పవన్ పగటి వేషగాడు.. 

చంద్రబాబుకు పూర్తిగా అమ్ముడుపోయాడు 

మత్స్యకారుల వలసలపై పవన్‌ కళ్యాణ్‌కు అసలు అవగాహన ఉందా

వైయ‌స్‌ జగన్ సింహం ..ఎంతమంది కలిసినా ఏం చేయలేరు

మంత్రి సిదిరి అప్పలరాజు

తాడేప‌ల్లి:  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప‌గ‌టి వేష‌గాడ‌ని మంత్రి సిదిరి అప్పలరాజు విమ‌ర్శించారు.  గ్రామాల్లో పండగల సమయంలో పగటి వేషగాళ్లు వస్తారని.. ఇప్పుడు పవన్ కూడా అలాగే వచ్చాడని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనంపై 2019 తర్వాత అని పవన్ మాట్లాడుతున్నాడని.. 2014 నుంచి 2019 వరకు పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. పవన్ యజమాని చంద్రబాబు అని.. 2014 నుంచి 19 వరకు మాట్లాడొద్దు అని చెప్పాడా అని ప్రశ్నించారు. మాట్లాడితే చంద్రబాబు ప్యాకేజీ తగ్గిస్తా అన్నాడా పవన్ అని సూటి ప్రశ్న వేశారు. 

మంత్రి అప్పలరాజు ఇంకా ఏమన్నారంటే...

పవన్ వేషాలు చాలా కాస్ట్లీ గురూ..!
 పవన్‌ కల్యాణ్..  శ్రీకాకుళం జిల్లాకు వచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలడం చూశాం. పండగ పూట పగటివేషాలు వేసేవాళ్లు ముందస్తుగా వేసే డ్రామా ఇది. పొట్టకూటి కోసం వేసే వేషాలు అవి. పవన్‌ది వ్యవహారం కాదు యవ్వారం. ఇది చాలా కాస్ట్‌లీ. వందల వేల కోట్లు తీసుకుని, పగటి వేషం వేసినట్లుంది. ఉత్తరాంధ్ర వెనుకబాటు గురించి మాట్లాడుతున్నారు. 
2019 నుంచి చూస్తే అని మాట్లాడారు. అలానే ప్యాకేజీలు తీసుకున్నాడు. 
 రాష్ట్ర విభజన 2014లో జరిగింది. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు.  నువ్వు బాబుకు మద్దతుగా ఉన్నావు. నువ్వు ఆ ప్రభుత్వాన్ని నిలదీయకుండా, ఈ రోజు 2019 తర్వాత అంటూ కొత్త పాట ఎత్తుకున్నావ్‌...
  2014 గురించి మాట్లాడితే నీ ప్యాకేజీ కట్‌ చేసేస్తానన్నాడా? బాబు ఆ అయిదేళ్ల గురించి మాట్లాడవద్దని చెప్పి ఉంటాడు. ఉత్తరాంధ్రను ఎవరు వెనక్కి నెట్టేశారు, ఏ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం జరిగింది, ఎవరి హయాంలో ఏఏ అభివృద్ధి జరిగిందో మాట్లాడాల్సింది. బాబు హయాంలో ఉత్తరాంధ్ర ఎంత నిర్లక్ష్యానికి గురైందో నువ్వు మాట్లాడాల్సింది. జగన్‌ గారి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో నువ్వు మాట్లాడాలి. బాబును నువ్వు ప్రశ్నించలేవు. అతనికి నువ్వు అమ్ముడుపోయావు. ఇదంతా బాబు కుట్రలో భాగమే....

ఉత్తరాంధ్రపై బాబుకు ఉన్న విద్వేషానికి అనుగుణంగానే..
 ఉత్తరాంధ్రపై బాబుకు ఉన్న విద్వేషం,  విశాఖను పాలనా రాజధానిని చేయకూడదన్న బాబు ఆలోచనకు అనుగుణంగానే నువ్వు మాట్లాడావు. నిన్న నువ్వు నీ సభకు పెట్టిన పేరేమో యువశక్తి. ఆపేరూ టీడీపీ నుంచి వచ్చిందే. లోకేశ్‌  పాదయాత్రకు యువగళం అని..నీ సభకు యువశక్తి అని టీడీపీ రాసిచ్చిన మేరకే ఆ పేర్లు పెట్టావు. విశాఖలో కూర్చుని ఉత్తరాంధ్రపై విషం చిమ్ముతున్నారు. ఇదే నాదెండ్ల మనోహర్, చంద్రబాబు పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ) రామకృష్ణ ఉత్తరాంధ్రపై విషం చిమ్మడానికి నీకు తోడయ్యారు. మీరంతా ఒకే తానులో ముక్కలు. బాబు ఇచ్చే ప్యాకేజీ డబ్బు కోసం ఆశపడి మీరు మాట్లాడుతున్నారు. 

నాడు 2 హార్బర్లు... జగన్‌ గారి హయాంలో 9
 మత్స్యకారుల బతుకుల్లో జగన్‌ గారు వల్లే వెలుగులు వచ్చాయి..  మత్స్యకారుల వలసలు గురించి పవన్ కల్యాణ్ కు అసలు అవగాహన ఉందా?. మత్స్యకారులకు జగన్‌ గారి ప్రభుత్వం ఏం చేసిందో నీకు తెలుసా? నేను మత్స్యకార కుటుంబానికి చెందిన వాణ్ని. మా అన్నయ్యలు వలస వెళ్లి ముంబయి, గోవా వంటి ప్రాంతాలకు వెళ్లి కష్టపడి సంపాదిస్తే.. వారి సంపాదనతో చదువుకున్న వాణ్ణి. వాళ్లెందుకు వలస వెళ్లారో నాకు స్పష్టం గా తెలుసు.
 స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన ఫిషింగ్‌ హార్బర్లు రెండే రెండు. మరి నేడు రాష్ట్రంలో రాబోతున్నవి 9.  987 కి.మీ. ల తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రభుత్వాలూ మత్స్యకారుల సంక్షేమానికి ఆలోచించని సమయంలో పాదయాత్రలో శ్రీ జగన్‌ గారికి మత్స్యకారులు చేసిన విన్నపం మేరకు, మా ప్రభుత్వ హయాంలో నే 9 హార్బర్లు మంజూరు చేశారు. ఇంతకన్నా మనసున్న నాయకుడు, గొప్పనాయకుడు మత్స్యకారులకు దొరుకుతాడా?  
 మత్స్యకారుల జీవితాల్లో ఒక దేవుడిగా నిలిచిపోయేలా   9 హార్బర్లు మంజూరు చేసి, శంకుస్థాపన చేసి, నిర్మాణం పూర్తి చేయబోతున్న ఘనత శ్రీ జగన్‌ గారిది. మేం గర్వంగా ఎన్నికలకు వెళ్లగలం. నువ్వు పార్టీ పెట్టిన ఇన్నేళ్లలో  మోదీ, బాబులతో అంటకాగావు...  ఒక్క హార్బర్‌ను మంజూరు చేయించుకోలేకపోయావు.

ఫిషింగ్ హార్బర్లు పరిశీలిద్దాం వస్తావా.. ఆ దమ్ముందా పవన్? 
 నెల్లూరు జిల్లాలో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ వద్ద హార్బర్ల నిర్మాణాన్ని ఒక్కసారి వెళ్ళి చూద్దాం. మనమే వెళ్లి పరిశీలిద్దాం. మాతో వచ్చి వాటి నిర్మాణాన్ని చూసే దమ్ము నీకుందా? నువ్వు సభ పెట్టిన ఇదే రణస్థలం సమీపాన రూ. 365 కోట్లతో హార్బర్‌ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేయబోతున్నాం. నువ్వు వచ్చి చూస్తావా పవన్‌ కళ్యాణ్‌?  మా ప్రభుత్వం తరఫున నీకూ   ఆహ్వానాన్ని పంపిస్తాం. ఈ హార్బర్‌ నిర్మాణం గురించి  మేం చాలా గర్వంగా చెప్పుకోగలం. విజయనగరం జిల్లా చింతలవలస వద్ద మత్స్యకారుల కోసం ఒక ఫ్లోటింగ్‌ జెట్టీని ఇచ్చాం. విశాఖలో రూ. 150 కోట్లతో హార్బర్‌ను ఆధునికీకరిస్తున్నాం. పూడిమడక వద్ద మరో హార్బర్‌ను ఇచ్చాం. పశ్చిమగోదావరి జిల్లా బియ్యపుతిప్ప వద్ద మొన్ననే ఒక హార్బర్‌కు శంకుస్థాపన చేశాం. పత్రికలు, టీవీల్లో నువ్వు చూడలేదా? ప్రకాశం జిల్లా వాడరేవు వద్ద రెండు హార్బర్లు ఇచ్చాం. ఒకసారి వెళ్ళి చూడు..చరిత్రలో ఏ నాయకుడికీ లేని అరుదైన ఘనత జగన్ గారికి దక్కుతుంది.  ఇవి చేశాం అని జగన్‌ గారి పాలనలో సగర్వంగా ఎన్నికలకు వెళ్లగలం...

అస్త్ర సన్యాసం చేశావు...ప్యాకేజీకి పార్టీని అమ్మేశావు...
 నీకు సిగ్గుందా? ఎంత సేపూ ఊడిగం చేయడమేనా రాజకీయం... అస్త్ర సన్యాసం చేసేశావు...ప్యాకేజీకి పార్టీని అమ్మేశావు...
  ఛీ...నీ బతుకు చెడ... వీరమరణం అని మాట్లాడావు. అస్త్ర సన్యాసం చేసి, నిరాశా నిస్పృహలతో దిగజారిన పోయిన రీతిలో మాట్లాడావు. మీరు నన్ను గెలిపిస్తానని గ్యారంటీ ఇస్తారా? అని ప్రజలను అడుగుతావా? నా మీటింగులకు వస్తారు. నాకు ఓట్లేయరు...అంటూ పూర్తిగా నిరాశచెంది మాట్లాడావు. నీ కార్యకర్తలు, ప్రజల మీద నీకున్న భావమది. నీ మాటలు గుర్తు తెచ్చుకో...‘ఇల్లేమో దూరమన్నావ్‌.. గాఢాంధకారమన్నావ్‌...దారంతా గతుకులన్నావ్‌...చేతిలో దీపం లేదు కాని గుండెల నిండా ధైర్యమన్నావ్‌...’ ఇలా ఎన్నో హైఓల్టేజీ డైలాగులు చెబుతావు. ఆ మాటలు మాట్లాడిన నువ్వే పిరికిపందలా మాట్లాడుతున్నావు. అలా గర్జించిన నువ్వే వీరమరణం అంటున్నావ్? మీరు నన్ను గెలిపిస్తారా?..అంటూ దీనంగా పిరికిపందలా మాట్లాడుతున్నావ్‌...ఎందుకొచ్చిన మాటలివి...
నీ కార్యకర్తలతో కుండబద్దలు కొట్టి చెప్పేయ్‌..ప్యాకేజీ తీసుకుందామని...చంద్రబాబు మనకు వెయ్యో రెండువేల కోట్లో ఇస్తాడు. మనం టీడీపీకి పనిచేద్దామని నీ కార్యకర్తలకు చెప్పు. రెండు జెండాలు పట్టుకోవడానికి సిద్ధంగా ఉండండని నీ కార్యకర్తలకు చెప్పేయ్‌..

పవన్‌ మాటలకు మోసపోవద్దని యువతకు హితవు
 యువకులకు ఒకటే చెప్పదలుచుకున్నాను. మేమూ పవన్‌కళ్యాణ్‌ డైలాగులను చిన్నప్పుడు ఇష్టపడేవాళ్లమే. యువకులైన మీరంతా ఆ మాటల గారడీలో పడకండి..మీరంతా గ్రామాలకు మంచి చేయాలని పనిచేస్తున్నారు. మీలక్ష్యాన్ని , మీ ఆశయాన్ని, మీ  కష్టాన్ని చంద్రబాబుకు పవన్‌ తాకట్టుపెట్టేశాడు. అమ్మేశాడు. బాబు దగ్గర డబ్బులు తీసుకుని, మీ లక్ష్యానికి మిమ్మల్నందరినీ వాడుకుంటున్నాడని మీరంతా గుర్తించాలి.   కార్యకర్తలకు ఇచ్చే సందేశం స్ఫూర్తి నింపేలా ఉండాలి. ఇది నా సందేశం అంటూ నాయకుడనే వాడు ముందుకు నడిపించాలే తప్ప  ఇలా ప్యాకేజీ మాటలు మాట్లాడకూడదని నేను అభిప్రాయపడుతున్నాను.

వైయ‌స్ జగన్‌ గారు సింహం లాంటి వారు...
వైయ‌స్‌ జగన్‌ గారి గురించి నీచంగా మాట్లాడుతున్నావ్‌.. సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి   రాజును చేయలేదు. దానికున్న శక్తి సామర్థ్యాలే దాన్ని రాజును చేశాయి.  జగన్‌ గారు సింహం లాంటి వారు. నీలాంటి గ్రామ సింహాలకు బెదిరిపోయే వారు కాదు. వైయ‌స్ జగన్‌ గారి మాటలనే ఒకసారి గుర్తు చేసుకుంటే... ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతాయ్‌...అన్నారు. నువ్వు ఎంత మొరిగినా జగన్‌ గారిని ఏం చేయలేవు? ఆయన వెంట్రుక కూడా పీకలేవని నేను బలంగా చెబుతున్నాను.  

మూడు పెళ్లాల కళ్యాణ్‌ అని మేమనలేమా?
వైయ‌స్ జగన్‌ గారి గురించి నువ్వు చెడుగా మాట్లాడుతుంటే  .. మూడు పెళ్లాల కళ్యాణ్‌ అని మేం అనలేమా? ఎన్ని కళ్యాణాలు చేసుకున్నావ్‌? 
పవన్‌ అనే పేరు మధ్యలో యాడ్‌ అయింది. నీ పేరు కళ్యాణ్‌ కదా...నీ పేరును సార్థకం చేసుకున్నట్లుగా ఉంది నీ తీరు.
 ఉత్తరాంధ్ర వెనుకబాటు, వలసల గురించి మాట్లాడుతున్నావ్‌..
  2014–19 మధ్యలో చంద్రబాబు రూ.  18.87 లక్షల కోట్ల ఎంఓయూలు చేస్తే...అందులో రూ. 11,994 కోట్ల పెట్టుబడులు, అవికూడా తాత్కాలికంగా పెట్టించగలిగారు. వైయ‌స్‌ జగన్‌ గారి హయాంలో 2019–22 వరకు చూస్తే... ఏడాదికి  15637 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటివరకు ఎస్‌ఐపీబీ ఆమోదించినవి 1,81,821 కోట్ల పెట్టుబడులు ... అవి వివిధ దశల్లో ఉన్నాయి. 1.5 లక్షల జాబ్స్‌ అన్ని పరిశ్రమల్లో లభిస్తున్నాయి. ఇదీ జగన్‌ గారి ఘనత. 
 గంజాయి గురించి మాట్లాడుతున్నావ్‌... అరకులో శీలావతి రకం గంజాయి దొరుకుతుందని చెబుతున్నావ్‌... అక్కడికి వెళ్లావా? ఈ రాష్ట్ర భవిష్యత్తును, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నావ్‌. 

అదీ బట్టలూడదీయటమంటే..
 డబ్బులుకోసం ఎంత నీచమైన మాటలు మాట్లాడుతున్నావు.   రాజశేఖరరెడ్డి గారిని ఎదిరించానన్నావు.  నువ్వు రెండు చోట్ల పోటీచేస్తే డిపాజిట్లు కూడా దక్కనివ్వలేదంటే అదీ బట్టలూడదీయడమంటే...అసెంబ్లీ కాదు కదా...దాని గేటు దాకా నిన్ను రానివ్వలేదంటే అదీ బట్టలూడదీయడమంటే...రాజశేఖరరెడ్డి గారి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? అదే రాజశేఖరరెడ్డి గారి పార్టీలో నీ అన్నయ్య పార్టీని విలీనం చేసిన రోజున  చిరంజీవి గారిని అడిగావా? చిరంజీవి గారిపై మాకూ గౌరవముంది.  ఆయన్ని ఏదైనా అనాలంటే మాకు బాధనిపిస్తుంది. ఆ రోజున మీ అన్నను అడిగావా? పార్టీ విలీనం గురించి ప్రశ్నించావా? ఆ రోజున గుడ్డి గాడిద పళ్లు తోముతున్నావా?
వైయ‌స్‌  రాజశేఖరరెడ్డి గారి మీద,  వైయ‌స్ జగన్‌ గారి మీద నీకు ఎందుకు ద్వేషం. దీన్ని అసూయగానే చూడాలంటాను. నీకు జగన్‌ గారిపై అసూయ. నీ  మాటల్లో అదే కనిపిస్తోంది. మొదటి ప్రయత్నంలోనే ప్రతిపక్ష నాయకుడై, రెండో ప్రయత్నంలో ముఖ్యమంత్రి అయ్యారని జగన్‌గారిపై నీకు అసూయ. శాశ్వత ముఖ్యమంత్రిగా కొనసాగుతారనే భయం నీకు. బాబుమీద నీకు ఎందుకు ప్రేమ. నిన్ను, నీ కుటుంబాన్ని, మీ అమ్మను ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్లు తిట్టారు. అదీ మరిచిపోయి బాబుకు వంత పాడుతున్నావ్‌...ఇది ప్యాకేజీ కాకపోతే ఇంకేంటి? బాబులో నీ కేం నచ్చింది?
ఎందుకు వంతపాడుతున్నావో చెప్పు.  బాబు వల్ల ఒరిగిందేంటో చెప్పు. దమ్ముంటే ఎదురుగా రండి అని అంటున్నావ్‌... అంటే కొట్టుకోవడమా? 
వైయ‌స్ జగన్‌ గారు ఏం సాధించారో నేను చెబుతా..రాగలవా?    జగన్‌గారి పాలనలో ఎంత ప్రగతి సాధించామో, పేదలకు ఒనగూరిన లబ్ధి, విద్య వైద్యంలో ఎలాంటి అభివృద్ధి సాధించామో, ఎలాంటి మార్పులు తెచ్చామో చర్చకు వస్తే చెబుతాం. పారదర్శకత ఈ రాష్ట్రంలో ఎలా పరిఢవిల్లుతుందో చెబుతాం. మేమేం చేశామో చెప్పడానికి సిద్ధం. చేతనవుతుందా నీకు. అవగాహన ఉందా? రాగలవా నువ్వు . నువ్వు కాకపోతే నీ ప్రతినిధిని పంపించు. అదే నువ్వు అమ్ముడుపోయిన నీ యజమాని ఏం చేశాడో చెప్పగలవా? 

నీ జన్మలో నాయకుడివి కాలేవు

  •   కేవలం పండగ పూట పగటి పూట వేషాలు వేయడానికి పనికొచ్చేలా ఉంది  నీ తీరు.   నీ జన్మలో నాయకుడివి కాలేవు. ముఖ్యమంత్రివి కాలేవు. నటించడం నీ వృత్తి...
  •    గెలవడానికి వ్యూహం ఉండాలి తప్ప ఎవరినో ఓడించడానికి వ్యూహమేంటి? 
  •   ఆయన కార్యకర్తలతో మాట్లాడాల్సింది ఒకటే..   ఇన్ని కోట్లు చాలవు. మనం ఇంత అడుగుదామంటే అక్కడితో చర్చ ఉండదు. 
  •    మంత్రులు రోజా, అంబటి రాంబాబులపై పవన్‌ విమర్శలకు సమాధానంగా...
  • అది పవన్‌ చిన్నబుద్ధిని సూచిస్తోంది. పవన్‌ పార్టీ పెట్టి 9, 10 ఏళ్లవుతోంది. ఇన్నేళ్లలోరెండు చోట్ల పోటీ చేసి ఓడాడు. మరి రోజమ్మ రెండు చోట్ల గెలిచి, మంత్రి పదవిలో ఉన్నారు. రోజాపై నాగబాబుకు ఉన్న ఈర్ష్య కు కారణమేంటంటే నాగబాబు, రోజా జబర్దస్త్‌లో పనిచేసినప్పుడు రోజా గారు రెండు సార్లు ఎమ్మెల్యే,  మంత్రి అయ్యారని ఆయనకు అసూయ. రోజా గారిని తప్పుగా వ్యాఖ్యానించడం పవన్‌ ఈర్ష్యకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. 
  •   రాంబాబు గారి సంగతీ అంతే. ఆయనకున్న రాజకీయ అనుభవం ముందు పవన్‌ ఎంత? అని సీదిరి ప్రశ్నించారు.  
  •    పవన్‌ కళ్యాణ్‌ గాంధీ, పొట్టి శ్రీరాముల కులాల గురించి మాట్లాడతాడు. మాటమీద పవన్‌కు నిలకడ, నియంత్రణ లేవు. బాబు స్క్రిప్టులో ఉన్నదే మాట్లాడతాడు. కులాల గురించి మాట్లాడతాడు. మళ్లీ వాటి గురించి మాట్లాడనంటాడు.. అందుకే ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలెత్తినా పవన్ నాయకుడు కాలేడు అని మంత్రి అప్పలరాజు అన్నారు. 
Back to Top