విజయవాడ: రజనీకాంత్‌తో చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడించారని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. రజనీకాంత్ వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. పిల్లనిచ్చిన మామ, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌పై అసభ్యకర కార్టూన్లు వేయించి దారుణంగా అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. రజనీకాంత్‌కు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదన్నారు. రజనీకాంత్ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ కూడా బాధపడుతుందన్నారు. ఎన్టీఆర్ అభిమానులను బాధపెట్టేలా రజనీ మాట్లాడారని, చంద్రబాబు అధికారంలో లేనప్పుడే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. విదేశాల్లో తెలుగువారు ఉద్యోగాలు పొందడానికి కారణం దివంగత మహానేత వైయస్‌ఆర్ అని గుర్తుచేశారు. చంద్రబాబు విజన్ 2020 వల్ల టీడీపీ 23 సీట్లకు పరిమితమైందని, విజన్ 2047కి చంద్రబాబు ఏ దశలో ఉంటారో రజనీకాంత్‌కు తెలుసా..? అని ప్రశ్నించారు. రజనీపై తెలుగు ప్రజలకు ఉన్న గౌరవాన్ని తన మాటలతో తగ్గించుకున్నారన్నారు. ఎన్టీఆర్‌కి భారతరత్న 27 ఏళ్లలో ఎందుకు ఇప్పించలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ని యుగపురుషుడు అన్నవారు ఎందుకు వెన్నుపోటు పొడిచారని మంత్రి రోజా నిలదీశారు.