెట్‌ ప్రాజెక్టుగా ఆరోగ్యశ్రీ పథకాన్ని పశ్చిమ గోదావరి జిల్లాల్లో అమలు చేస్తున్నారన్నారు. ఉగాదికి ఈ జిల్లాలో సుమారు 2.64 లక్షల మందికి ఇళ్ల స్థలాలను సీఎం అందజేయనున్నారన్నారు. శుభ్రమైన నీరు తాగాలని, రూ. 4 వేల కోట్లు వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును మొదటి విడతలో జిల్లాకు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో మెడికల్‌ కాలేజీ స్థాపించి ఆరోగ్యానికి పెద్దపీట వేశారన్నారు. 
 

Back to Top