మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అతిపెద్ద స్కామ్

ప్రైవేటీకరణ తర్వాత రెండేళ్ల జీతాల చెల్లింపు మరో పెద్ద స్కామ్

వైయస్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్

ప్రైవేటీకరణ నిర్ణయంపై వెల్లువెత్తిన ప్రజానిరసన

రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి పైగా సంతకాలు 

ప్రభుత్వ నిర్ణయంపై ఇది కచ్చితంగా రెఫరెండమే

తేల్చి చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ, ప్రజలు చేసిన కోటిసంతకాల ప్రతుల వాహనాలను తాడేపల్లి 
వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పరిశీలించిన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.

అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి

ఏపీని మెడికల్ హబ్ గా మార్చాలన్నదే వైయస్.జగన్ కల

అందులో భాగంగానే 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం

అధికారంలోకి రాగానే నిర్మాణాలను నిలిపివేసిన చంద్రబాబు

ఇది మమ్మాటికీ ముందస్తు కుట్రే

కమిషన్ల కక్కుర్తితోనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ

మండిపడ్డ సజ్జల రామకృష్ణారెడ్డి

ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటం

కాలేజీల ప్రైవేటీకరణతో పాటు అప్పనంగా ఆస్తులు అప్పగింత

అదనంగా 2 ఏళ్ల జీతాలు ప్రభుత్వం నుంచి చెల్లింపు

దీని ద్వారా దాదాపు రూ.1400 కోట్లు ఖజానాపై అదనపు భారం

ఇది మరో భారీ కుంభకోణమన్న సజ్జల రామకృష్ణారెడ్డి 

రేపు(గురువారం) సాయంత్రం గవర్నర్ గారికి కోటి సంతకాల ప్రతుల సమర్పణ

వైయస్.జగన్ ఆధ్వర్యంలో గవర్నర్ ని కలవనున్న వైయస్ఆర్‌సీపీ బృందం

చంద్రబాబు ఇప్పటికైనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంచాలి

లేకపోతే మేం అధికారంలోకి రాగానే వీటిపై సమీక్షిస్తాం

బాధ్యులను బోనెక్కిస్తాం, జైలుకు పంపిస్తాం

స్ప‌ష్టం చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి  

తాడేపల్లి:  మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అతిపెద్ద స్కామ్ కు పాల్పడుతుందని వైయస్ఆర్‌సీపీ స్టేటే కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా కోటిమందికి పైగా చేసిన సంతకాల ప్రతులను తాడేపల్లి వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వద్ద పరిశీలించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు ప్రజల ఉసురు తీస్తున్నారని మండిపడ్డారు. కోటిమందికి పైగా చేసిన సంతకాలే... ప్రైవేటీకరణ నిర్ణయంపై వెల్లువెత్తిన ప్రజానిరసనకు నిదర్శనమని, ప్రభుత్వ నిర్ణయంపై ఇది కచ్చితంగా రెఫరెండమే అని ఆయన తేల్చి చెప్పారు. ఏపీని మెడికల్ హబ్ గా మార్చాలని కలగన్న వైయస్.జగన్ అందులో భాగంగానే 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు. అయితే అధికారంలోకి రాగానే కాలేజీల నిర్మాణాలను నిలిపివేసిన చంద్రబాబు... కమిషన్ల కక్కుర్తితోనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మమ్మాటికీ ముందస్తు కుట్రేనని.. . ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని ఆక్షేపించారు. కాలేజీల ప్రైవేటీకరణతో పాటు అప్పనంగా ఆస్తులు అప్పగిస్తున్న చంద్రబాబు.. అదనంగా 2 ఏళ్ల పాటు రూ.1400 కోట్లు జీతాలు ప్రభుత్వం నుంచి చెల్లించాలన్న నిర్ణయం.. మరో భారీ కుంభకోణమని స్పష్టం చేశారు. చంద్రబాబు తీరుకు నిరసనగా రేపు సాయంత్రం వైయస్.జగన్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం గౌరవ గవర్నర్ గారికి కోటి సంతకాల ప్రతులు సమర్పిస్తారని  తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన... లేనిపక్షంలో వైయస్సార్సీపీ అధికారంలోకి రాగానే వీటిపై సమీక్షించి, బాధ్యులను బోనెక్కిస్తామని స్పష్టం చేశారు. 
ఇంకా ఆయన ఏమన్నారంటే... 

● ఏపీని మెడికల్ హబ్ చేయడమే వైయస్.జగన్ లక్ష్యం...

ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకుని రావటమే కష్టం, అలాంటి అనుమతులన్నీ వైయస్.జగన్ సాధించి 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని కాలేజీలు తెచ్చారు. దేశంలోనే ఉత్తమ మెడికల్ హబ్ గా ఏపీని మార్చాలని జగన్ కలలు కన్నారు. ఆ మేరకు కింది స్థాయి నుండి పటిష్ఠం చేసుకుంటూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే... ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేసింది. అనంతరం ప్రైవేటీకరణకు సిద్ధమైంది. ప్రైవేటు రంగంలోనే అత్యుత్తమ సేవలందుతాయని తాను నమ్ముతున్న సిధ్దాంతాన్ని అమలు చేయడం ప్రారంభించాడు. తాను అధికారంలో లేనప్పుడు ఎప్పుడూ ప్రైవేటు రంగం గురించి నోరెత్తని చంద్రబాబు.. గెలిచిన తర్వాత ప్రైవేటు రంగంలో మంచి సేవలు అందుతాయని చెప్పడం అలవాటు.

● ఆర్ధిక వనరులు లోటు లేకున్నా ప్రైవేటీకరణ మంత్రం...

వైయస్.జగన్ ప్రభుత్వ వైద్య కళాశాలను పూర్తి చేయకుండానే, కేవలం కాలేజీలని నిర్మించాలని లక్ష్యంగా మాత్రమే చెబితే.. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం కష్టమని చెప్పడంలో అర్ధముంది. కానీ ఐదు మెడికల్ కాలేజీలను వైయస్.జగన్ పూర్తి చేసి, ఆ కాలేజీల్లో అడ్మిషన్లు జరిగి, విజయవంతంగా కాలేజీలు నడుస్తున్నాయి. మరో రెండు కాలేజీలు పూర్తయ్యాయి, మరో మూడు కాలేజీలు నిర్మాణం పూర్తి చేసుకునే దశలో ఉన్నాయి.. అంటే మొత్తం 10 కాలేజీలు దాదాపు పూర్తైన దశలో ఎందుకు వాటిని ఆపాల్సి వచ్చింది. మరో కీలకమైన అంశం ఏమిటంటే... కాలేజీల నిర్మాణానికి నిధుల కొరత లేకుండా వివిధ ఆర్ధికసంస్ధలతో వైయస్.జగన్ ప్రభుత్వమే టై అప్ అయింది. నీకు కావాల్సిందల్లా కాలేజీల నిర్మించాలన్న మనసు మాత్రమే. అదే చంద్రబాబుకు లేదు. 

చంద్రబాబు హెరిటేజ్ తో సహా ఎవరైనా ప్రైవేటు రంగంలో ఉచితంగా సేవలు అందిస్తారా?  రూపాయి పెట్టుబడి పెట్టి రూ.10, రూ.20, రూ.50 ఎలా సంపాదించాలనే వస్తారు. చంద్రబాబు ఏం చెప్పినా పీపీపీ అనేది ఓ పెద్ద స్కామ్. ఇంకా జనాల చెవిలో పువ్వులు ఎలా పెట్టగలననుకుంటున్నాడో తెలియడం లేదు? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలకోసం వైయస్.జగన్ అక్టోబరులో పిలుపునిస్తే... ఈ రెండు నెలల్లో వచ్చిన ప్రజాస్పందన చూసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజల అభిప్రాయం చంద్రబాబుకు అర్దం కావడం లేదు. కోటి సంతకాలకు అక్టోబరులో పిలుపునిస్తే.. జనంలో వస్తున్న స్పందన అందరికీ తెలుసు.
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా  ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రిఫరెండంలా.. చరిత్రలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎప్పూడూ చూడని విధంగా తొలిసారిగా ఇంత పక్కాగా ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు. వైయస్ఆర్‌సీపీ ఆధ్యర్యంలో ప్రతిచోటా జనంలోని వెళ్లి సంతకాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పేదలతో పాటు సమసమాజం కావాలనుకునేవాళ్లు,  సమాజంలో అసమానతలు తగ్గించాలని కోరుకునేవారు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు.

● ప్రైవేటీకరణే చంద్రబాబు విజన్...

ఇవాల్టకి చంద్రబాబు కొంచెం తగ్గి.. వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వం పేరు పెద్దదిగా ఉంటే... ప్రైవేటు వాళ్ల పేరు చిన్న అక్షరాల్లో ఉంటుందని చెబుతున్నారు. కాలేజీల భవనాలు, ఆసుపత్రులు, భూమి అంతా ప్రైవేటు వాళ్ల చేతుల్లో పెట్టిన తర్వాత వాళ్లు పేరు పెట్టినా, పెట్టకపోయినా ఏం ప్రయోజనం ఉంటుంది. పైగా వారికి రెండేళ్ల జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించడానికి అంగీకరించడం మరించి ఆశ్చర్యకరం. ఇన్ని ప్రైవేటు వారికి ఇచ్చినప్పుడు... ప్రభుత్వమే ఎందుకు నిర్వహించలేకపోతుంది? 
మెడిసిన్ చేయాలనుకునే విద్యార్ధులు తొలుత ప్రభుత్వ కాలేజీలనే కోరుకుంటారు. కారణం ఆయా కాలేజీలకు వచ్చే పేషెంట్లు, ఉత్తమ సర్వీసులు, మంచి శిక్షణ అందుతుందన్న ఆలోచనతోనే ఎంచుకుంటారు. మెడికల్ కాలేజీల నిర్వహణ కోసం... వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు పెడితే...  మేం అధికారంలోకి వచ్చిన తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అన్నింటినీ రద్దు చేసి ఉచితం చేస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన వెంటనే అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్నే నిలిపివేశారు. 
ప్రైవేటీకరణను అవసరం లేకపోయినా సపోర్టు చేసి నెత్తిన పెట్టుకునే ఆలోచన ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన మొదటి నుంచి ఇదే తీరు. కేవలం కాసుల కోసం కక్కుర్తి పడి ప్రైవేటీకరణ చేయడం ఒక అంశం అయితే... ప్రజల ప్రాణాలకు సంబంధించిన వైద్యరంగంలో ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నాడు. వైయస్.జగన్ విజయవంతంగా మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభిస్తే...  దాన్ని కొనసాగించాల్సింది పోయి, ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు 100 శాతం మెడికల్ సేవలు ఉచితం అని చెప్పాడు. ఇవాళ 100 శాతం అవుట్ పేషెంట్ సేవలు ఉచితంగా వస్తాయని, 70 శాతం ఇన్ పేషెంట్ కేటగిరీలో ఉచితం అని చెబుతున్నాడు. ఇవన్నీ ఎవరికి చెబుతున్నావ్ చంద్రబాబూ? 

● జీతాలు చెల్లింపు మరో కుంభకోణం..

వైయస్.జగన్ ఇప్పటికే ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్మించి, విజయవంతంగా నిర్వహించవచ్చని, సామర్ధ్యం ఉన్న సిబ్బందిని నియమించవచ్చని నిరూపించిన తర్వాత...  ఇవాళ చంద్రబాబు దాన్నుంచి పక్కకు పోవడం అంటే ఇది పెద్ద కుంభకోణం. రెండో కుంభకోణం.. రెండేళ్ల పాటు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తామని చెప్పడం. ఒకవైపు మెడికల్ కాలేజీలను నిర్మించడానికి డబ్బుల్లేవు అని చెబుతూ...  మెడికల్ కాలేజీలను, ఇన్ ఫ్రా స్ట్రక్చర్, భూమితో సహా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూనే.. వారికి రెండేళ్ల జీతాలు కూడా ప్రభుత్వం నుంచి చెల్లించడం అంటే ఒక్కో కాలేజీకి ఏడాదికి రూ.8 కోట్లు చొప్పున 10 మెడికల్ కాలేజీలకు రూ.80 కోట్లు ఖర్చువుతుంది. రెండేళ్లకు రూ.1400 కోట్లు ఇవ్వాలి. ఈ డబ్బులతో  కాలేజీలు పూర్తి కావా? 
ఇవాళ కార్పొరేట్ కాలేజీల్లో వైద్యం ఖర్చు ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? ఇవాళ కొత్త ట్రీట్మెంట్ వచ్చిందంటే అది ఎన్ని లక్షలు కట్టమంటే అంతా కట్టాల్సిందే? ఇక్కడ మొదలుపెట్టి ప్రైమరీ హెల్త్ కేర్ ను కూడా ప్రైవేటుకు కచ్చితంగా అప్పగిస్తాడు. అంటే మొత్తం వైద్య ఆరోగ్యరంగం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతుంది. మన ఆర్దిక వ్యవస్ధలో ప్రైవేటు ఉండడం మన మార్కెట్ ఎకానమీలో భాగం.

● ప్రజల పట్ల ప్రేమ - పాప భీతి లేని వ్యక్తి చంద్రబాబు...

లాభం లేకుండా ప్రైవేటు వ్యాపారులు రారని తెలిసి, వాళ్లకు లాభాలిచ్చి, నువ్వు వేల కోట్లు కుమ్మిరించి.. ఇక్కడ అవసరమైన రూ.2-3 వేల కోట్లు పెట్టలేదంటే చంద్రబాబు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నాడు. ఆయన సేవలు చేయనవసరం లేదు, కానీ ద్రోహం చేయడం మహాపాపం. నా వల్ల ఇంత నష్టం జరుగుతుందన్న భయం కానీ పాపభీతి కానీ రెండూ చంద్రబాబుకు లేవు. అందుకే నేటికీ ప్రైవేటీకరణ మంచిదని బుకాయిస్తున్నాడు. 

● రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల వెల్లువ...

ఈ నేపధ్యంలోనే  ప్రభుత్వమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరనసగా వైయస్.జగన్ పిలుపు మేరకు అక్టోబర్ లో సంతకాల సేకరణ ఉద్యమం మొదలుపెట్టి... రెండు  నెలల కాలంలో 1 కోటి సంతకాలను లక్ష్యంగా పెడితే...  1,04,11,136 సంతకాలు వచ్చాయి. ఈ సంతకాలన్నీ ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను మీరు వ్యతిరేకిస్తే... సంతకం చేయమని అడిగితే..  రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లో చేసినవే. జిల్లాల వారీగా చూస్తే...
శ్రీకాకుళంలో జిల్లాలో 4,02,833, విజయనగరం జిల్లాలో 3,99,908, పార్వతీపురం మన్యం 2,15,500,  అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,47,000, విశాఖపట్నం 4,19,200, అనకాపల్లి జిల్లాలో 3,73,000, కాకినాడ జిల్లాలో 4,00,600, బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 4,20,086, తూర్పుగోదావరి జిల్లాలో 4,06,929, పశ్చిమ గోదావరి జిల్లాలో 4,19,650, ఏలూరు జిల్లాలో 3,60,008, కృష్ణా జిల్లాలో 3,77,336, ఎన్టీఆర్ జిల్లాలో 4,31,217, గుంటూరు జిల్లాలో 4,78,059,  పల్నాడు జిల్లాలో 4,31,802, బాపట్ల జిల్లాలో 3,73,199,  ప్రకాశం జిల్లాలో 5,26,168, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 6,30,040, కర్నూలు జిల్లాలో 3,98.277, నంద్యాల జిల్లాలో 4,05,500, అనంతపురం జిల్లాలో 4,55,840, శ్రీసత్యసాయి జిల్లాలో 4,40,358, వైయస్ఆర్‌ జిల్లాలో 4,80,101, అన్నమయ్య జిల్లాలో 2,60,500, చిత్తూరు జిల్లాలో 7,22,025 మొత్తం 1 కోటి 3 లక్షల 71వేల 136 సంతకాలు చేరాయి. ఇవి కాకుండా కేంద్ర కార్యాలయానికి చేరిన మరో 40వేలు సంతకాలు కలిపి మొత్తం... 1, 04,11,136 నిఖార్సైన సంతకాలతో ప్రవైటీకరణకు వ్యతిరేకంగా తమ మద్ధతు తెలిపారు. 

● బ్యాలట్ తీర్పు తరహాలో ప్రజాభిప్రాయం..

రాష్ట్రంలో ప్రజాభిప్రాయసేకరణలో ఇంత పక్కాగా బ్యాలెట్ బాక్సులో తీర్పునిచ్చినట్లు.. రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారు. 1.04 కోట్ల మంది సంతకాలు అంటే అన్ని కుటుంబాలు సంతకాలు చేశారంటే... రాష్ట్రంలో  మొత్తం కుటంబాలు 1.60 కోట్లు పైగా ఉంటే...  అందులో 1.04 కోట్ల కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. 
ఇంతమంది సంతకాలు చేసిన తర్వాత చంద్రబాబు పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదు. క్రెడిట్ ఆయనే తీసుకుని... మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలి. 
టిడ్కో ఇళ్ల విషయంలో కూడా గతంలో చంద్రబాబు డబ్బులు వసూలు చేసి పూర్తి చేయకుండా వదిలేస్తే.. వైయస్.జగన్ హయాంలో క్రెడిట్ కూడా క్లెయిమ్ కూడా చేయకుండా.. ఉచితంగా అందించారు. అది వైయస్.జగన్ కు ఉన్న ఆలోచన. రాజకీయం కోసం ప్రజలతో ఆడుకోవడం సరికాదు. వైయస్.జగన్ హయాంలో కట్టిన ఇళ్లను చంద్రబాబు తన ఖాతాలో చూపించుకున్నాడు.  ఏమాత్రం జంకులేకుండా క్లెయిమ్ చేసుకోవడం చంద్రబాబుకు అలవాటు.

● కాలేజీల నిర్మాణానికి కుంటిసాకులు...

ఇవాళ మెడికల్ కాలేజీలను కూడా తానే కట్టానని చంద్రబాబు క్లెయిమ్ చేసుకోవచ్చు.. కానీ ప్రైవేటీకరణ చేసి ప్రజల ఉసురు తీసుకోవద్దు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దు. వైయస్.జగన్ ప్రారంభించిన వాటి నిర్మాణం కొనసాగిస్తే సరిపోతుంది. ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు చేసిన రూ. 2.60 లక్షల కోట్లకు పైగా అప్పులో .. కొంత మెడికల్ కాలేజీల కోసం వెచ్చిస్తే సరిపోయేది. కానీ కుంటిసాకులు వెదుకుతూ, పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్పిందని తన అనుకూల పత్రికల్లో రాయించుకోవడం మానేసి... చేసి చూపించాలి. వైయస్. రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత కరెంటు ఇవ్వడం అసాధ్యమని అందరూ అన్నారు.. దాన్ని ఆయన చేసి చూపించేసరికి అందరూ దాన్ని అనుసరిస్తున్నారు. నీవు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం సాధ్యం కాదు అనుకున్నావు.. కానీ వైయస్.జగన్ వాటిని చేసి చూపిస్తే దాన్ని కొనసాగించ లేకపోవడం దారుణం. భవిష్యత్తు తరాలకు 20, 30 ఏళ్లు గడిచిన తర్వాత... మెడిసిన్ లో గొప్ప సిస్టమ్స్ ఉన్నాయని చెప్పుకునే అవకాశాన్ని చేతులారా చంద్రబాబు చంపేస్తున్నాడు. ఇప్పటికైనా చంద్రబాబుకు మంచి బుద్ధి కలిగి ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలను నిర్మించాలని కోరుతున్నాం. ఇదే విషయంపై రేపు సాయంత్రం 4 గంటలకు వైయస్.జగన్  ఒక ప్రతినిధి బృందంతో... గవర్నర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడంతో పాటు, సంతకాల ప్రతులను ఆయనకు సమర్పిస్తామని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అప్పటికైనా చంద్రబాబు కుట్రపూరితమైన, తన దుర్మార్గమైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మెడికల్ కాలేజీలను ప్రభుత్వరంగంలోనే ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. 

● అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానమిస్తూ...

రోడ్లు పీపీపీ విధానంలో నిర్మిస్తే అవి ప్రభుత్వం వద్దే ఉంటాయి కదా అని ప్రశ్నించగా... అలా చేయడం వల్ల టోల్ గేట్ల ఖర్చు భారీగా ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో ఇవేవీ లేవని.. ప్రైవేటు వ్యక్తులు లాభాపేక్ష లేకుండా ఎందుకు వస్తారని నిలదీశారు. మెడికల్ కాలేజీలు ప్రజారోగ్యానికి సంబంధించిన విషయమని... ఏ దేశమైనా ప్రభుత్వ పరిధిలేకుండా వైద్యాన్ని ప్రైవేటుపరం చేయలేదని గుర్తు చేశారు. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు.. వాటి ధరలను సమాజం భరించలేదని... అందుకే ప్రభుత్వం వాటిని బేలన్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

కోటి సంతకాలు ఎవరు చేశారన్నది.. తెలుగుదేశం పార్టీ నేతలందరికీ తెలుసు. ప్రైవేటీకరణ విషయంలో మారిన చంద్రబాబు మాట తీరే ఇందుకు నిదర్శనం. అయినా మొండిగా  ముందుకు వెళ్తూ చంద్రబాబు తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు. 

వైయస్.జగన్ హయాంలో మెడికల్ కాలేజీల నిర్వహణ కోసం సెల్ఫ్ పైనాన్స్ సీట్లు ప్రవేశపెడితే.. ఇదే కూటమి నేతలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తాము అధికారంలోకి వస్తే మొత్తం సీట్లు ఉచితంగా భర్తీ చేస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా కాలేజీలనే ప్రైవేటీకరణ చేస్తున్నారు. 108 సేవలకు సంబంధించి ప్రతిచోటా మొత్తం ప్రభుత్వం చేయాలనుకోవడం మంచి మార్గం. ఒకవేళ అది కాకపోతే ప్రభుత్వ కంట్రోల్ ఉంచేలా చూడాలి. కానీ కూటమి నేతలు మేం అధికారంలోకి వస్తే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేసి మొత్తం ఉచితంగా భర్తీ చేస్తామని చెప్పి... ఇవాళ ప్రైవేటీకరణకు వెళ్లడమే మంచిదని వితండవాదం చేయడం దుర్మార్గం.  
రాజధాని నిర్మాణం కోసం డిజైన్లు, లైటింగ్ వంటి వాటి కోసం కోట్లాది రూపాయులు ఖర్చుపెడుతున్నారు. కానీ మెడికల్ కాలేజీల నిర్మాణానికి వచ్చేసరికి చేయాలన్న ఉద్దేశం లేకపోవడంతోనే ప్రైవేటీకరణ  చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో మాత్రం ఇలా చేయడం దుర్మార్గం. ఉచితంగా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని వైయస్.జగన్ మెడికల్ కాలేజీల నిర్మాణం చేసి చూపించిన తర్వాత కూడా ఇలాంటి వాదన చేయడం అర్దరహితమని తేల్చి చెప్పారు.

Back to Top