విశాఖ గర్జన.. ప్రత్యర్థుల గుండెల్లో గున‌పం 

పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు

మా ప్రాంత అభివృద్ధికి ఎవరు అడ్డం వచ్చినా సహించం.. తొక్కుకుంటూ పోతాం

చంద్రబాబు మా ప్రాంతంలో ఎలా అడుగు పెడతాడో చూస్తాం

వంశధార ప్రాజెక్టుకు చంద్రబాబు చేసిందేమిటి..?

ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి చంద్రబాబు ఒక్క ఇటుక వేశారా..?. క‌నీసం ఇంచు భూమి సేక‌రించారా..?

తాడేప‌ల్లి: విశాఖపట్నం పరిపాలనా రాజధాని కావాలని ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లోనూ, అన్ని మండలాలు, గ్రామాల్లోని ప్రజలంతా పెద్ద ఎత్తున కోరుకుంటూ ఈ నెల 15వ తేదీన విశాఖ గర్జన కార్యక్రమానికి సన్నద్ధమవుతున్నార‌ని రాష్ట్ర ప‌శుసంర్ధ‌క శాఖ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు అన్నారు. ఉత్తరాంధ్రతోపాటు రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు మూడు రాజధానులకు, పరిపాలనా వికేంద్రీకరణకు సానుకూల దృక్పథంతో ఉన్నారన్నారు. ఈనెల 15న జరిగే విశాఖ గర్జన.. ప్రత్యర్థుల గుండెల్లో గున‌పంలా దిగబోతుంద‌న్నారు. విశాఖ రాజధాని కావాలని అంతా నడుం బిగించడానికి సిద్ధం అవుతున్న ఈ తరుణంలో గత మూడు, నాలుగురోజులుగా ఈనాడు దినపత్రికలో ఏరకమైన వార్తలు రాస్తున్నారో గమనించాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. ఈనాడు దినపత్రిక వ్యవహార శైలి ఉత్తరాంధ్ర వాళ్లతోనే ఉత్తరాంధ్ర కంటిని పొడిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తోందని మండిప‌డ్డారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి అప్ప‌ల‌రాజు ఇంకా ఏం మాట్లాడారంటే..

"ఒకరోజు దసపల్లా భూములు అని, మరో రోజు ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లు అని, ఇవాళ ఉత్తరాంధ్ర విద్యాలయాలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ" అబద్ధాలు, అసత్యాలతో వరుస కట్టుకథలతో ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమం చేస్తోంది. చంద్రబాబు నాయుడు హయాంలో ఉత్తరాంధ్రకు చేసిందేంటి?. మూడేళ్ల కాలంలో మా ప్రభుత్వం ఏం చేసిందనేది చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. 

దసపల్లా భూముల విషయానికి వస్తే అవి ప్రయివేట్‌ భూములని హైకోర్టు, సుప్రీంకోర్టులే తీర్పులు ఇచ్చాయి. న్యాయస్థానం ప్రయివేట్‌ భూములని స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది?. దానిమీద సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ కూడా వేశాం. దానిపై కూడా ప్రయివేట్‌ భూములే అని మళ్లీ తీర్పు వచ్చింది.  క్యూరేటివ్‌ పిటిషన్‌పై కూడా వారికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. ఒకానొక దశలో కోర్టు కంటెంప్ట్ ప్రొసీడింగ్స్‌ కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితిలో ఆ భూముల్ని దానికి సంబంధించిన ప్రయివేట్‌ యజమానులకు అప్పగించడం తప్ప  ప్రభుత్వం ఏమి చేయగలుగుతుంది. ఆ ప్రయివేట్‌ వ్యక్తులు ఆ భూముల్ని ఎవరికి అమ్ముకుంటారనేది, ఏ డెవలపర్‌కు ఇచ్చుకుంటారనేది వారిష్టం. దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం.?

చంద్రబాబుకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడం అంటే చాలా ఇష్టం. వెంచర్లు వేయడం, అమ్మడం, తన మనుషులతో అమ్మించడంలో చంద్రబాబు బాగా ఎక్స్‌పర్ట్‌. చంద్రబాబుకు దసపల్లా భూములు కావాలంటే... ఆ ప్రయివేట్‌ వ్యక్తుల నుంచి కొనుక్కోవచ్చు. రామోజీరావు అయినా అంతే కొనుక్కోవచ్చు. మాకేంటి సంబంధం..? ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని వ్యాపారాలు చేయడం చంద్రబాబుకు కానీ, ఆయన మనుషులకు కానీ బాగా అలవాటు. విశాఖలో గీతం యూనివర్శిటీ ఎలా వచ్చింది? దాని ద్వారా ఎన్ని భూములు ఆక్రమించుకున్నారు? ఏరకంగా యూనివర్శిటీ కట్టారో అందరికీ తెలిసిన విషయమే. అలానే,  రామోజీరావు ఈనాడు ఆఫీసులను,  ఫిల్మ్‌సిటీని ఎలా కట్టారో తెలియదా? మళ్లీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి..?

14 ఏళ్ళు సీఎంగా ఉండి ఉత్తరాంధ్రకు ఏం చేశావు బాబూ..?
ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు సంబంధించి చూస్తే.. "ఈ మూడేళ్ల కాలంలో సీఎం వైయ‌స్‌ జగన్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్ట్‌ అయినా పూర్తి చేసిందా" అంటూ ఈనాడు దినపత్రిక రాసింది. మీకు సిగ్గులేదా అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఈ ప్రాజెక్ట్‌లను ఎందుకు పూర్తి చేయలేకపోయారని మీరెందుకు అడగలేకపోయారు రామోజీరావు..?. 14ఏళ్లలో మీరు పూర్తి చేయలేని ప్రాజెక్ట్‌లను, ఈ మూడేళ్ల కాలంలోనే ఎందుకు పూర్తి చేయలేకపోయారని అడుగుతున్నారంటే మీది సిగ్గు, ఎగ్గూలేని నీచాతి నీచమైన మీడియాగా రామోజీరావు ఈనాడు దినపత్రిక తయారైంది.

  • వంశధార ప్రాజెక్ట్‌ కోసం చంద్రబాబు చేసిందేంటని రామోజీరావును సూటిగా ప్రశ్నిస్తున్నా? ఆ ప్రాజెక్ట్‌ పూర్తిచేయాలని చంద్రబాబుకు ఆలోచన ఉందా?. 
  • వైయస్సార్‌ హయాంలో ఫేజ్‌-2కి అనుమతి ఇవ్వడం జరిగింది. ఆయన హయాంలోనే హిరమండలం రిజర్వాయర్‌కు నీళ్లు తీసుకురావాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన  చంద్రబాబు దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారు. కనీసంగా ఆలోచన అనేది కూడా చేయలేకపోయారు. 
  • మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన వంశధార ఫేజ్‌-2 పనులు పూర్తి చేసే దశకు చేరుకున్నాం. అందుకోసం ఒడిశా సర్కార్‌తోనూ సంప్రదింపులు జరిపాం.
  • నేరడి బ్యారేజ్‌ కట్టడానికి ముందుగానే హిరమండలం రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో నింపేందుకు గొట్టా బ్యారేజ్‌ దగ్గర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి ప్రపోజ్‌ చేయడం, దానికోసం జీవో ఇవ్వడం జరిగింది. 
  • వంశధార ప్రాజెక్ట్‌ పూర్తి చేయడానికి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం.
  • రామోజీరావు.. ఇవేమీ చంద్రబాబును అడగరు. ఎందుకంటే మీరంతా ఒకే తానులో ముక్కలు కాబట్టి.
  • ఉద్దానంలో వేలాదిమంది కిడ్నీ వ్యాధులతో చనిపోతున్నారని, వారికి ఒక రీసెర్చ్‌ ఆస్పత్రి కట్టాలని చంద్రబాబును ఏనాడైనా ప్రశ్నించారా?
  • వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పుణ్యమా అని.. కిడ్నీ రీసెర్చ్‌ ఆస్పత్రికి సంబంధించి 70శాతం పనులు పూర్తి చేసుకోగలిగాం.
  • రూ. 700 కోట్లుతో ఉద్దానంకు మంచినీటి ప్రాజెక్ట్‌ నిర్మాణం పనులు 70శాతం పూర్తి కావడం వైయ‌స్‌ జగన్‌ ఘనతగా చెప్పాలి.
  • శుద్ధి చేసిన మంచినీళ్లను ఒక్క చుక్కనీరు అయినా బాబు హయాంలో ఇప్పించగలిగారా? అని ప్రశ్నిస్తున్నాం. 

సుజల స్రవంతికి ఇంచు భూమైనా సేకరించావా బాబూ..
అలానే, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు విషయానికొస్తే.. వైయ‌స్‌ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆ ప్రాజెక్ట్‌కు చంద్రబాబు ఒక్క ఇటుక అయినా ఎందుకు వేయలేకపోయాడు?. ఇటుక కాదుకదా.. ఇంచి భూమిని కూడా సుజల స్రవంతి ప్రాజెక్ట్‌ కోసం చంద్రబాబు సేకరించగలిగారా?.  ఉత్తరాంధ్ర పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఒక్కమాటలో చెప్పగలరా?.  మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే ల్యాండ్‌ ఎక్విజేషన్‌ ప్రక్రియను ప్రారంభించింది.  పోలవరం ప్రాజెక్ట్‌ నీటిని విజయనగరం వరకూ తీసుకువెళ్లగలమనే యోచన చంద్రబాబు ఎందుకు చేయలేదు?

  • యూనివర్శిటీల గురించి తీసుకుంటే... యూనివర్శిటీ లేని జిల్లా పాత విజయనగరం జిల్లా. ఒక్క యూనివర్శిటీ లేదు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు గురజాడ యూనివర్శిటీ పెడుతున్నామంటూ చంద్రబాబు ఒక ఉత్తుత్తి జీవో ఇచ్చాడు. వర్శిటీ పెట్టాలంటే జీవోలతో సరిపోదు. ప్రత్యేకమైన చట్టం చేయాలి.  అదే గురజాడ యూనివర్శిటీకి ప్రత్యేక చట్టం చేసి వర్శిటీని నెలకొల్పిన ఘనత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిది. 
  • గత ప్రభుత్వ హయాంలో ప్రయివేట్‌ సంస్థలు విశాఖలో పెట్టారని రామోజీరావు రాశారు. సిగ్గులేని, బరితెగించి రాసిన రాతలవి. 
  • విభజన వల్ల జరిగిన గాయానికి సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంస్థలను కూడా చంద్రబాబు ఖాతాలోనే వేశారు. ఆయనే ఆ వర్శిటీలను తెప్పించినట్లు ఈనాడు రామోజీ రాతలు రాశారు.  చంద్రబాబు సీఎం కాకున్నా, ఎవరు సీఎంగా ఉన్నా ఆ సంస్థలు కచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి తీరుతాయి. ఇందులో చంద్రబాబు గొప్పతనం  ఏమీ లేదనేది అందరూ గమనించాలి.
  • గతంలో ఉన్న ఆంధ్రా మెడికల్‌ కాలేజీ, కింగ్‌ జార్జ్‌ హాస్పటల్‌... ఇవన్నీ చంద్రబాబు పెట్టినవి కాదనేది రామోజీరావు గుర్తించాలి.
  • శ్రీకాకుళంలో రిమ్స్‌ కాలేజీ కూడా వైయ‌స్‌ రాజశేఖర రెడ్డి హయాంలోనే వచ్చింది. చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్రలో ఒక్క మెడికల్‌ కాలేజీ అయినా పెట్టాడా?
  • ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ అధికారంలోకి వచ్చాక విజయనగరం, అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం, పాడేరులో మెడికల్‌ కాలేజీలు పెడుతున్నాం. వీటన్నింటిని టీచింగ్‌ హాస్పటల్స్‌గా మార్పు చేసుకుంటున్నాం.
  • సీతంపేట, పార్వతీపురంలో సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి కడుతున్నాం. ఇవేమీ మీకు కనిపించవా రామోజీ..?
  • విమ్స్‌ ఆస్పత్రి కూడా వైయస్సార్‌ పుణ్యాన వచ్చిందే. విమ్స్‌ ఆస్పత్రి అభివృద్ధి కోసం చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేదు. అలాంటి మీరు ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడతారా?
  • మీ హయాంలో ఉత్తరాంధ్రకు తీసుకువచ్చిన ప్రాజెక్ట్‌ ఏదైనా ఉందని గుండె మీద చేయి వేసుకుని చెప్పగలవా చంద్రబాబూ? 
  • శ్రీకాకుళంలో అంబేడ్కర్‌ యూనివర్శిటీ, రిమ్స్‌ మెడికల్‌ కాలేజీ, విశాఖలో విమ్స్‌ కూడా వైయస్సార్‌  హయాంలోనివే. 

బాబుకు బంట్రోతులా అచ్చెన్నాయుడు
టీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రబాబుకు బంట్రోతు అయిన మా ప్రాంతానికి చెందిన అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్రకు తీసుకువచ్చిన ప్రాజెక్ట్‌లు ఏంటని మమ్మల్ని అడుగుతున్నాడు.  భావనపాడు పోర్టు కట్టడానికి వైయ‌స్‌ జగన్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు.  భావనపాడు పోర్టు వద్దని మీ మనుషులతో మాట్లాడించింది నిజం కాదా అచ్చెన్నాయుడు?

  • ఓ పక్క ఉత్తరాంధ్ర వెనుకబడిపోతోందని మాట్లాడుతూ.. మరోవైపు ఈ రాజకీయాలు ఏంటని ప్రశ్నిస్తున్నా?. ప్రాజెక్ట్‌లు మేము తీసుకువస్తే వాటికి మోకాలడ్డు వేయడం మీరే చేస్తున్నారు.
  • భావనపాడు పోర్టు వద్దని కూన రవికుమార్‌ అఖిలపక్షం పేరుతో ధర్నా చేశాడు కదా.. దానిమీద మీ పత్రికలో రాయండి రామోజీరావు..
  • మీలాంటివాళ్లు ఎంతమంది అడ్డు వచ్చినా భావనపాడు పోర్టు పూర్తవుతుంది.
  • భోగాపురం విమానాశ్రయానికి ఇటుక వేయగలిగావా చంద్రబాబూ? దానికి సంబంధించిన అన్ని అంశాలను కోర్టులో మేము పరిష్కరించుకున్నాం. వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కచ్చితంగా భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తారు.
  • శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులు పెద్ద ఎత్తున వలస వెళుతున్నారు. వాళ్లు ఎందుకు వలసలు వెళ్లిపోతున్నారని ఏనాడైనా చంద్రబాబు  యోచన చేశారా? వీటన్నింటికి సమాధానం చెప్పాలని చంద్రబాబుకు అనిపించలేదా? రామోజీరావుకు కనిపించలేదా? వీటిపై ఏరోజు అయినా ప్రశ్నించాలనే ఆలోచన రామోజీరావుకు రాకపోవడం విడ్డూరంగా ఉంది.
  • వలసల్ని అరికట్టేందుకు శ్రీకాకుళం జిల్లాలో ఫిష్షింగ్ హార్బర్‌ నిర్మించబోతున్నాం. నవంబర్‌లో శంకుస్థాపన చేయబోతున్నామని రాసుకోండి రామోజీ. అలానే విశాఖలోని హార్బర్‌ ఆధునీకరణకోసం 150కోట్లు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా పూడిమడక దగ్గర రూ. 330 కోట్లతో మరో హార్బర్‌కు శంకుస్థాపన చేయబోతున్నాం. కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద మరో హార్బర్‌ నిర్మాణం జరుగుతోంది. 
  • మత్స్యకారులు మీ దృష్టిలో మనుషులు కారా? వారి జీవన ప్రమాణ స్థాయిని పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న పనులు మీకు కనిపించడం లేదా?
  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అంటే సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన రాష్ట్రం. ఈ తీరప్రాంతాన్ని బలోపేతం చేయాలని, అన్ని వనరులు ఉపయోగించుకోవాలని చంద్రబాబుకు ఎందుకు ఆలోచన రాలేదు?
  • గంగవరం, కృష్ణపట్నం పోర్టులు వైయ‌స్‌ రాజశేఖర రెడ్డి హయాంలోనివే. రామాయపట్నం పోర్టు వైయ‌స్‌ జగన్‌  హయాంలో మొదలైంది, ఇక మచిలీపట్నం, భానవపాడు పోర్టులు కూడా పూర్తవుతాయి.
  • వైయ‌స్‌ రాజశేఖర రెడ్డి తన హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పుడు ఆయన తనయుడు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొనసాగిస్తున్నారు.

బాబు మార్క్ ఒక్కటైనా ఉందా..?
14 ఏళ్లు సీఎంగా, 40ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఉన్న చంద్రబాబు, ఉత్తరాంధ్రకు గానీ, రాష్ట్రానికి గానీ నేనిది చేశాను.. ఇది నా మార్క్‌.. అనేలా ఒక్క ప్రాజెక్ట్‌ గురించి అయినా చెప్పగలడా?. ఒక అబద్ధాన్ని సృష్టించి, అదే నిజమని ప్రజల్ని నమ్మించేలా పద్థతి ప్రకారం, ఆర్గనైజ్‌డ్‌ ప్రాసెస్‌లో గోబెల్స్ ప్రచారం చేస్తూ, నమ్మించే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజల్ని తప్పుదోవపట్టించేలా చేస్తున్న ప్రయత్నాలను ప్రజలంతా గుర్తించారని, ఇకనైనా మీ కుట్రలు మానండి అని చంద్రబాబుకు, రామోజీరావుకు చెప్పదలచుకున్నాను.  ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. మళ్లీ వెన్నుపోటు ఒక చారిత్రక అవసరం అని మీరే మాట్లాడతారు. తిరిగి ఎన్టీఆర్‌కు మీరే దండలు వేయడం విచిత్రంగా ఉంటుంది.  ఆనాడు రాష్ట్ర విభజనకు మద్దతు పలికి.. ఇప్పుడేమో విభజన వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందంటూ మీరే గోల చేస్తారు. ప్రత్యేక హోదా విషయంలోనూ అలాగే మాట్లాడి మీరెన్ని యూటర్న్‌ లు తీసుకున్నారో ప్రజలకు తెలుసు. చంద్రబాబు అన్ని సందర్భాల్లోనూ యూటర్న్‌ లు తీసుకున్నారు. యూటర్న్‌ బాబు అనే పేరు సంపాదించుకున్నారు.

  • అమరావతి విషయంలో చంద్రబాబు ఎందుకు అంత పట్టుదలకు పోతున్నాడంటే.. అందులో అతని స్వార్థం, అతని రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని అందరికీ అర్థమవుతుంది.  చంద్రబాబు  డిజైన్‌ చేసిన రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో మీ సామాజికవర్గం, మీ మనుషుల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయానా? 
  • ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవించని చంద్రబాబు.. తన బంట్రోతు అచ్చెన్నాయుడుతో మా మంత్రులను ఇష్టానుసారంగా తిట్టిస్తున్నాడు. దీనిపై చంద్రబాబు, ప్రజా కోర్టులో సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఇదే ధోరణి ​కొనసాగితే మిమ్మల్ని పాతాళానికి తొక్కి, విశాఖపట్నం రాజధానిగా ప్రజలు చేసుకుంటారు.
  • రామోజీరావు, మీరు రాస్తున్న తప్పుడు రాతలు వల్లే,  ఇవాళ వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు అనేక మీడియా సంస్థలు, సోషల్ మీడియా చంద్రబాబుకు వ్యతిరేకంగా పుట్టుకువస్తున్నాయి.  మిమ్మల్ని తలదన్నే మీడియా సంస్థలు పుట్టుకు వచ్చాయి. నిజాలు అనేక మాద్యమాల ద్వారా ప్రజలకు చేరువ అవుతున్నాయి. మీరు చేసే దుష్ప్రచారం ప్రజల మనసుల్లో నిలబడలేవనేది గత ఎన్నికల్లో రుజువు అయింది. ఇప్పటికైనా చంద్రబాబుకు మంచిబుద్ధి రావాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.
     
Back to Top