శ్రీకాకుళం: ఇల్లాలి గౌరవం పెంచేందుకే పథకాలు విస్తృత రీతిలో అమలు చేస్తున్నామని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలోని ఎఫ్.సి.ఐ.రోడ్,జి.ఎల్.ఫంక్షన్ హాల్ లో ఆసరా పథక లబ్ధిదారులతో ఆయన సమావేశం అయ్యారు. సభకు శ్రీకాకుళం రూరల్ మండలం,ఎస్.ఎస్.వలస,అలికాం,భైరివానిపేట,నైర,బట్టేరు,పొన్నాం,చింతాడ,కె.మన్నయ్య పేట,గేదెలవాని పేటకు చెందిన లబ్ధిదారులు విచ్చేశారు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత దేశ తొలి ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. జయంతి సందర్భంగా ఆయనకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఇంటి నిర్వహణలో కీలకం అయి నిలిచే ఇల్లాలికి ఆర్థిక ఆసరా అందించేందుకు ఈ పథకం అమలు చేస్తున్నాం. ఓ కుటుంబం ఎవరి చేతిలో అయితే బాగు పడుతుంది అన్న విషయం చూసినప్పుడు ఇల్లాలిదే ప్రముఖ స్థానం అని తేలింది. మా అధ్యయనంలో భాగంగా ఇంట్లో ఉండే భర్తకు సమానంగా ఆ ఇంటి ఇల్లాలు కూడా భాగం పంచుకుంటున్నారు అని తేలింది. పిల్లలను చదివించి, అదేవిధంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఇంటి గౌరవాన్ని సమాజంలోనూ, చుట్టూ ఉన్న బంధువుల దగ్గర నిలబెట్టేది ఇల్లాలే అని నిర్థారణ అయింది. కొందరు మగవాళ్లు బాధ్యత చూపించరు. కానీ ఇల్లాలు మాత్రం అంతా తానై ఇంటిని నడిపే దాఖలాలు ఉన్నాయి. అస్సలు కొంత మంది ఏమీ పట్టించుకోరు. అదేదో హక్కులా ఫీలయిపోయి కొందరు బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారు. అలాంటి వారిని ఉద్దేశించి నేను వారిని పోరంబోకులుగా తయారయ్యారు. కోపం వచ్చింది ఆ మాట విని కొందరికి. తన కుటుంబం గురించి తన రక్తం పంచుకన్న బిడ్డల గురించి,తనతో జీవితం పంచుకున్న భార్య గురించి,తనకు జీవితం ఇచ్చిన తల్లిదండ్రుల గురించి పట్టించుకోని మగాళ్ల గురించి ఆ మాట అన్నాను. అంతేకానీ వేరే ఉద్దేశంతో కాదు. బాధ్యత లేని మగవాళ్లకు బదులు అన్ని బాధ్యతలూ చూసుకునే ఇల్లాలికి పథకాలు వర్తింప జేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు సీఎం జగన్. ఆ విధంగా అన్ని పథకాలూ ఇల్లాలికే వర్తింపజేసేందుకు ముఖ్యమని భావించారు. మహిళా సాధికారతలో భాగంగా అన్ని రకాల హక్కులూ కల్పించేందుకు సీఎం నిర్ణయించారు. సాధికారత తాలుకా ప్రయోజనాలు ఇవాళ మహిళలు పొందగలుగుతున్నారు. పూర్వం ఈ విధంగా పరిస్థితి అన్నది ఉండేది కాదు. ఆర్థిక క్రమశిక్షణను మగువలు పాటించాలి. అలానే పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. మీరు జగన్ కు ఓటేయకుంటే మీ చేతులు మీరు నరుక్కోవడమే. మిమ్మల్ని శక్తిమంతులను చేస్తే మీరు అటువంటి వారిని దూరం చేసుకుంటే చేసేదేం లేదు. అందుకే కష్టం అయినా నష్టం అయినా ఇవాళ మీరు అవమానాలు పాల్పడకుండా ఉండేందుకు ఆసరా పథకం కింద డ్వాక్రా రుణాలు చెల్లింపునకు సీఎం కృషి చేస్తూ ఉన్నారు. నాలుగు విడతల్లో చెల్లించేందుకు వీలుగా బ్యాంకర్లతో మాట్లాడి ఒప్పించారు. ఇప్పటికే మూడు విడతలు చెల్లించారు. ఇంక ఒక్క విడత మాత్రమే మిగిలి ఉంది.కనుక అది కూడా చెల్లించేస్తాం. మీరంతా సంఘాల బలోపేతానికి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. అలానే ఆ రోజు చంద్రబాబు చెప్పిన విధంగా మాట తప్పిన దాఖలాలు లేవు. అలానే ఆ రోజు చంద్రబాబు చెప్పిన విధంగా రైతుల రుణాల విషయమై, మహిళల రుణాల విషయమై జగన్ స్పందించి సత్వర చర్యలు తీసుకున్నారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట నిలుపుకున్న జగన్ కూ, ఆ రోజు ఇచ్చిన మాటను మరిచిపోయిన చంద్రబాబుకూ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలను గమనించండి. మేలు చేసే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి. పథకాల అమలు అన్నది ఇవాళ డబ్బు వృథా అని చెప్పడం కొన్ని విపక్షాలు ఎంచుకున్న విష ప్రచారంలో భాగం. పథకాల అమలులో భాగంగా ఈ రోజు ఎక్కడా మధ్యవర్తులకు చోటే లేదు. మార్పు ఉంది. మార్పు అన్నది ఇవాళ ఎంతో గొప్పగా ఉంది. హాయిగా ఇంటిల్లపాదీ జీవించేందుకు వీలుగా చూడడం అన్నది ప్రధానం అయిన మార్పు. మీరు ఈ మార్పును గమనించి జగన్ కు, మీకు సహాయం చేసిన ప్రభుత్వానికీ, ఓ నాయకుడికీ ఓటు వేయకుండా ఉంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఇంత కష్టం కూడా వృథా అయిపోతుంది. అదే మీరు గెలిపిస్తే మహిళలు జ్ఞాపకం పెట్టుకుంటారు. గెలిపిస్తారు.. అన్న మాట తప్పక వినిపిస్తుంది. మీరు ఈ ప్రభుత్వంకు మద్దతుగా నిలిచి మేలు చేసే నాయకత్వాలకు అండగా ఉండండి అని విన్నవిస్తూ ఉన్నాను. మహిళలకు సాయం చేస్తే వేస్ట్ అనిపించుకుంటారో బెస్ట్ అనిపించుకుంటారో అన్నది మీ ఇష్టం. ఇంతవరకూ కుటుంబ గౌరవాన్ని నిలిపిన ఇల్లాలికి మరింత చేయూత ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల తీరును ఓ సారి గమనించండి. మీ కోసం పనిచేసిన మీ ఉన్నతికి కారణం అయిన మీ కుటుంబాల సంతోషాలకు కారణం అయిన ప్రభుత్వానికి మరోసారి అండగా ఉండండి. ఈ విషయాలు చెప్పేందుకు, అలానే విపక్షాల విష ప్రచారం నిలువరించేందుకు ఇవాళ ఇక్కడికి వచ్చాను. అబద్ధపు ప్రచారాలను నమ్మకండి. ఈ ప్రభుత్వం అన్నది మహిళల పక్షపాతి అని మరోసారి విన్నవిస్తూ ఉన్నాను. ఇవాళ కుటుంబం అంతా హాయిగా ఉంటున్నారు. అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన లాంటి పథకాలు అమలు చేస్తూ ఉన్నాం. జగనన్న గోరుముద్ద పేరిట పోషకాహారం అందిస్తూ ఉన్నాం. ఆ విధంగా మధ్యాహ్న భోజన పథకం ను సమర్థంగా నిర్వహిస్తున్నాం. మీ పిల్లల చదువులు ధనవంతుల బిడ్దలతో సమానంగా అందేవిధంగా కృషి చేస్తున్నాం. ఇవాళ మీరు అనుభవిస్తున్న సౌకర్యాలు గుర్తించండి. అలానే పింఛను రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున అందిస్తున్నాం. మీరు గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు అందుకుంటున్న పథకాలు వాటి ఫలితాలు అన్నింటినీ గుర్తించండి. మరోసారి మీకు మీ పిల్లల ఉన్నతికీ పాటుపడే ప్రభుత్వానికి అండగా ఉండండి. మీకు అధికారం ఇచ్చే అధికారం ఉంది. ఓటు ద్వారా మీరు మద్దతుగా ఉండండి. మీ పిల్లల విద్యకూ, మీ కుటుంబాల గౌరవాన్నీ పెంపొందించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వానికి మరోసారి ఓటు వేయండి. రేపు అధికారంలోకి వస్తామన్న పార్టీ ఈ పథకాలు అన్నీ వృథా అని విపక్ష పార్టీ ప్రయత్నిస్తోంది. అంటే వాళ్లు అధికారంలోకి వస్తే పథకాలు ఆపేస్తాం అని నేరుగా చెప్పగలరా ? ఇవాళ పథకాల అమలు అన్నది కష్టం అయినా అమలు చేస్తున్నాం. చంద్రబాబు లా మాట తప్పను. మా నాన్న వైఎస్సార్ మాదిరిగా నాకు కూడా పేరు రావాలి అన్నది జగన్ భావన. మొదట్నుంచీ ఈ ప్రాంతం నాకు అండగా నిలబడుతున్నారు. శిలగాం సింగు వలసకూ - తండే వలసకు మధ్య బ్యాంకు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. అది త్వరలోనే రూపుదిద్దుకోనుంది. అలానే స్థానిక సమస్యల పరిష్కారానికీ కృషి చేస్తాం. 330 ఇళ్లు ఈ ప్రాంత వాసులకు ఒకేసారి మంజూరు చేశాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇన్ని ఇళ్లు ఏ ప్రభుత్వం కూడా మంజూరు చేయలేదు. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తించాలి. ఇదేం చిన్న విషయం కాదు. కష్టమయినా నష్టమయినా ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలూ నెరవేరుస్తున్నాం. అవ్వాతాతలకు పింఛను పేరిట రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అందిస్తున్నాం అంటే అందుకు కారణంగా ఇవాళ మీరు ఇచ్చిన అధికారమే ఇదే కాదు ఇప్పటి పథకాలన్నీ అమలు కావాలంటే ఈ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తేనే సాధ్యం. ప్రభుత్వంలో ఉన్నారు కనుకనే జగన్ ఇన్ని పథకాలను అమలు చేయగలిగారు. అందుకే ఈ విషయాన్ని మీరు గుర్తించి మరోసారి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని రావాలని విన్నవిస్తూ ఉన్నాను అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. జెడ్పీ సఈవో వెంకట్ రామన్, పిడి.డిఅర్డిఎ విద్య సాగర్, ఎంపిపి అంబటి నిర్మల శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ పైడి శెట్టి జయంతి, జెడ్పీటీసీ రుప్పా దివ్య, ఎఎంసి చైర్మన్ ముకళ్ల తాత బాబు, వై వి సూర్య నారాయణ, అంబటి శ్రీనివాస్ రావు, చిట్టి జనార్ధన రావు, గేదల చంగాల్ రావు, చిట్టి రవి కుమార్,కంచు వసంత, ఉటపల్లి కృష్ణ, చంద్ర మౌళి, వాసు, రామ కృష్ణ, రావాడ మోహన్, యజ్జల గురుమూర్తి, నీలాద్రి తదితరులు పాల్గొన్నారు.