ఆన్ లైన్ టికెటింగ్ విధానానికి అందరూ మద్దతు ఇస్తున్నారు

 మంత్రి పేర్ని నాని

 సినీ ప్రతినిధులతో మంత్రి పేర్ని నాని సమావేశం

ఎగ్జిబిటర్ల సాధకబాధకాలను తెలుసుకున్నాం  

 తాము పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని వెల్లడి

విజ‌య‌వాడ‌: ఆన్ లైన్ టికెటింగ్ విధానానికి అందరూ మద్దతు ఇస్తున్నారని  మంత్రి పేర్ని నాని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినీ ఎగ్జిబిటర్లు, సినీ ప్రతినిధులతో ఏపీ మంత్రి పేర్ని నాని ఇవాళ‌ సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సినిమా ఎగ్జిబిటర్ల సాధకబాధకాలను వివరంగా తెలుసుకున్నామని వెల్లడించారు. సినిమా ప్రదర్శనల అంశంలో ఎగ్జిబిటర్లకు ఉన్న సమస్యలు, ఏపీలో సినిమాలు తీసేటప్పుడు నిర్మాతలు కోరుకునే సౌలభ్యాలను అన్నీ నమోదు చేసుకుని సమీక్ష జరుపుతామని తెలిపారు. ఈ అంశాలను సీఎం వైయ‌స్ జగన్ కు నివేదిస్తామని వివరించారు.
 
ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకానికి ఎగ్జిబిటర్లు, ఫిలించాంబర్ ప్రతినిధులు, నిర్మాతలు తమ సంపూర్ణ మద్దతు తెలిపారని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ప్రస్తుతం దీనిపై సమీక్షిస్తున్నామని, సూచనలు అందించేందుకు సినీ ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సగటు సినీ ప్రేక్షకుడికి వినోదం అందుబాటులో ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని, అదే సమయంలో ఆన్ లైన్ టికెటింగ్ విధానం పారదర్శకంగా ఉండాలనేది తమ ప్రయత్నమని స్పష్టం చేశారు. తాము ఈ అంశంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, అన్నివైపుల నుంచి సానుకూల స్పందన రావడం హర్షణీయమని పేర్కొన్నారు. ఆన్ లైన్ టికెటింగ్ విధానంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరలే ఉంటాయని వెల్లడించారు.

ప్రజలకు ఇబ్బందిలేనటువంటి విధానం తీసుకురావాలని అగ్రహీరో చిరంజీవి కోరారని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. చిరంజీవి అంటే సీఎం వైయ‌స్ జగన్ కు గౌరవం, సోదర భావం వున్నాయని, తప్పకుండా మెరుగైన నిర్ణయాలే తీసుకుంటామని వివరించారు.

ఇవాళ్టి సమావేశంలో... తమకు బెనిఫిట్ షోలు కావాలని ఒక్కరు కూడా అడగలేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. నిర్మాతలు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబిటర్లు కానీ ఎవరూ అడగలేదని అన్నారు. రోజుకు 4 ప్రదర్శనలు చాలన్నదే అందరి అభిప్రాయం అని తెలిపారు.

చర్చలు చాలా ఆనందకరం: టాలీవుడ్‌ నిర్మాత సి.కళ్యాణ్‌
ఏపీ ప్రభుత్వంతో జరిగిన చర్చలు చాలా ఆనందకరమని టాలీవుడ్‌ నిర్మాత సి.కళ్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యలన్నింటిని ఓపిగ్గా విని పరిష్కారం చూపుతామని వెల్లడించినట్లు పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీకి పెద్ద సహకారం ఇచ్చారని, ఇది ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన భరోసా అని తెలిపారు. దివంగత వైయ‌స్సార్‌ సినీ ఇండస్ట్రీకి ఎంతో చేశారని నేడు సీఎం వైయ‌స్‌ జగన్‌ కూడా అలాగే చేస్తున్నారని ప్రశంసించారు.
 

త్వరలోనే సీఎం వైయ‌స్ జగన్‌తో భేటీ
ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం తామే అడిగామని నిర్మాత కళ్యాణ్‌ పేర్కొన్నారు. దానితో పాటు 4 షోలు 12 గంటలలోపు పూర్తి చేయడంపై చర్చించినట్లు తెలిపారు. విద్యుత్ బిల్లుల అంశం, 100 శాతం ఆక్యుపెన్సీపై కూడా చర్చించామన్నారు. అన్ని వర్గాలు ఈ రోజు చర్చల పట్ల ఆనందంగా ఉన్నాయని, ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి కావాల్సినవి అన్ని ప్రభుత్వం చెప్పిందని త్వరలోనే సీఎం వైయ‌స్‌ జగన్‌తో భేటీ అవుతామని వెల్లడించారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top