అసెంబ్లీ: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు సభలో గూండాల్లా, సైకోల్లా ప్రవర్తించారని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. స్పీకర్ చైర్ మీద గౌరవం లేకుండా స్పీకర్ చుట్టూ చేరి పేపర్లు చింపేసి మొహం మీద విసిరేశారని, స్పీకర్ ముందున్న మానిటర్, మంచినీటి గ్లాస్ పగులగొట్టి.. అరుస్తూ సభా సంప్రదాయాన్ని గౌరవించకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. శాసనసభ సమావేశాలను బాలకృష్ణ షూటింగ్ అనుకుంటున్నాడేమో.. మీసాలు తిప్పుతూ, తొడలు కొడుతున్నాడన్నారు. ఏరోజూ ప్రజా సమస్యలపై ప్రస్తావించని బాలకృష్ణ.. బావ కళ్లలో ఆనందం చూడటానికి అసెంబ్లీకి వచ్చినట్టున్నాడన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి రోజా మాట్లాడారు. ‘‘తండ్రి ఎన్టీఆర్ మీద చెప్పులు వేసినప్పుడు చంద్రబాబుపై బాలకృష్ణ మీసాలు తిప్పి ఉంటే రాష్ట్ర ప్రజలు హర్షించేవారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో సాక్షాధారాలతో అడ్డంగా దొరికిపోతే కోర్టు జైలుకు పంపించింది. తప్పు చేసినవారు ఎవరైనా జైలుకు వెళ్తారని గౌరవ కోర్టు, పోలీస్ స్టేషన్ల మీద ప్రజలందరికీ నమ్మకం వచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్‌లో స్కామ్ చేసిన దొంగ కోసం అసెంబ్లీలో మాట్లాడటం కేవలం పబ్లిసిటీ కోసమే అని అర్థం అవుతుంది. నిజంగా చంద్రబాబు తప్పు చేయకపోతే.. ఏసీబీ కోర్టులో 10 గంటలు విచారణ చేశారు. చంద్రబాబుకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చారు. అప్పుడెందుకు స్కిల్ స్కామ్ జరగలేదని, తన ప్రమేయం లేదని, డబ్బులు తినలేదని ఆయన, ఆయన తరఫు లాయర్ ఎందుకు మాట్లాడలేదు. కేవలం గవర్నర్‌కు చెప్పలేదు, 24 గంటల్లో తీసుకురాలేదనే కుంటి సాకులు చెప్పారు తప్ప.. తప్పు జరగలేదని వారు కూడా చెప్పలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ జరిగింది. దాదాపు రూ.241 కోట్లు దోచేసిన దోపిడీదారుడు చంద్రబాబు. సాక్ష్యాధారాలతో దొరికాడు కాబట్టే ఆయన్ను రాజమండ్రి జైల్లో పెట్టారని అందరికీ తెలుసు’’ అని మంత్రి రోజా చెప్పారు.