ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి నర్సింగ్‌ కాలేజీపై కూటమి సర్కార్‌ కుట్ర

వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహం

వైయ‌స్ఆర్ జిల్లా: జిల్లాలో కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు దిగిందని వైయ‌స్ఆర్‌సీపీ తీవ్రంగా ఆక్షేపించింది. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి నర్సింగ్‌ కాలేజీని లక్ష్యంగా చేసుకుని కావాలనే కూల్చివేత చర్యలకు ప్రయత్నించారని పార్టీ నేతలు మండిపడ్డారు. కాల్వపై మెట్లు ఉన్నాయన్న కారణం చూపుతూ, ప్రొక్లెయిన్‌తో మున్సిపల్‌ అధికారులు నర్సింగ్‌ కాలేజీ వద్దకు చేరుకున్నారు. ఈ కూల్చివేత చర్యలు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆదేశాలతోనే జరిగాయని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. మేయర్‌ ఎన్నికల్లో కూటమికి ఎదురుదెబ్బ తగలడంతో, ఆ ఓటమికి ప్రతీకారంగా వైయ‌స్ఆర్‌సీపీపై మరో రాజకీయ ఎత్తుగడగా ఈ చర్యలు చేపట్టారని విమర్శించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులతో కలిసి మున్సిపల్‌ అధికారులను అడ్డుకున్నారు. అదే కాల్వపై అనేక మంది భవనాలు, మెట్లు నిర్మించుకున్నప్పటికీ, కేవలం రామచంద్రారెడ్డి నర్సింగ్‌ కాలేజీకే నోటీసులు లేకుండా కూల్చివేతకు రావడం వెనుక స్పష్టమైన కుట్ర ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

“నోటీసులు కూడా ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేపడతారు? ఇది చట్టవిరుద్ధం కాదా?” అంటూ అధికారులను నిలదీశారు. నిజంగా కాల్వకు అడ్డుగా ఏదైనా ఉంటే, నిబంధనల ప్రకారం తామే తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది. కానీ రాజకీయ ఒత్తిళ్లతో, వైఎస్సార్సీపీ నేతలను వేధించే ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపట్టారని ఆరోపించింది. 

ఈ ఘటనపై వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, కూటమి ప్రభుత్వ దమనకాండను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ప్రజా ప్రయోజనాలు, విద్యా సంస్థలపై రాజకీయ ప్రతీకారాలు సరికాదని, ఇలాంటి చర్యలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.

Back to Top