సచివాలయం: పార్టీలు మారడం రఘు రామకృష్ణంరాజు నైజమని రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణంరాజు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడుతూ.. ఆనాడు టీడీపీ నామినేషన్, బీజేపీ నామినేషన్, స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని ఎంపీ రఘు రామకృష్ణంరాజును ప్రశ్నించారు. ఈ రోజు ఎంపీగా గెలిచి సొంత పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజల్లో ఆయనకు అంతపేరు ప్రఖ్యాతలు ఉంటే.. ఆయనే సొంతపార్టీ పెట్టుకుని పోటీ చేయాలన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని కాకుండా తనను చూసే ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని చెప్పుకుంటున్న రఘురామకృష్ణంరాజుకు, నరసాపురం పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ అభ్యర్థులు కంటే ఎందుకు తక్కువగా ఓట్లు వచ్చాయో చెప్పాలన్నారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని అరెస్ట్ చేసిన రోజు గోడ ఎందుకు దూకారో ప్రధాని మోదీకి చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కష్టంతోనే తామంతా గెలిచామన్నారు. తమది టీడీపీ, బీజేపీ లాంటి పార్టీ కాదని, రఘు రామకృష్ణంరాజు పప్పులు ఇక్కడ ఉడకవన్నారు.