నాణ్యమైన విద్య అందించాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ ఆకాంక్ష 

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు కేబినెట్‌ ఆమోదం

ప్రతి తరగతికి తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉంటుంది

రాష్ట్రంలో కొత్తగా 4,878 అదనపు తరగతి గదుల ఏర్పాటుకు ఆమోదం 

ఈనెల 10న ‘నేతన్న నేస్తం’, 16న ‘జగనన్న విద్యా కానుక’ 24న అగ్రిగోల్డ్‌ బాధితులకు నగదు చెల్లింపు 

అభ్యంతరం లేని భూముల్లో ఆక్రమణల క్రమబద్దీకరణకు కేబినెట్‌ ఆమోదం

రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటుకు ఆమోదం

కేబినెట్‌ భేటీ నిర్ణయాలను వెల్లడించిన సమాచార శాఖ మంత్రి పేర్ని నాని

సచివాలయం: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నదే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష అని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపర్చేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని, ‘మన బడి నాడు–నేడు’ కింద ప్రభుత్వ పాఠశాలలను సుందరంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దామని చెప్పారు. రాష్ట్రంలో 34 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు అభివృద్ధి చేశామన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం ముగిసిన అనంతరం.. కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఏ సిలబస్‌ తీసుకున్న ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో పాఠ్యపుస్తకాలు అందించిన మొట్టమొదటి ప్రభుత్వం, విద్యా వ్యవస్థ మనది. ప్రతి తరగతికి తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉంటుందన్నారు. ప్రాథమిక దశలోనే మంచి విద్య అందించేలా విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వ పాఠశాలలోని 4,25,965 మంది విద్యార్థులు ప్రైవేట్‌ స్కూళ్లలో చేరారని ప్రభుత్వ పరిశీలనలో వెలుగులోకి వచ్చిందన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి రాష్ట్రంలో కొత్తగా 6,22,856 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ఎన్‌రోల్‌ చేసుకున్నారని చెప్పారు. నూతన విద్యావిధానంలో స్కూళ్లను 6 రకాలుగా వర్గీకరించామని వివరించారు. ఏ స్కూల్‌ మూయకూడదు.. ఏ ఒక్క టీచర్‌ను తీసేయడకూడదని సీఎం చెప్పారన్నారు. 

1) శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2)
2) ఫౌండేషన్‌ స్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2. 1, 2)
3) ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌ (పీపీ–1 నుంచి 5వ తరగతి వరకు)
4) ప్రీ హైస్కూల్స్‌ (3 నుంచి 7 లేదా 8వ తరగతి వరకు)
5) హైస్కూల్స్‌ (3 నుంచి 10వ తరగతి వరకు)
6) హైస్కూల్‌ ప్లస్‌ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు)

ప్రతి సబ్జెక్ట్‌కు ఒక టీచర్, ప్రతి తరగతికి ఒక తరగతిగది ఉంటుందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 4,878 అదనపు తరగతి గదులు మంజూరు చేస్తూ మంత్రిమండలి తీర్మానం చేసిందన్నారు. రాష్ట్రంలో ఏ విద్యార్థి కూడా చదువులో వెనుకబడకూడదనేదే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ లక్ష్యమని మంత్రి పేర్ని నాని వివరించారు. మంచి విద్య అందించాలనే లక్ష్యంతో సీఎం పనిచేస్తున్నారన్నారు. 

‘‘ఈనెల 16న విద్యాకానుక అందిస్తాం. స్కూల్‌ యూనిఫామ్స్, షూస్, టై, బ్యాగ్‌ అన్నీ అందించడం జరుగుతుంది. సీఎం వైయస్‌ జగన్‌ అంతిమ లక్ష్యం ఎన్ని బాధలు ఉన్నా.. ఎన్ని కష్టాలు వచ్చినా రాష్ట్రంలో పుట్టిన ప్రతి పేద, మధ్య తరగతి ఇంట్లో పుట్టిన ప్రతి బిడ్డ చదువులో వెనకబాటుపడకూడదు. పేదరికం పోవాలంటే ఆ ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారానే పోతుందని నమ్మిన వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌. ఎన్ని బాధలు, కష్టాలు అయినా పడదాం. ఎన్ని అవమానకరమైన మాటలైనా, అవహేళనలు అయినా భరిద్దాం.. లక్షల మంది పిల్లలను ప్రయోజకులుగా సమాజానికి అందిద్దామని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

2021–22 సంవత్సరానికి వ్యవసాయ తరువాత అత్యంత ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్న చేనేత వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి నేతన్న నేస్తం పథకం ఆగస్టు 10వ తేదీన అమలుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రూ.24 వేల ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యంతో ఇది మూడో విడత జరుగుతున్న కార్యక్రమం. సుమారు 4 లక్షల మంది నేతన్నలు ఈ పథకం ద్వారా లబ్ధిపొందనున్నారు. ఇందుకు రూ.200 కోట్లు కేటాయిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. 

రక్తాన్ని చెమటగా మార్చి పైసా పైసా పోగేసి అగ్రిగోల్డ్‌ అనే సంస్థలో దాచుకుంటే ఎంతోమంది రాజకీయ పందికొక్కులు ప్రజల కష్టాలను దోచుకున్నారో.. ఆస్తులను కొట్టేయడానికి చూశారో.. బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆదుకుందామనే ఆలోచన చేయని పరిస్థితులు చూశాం. అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. కోర్టు ఏది చెబితే అది చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. ఆ మేరకు ఇప్పటికే రూ.10 వేల లోపు డిపాజిట్‌ దారులైన 3.40 లక్షల మందికి ఇప్పటికే రూ.238.70 కోట్ల పైచిలుకు పంపిణీ చేశాం. 

ఆగస్టు 5వ తేదీ వరకు కోర్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందిన వివరాల ప్రకారం సుమారు 4 లక్షల మంది డిపాజిట్‌ దారుల పేర్లు ప్రభుత్వానికి అందాయి. వారందరికీ సుమారు రూ.500 కోట్లు చెల్లించేందుకు మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. ఈనెల 24వ తేదీన అగ్రిగోల్డ్‌ బాధితుల్లోని రూ.10 వేల నుంచి 20 వేల మధ్య డిపాజిట్‌దారులకు డబ్బు చెల్లించడం జరుగుతుంది. 

తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీగా ఉన్న దాన్ని రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌ సహా కొవ్వూరు, నిడదవోలు, గతంలో ఉన్నటువంటి గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలోని కొంత భాగాన్ని, ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలోని కొంత భాగాన్ని రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ పరిధిలోకి సుమారు 1566.442 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేస్తూ మంత్రి మండలి నిర్ణయించడం జరిగింది. 

గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పేరును కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో కాకినాడ మున్సిపాలిటీతో 172 గ్రామాలు, 15 మండలాలు, 5 అర్బన్‌ లోకల్‌బాడీలు వెరసి 1236.42 చదరపు కిలోమీటర్ల పరిధిలో కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి నిర్ణయించింది. 

రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ, మున్సిపల్‌ పరిధుల్లో అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఉన్న ఆక్రమణలను క్రమబద్దీకరించడానికి నిర్ణయం చేయడం జరిగింది. అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న ఆవాసాల క్రమబద్దీకరణ చేయాలని నిర్ణయించాం. 300 చదరపు గజాల వరకు ఈ రెగ్యులరైజేషన్‌ వర్తిస్తుంది. 75 చదరపు గజాల వరకు రూ.1తో రెగ్యులరైజ్‌ చేయడం, 75 చ.గజాల నుంచి 150 గజాల వరకు ఆ ప్రాంత భూమి విలువ ప్రకారం 75 శాతం విలువను తీసుకొని రెగ్యులరైజ్‌ చేయడం, 150 నుంచి 300 చదరపు గజాల వరకు అక్కడి సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ వాల్యూలో వంద శాతం నగదు చెల్లింపుతో రెగ్యులరైజ్‌ చేయడం జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి అమల్లోకి వస్తుంది. 

2019 అక్టోబర్‌ 15 నాటికి ఎవరైతే ఆక్రమించుకొని నివాసం ఉంటున్నారో వారికి మాత్రమే. వారి ఇల్లు మాస్టర్‌ ప్లాన్, జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్, రోడ్డు డెవలప్‌మెంట్‌ ప్లాన్‌లో ప్రభావితం కాని స్థలాలను మాత్రమే రెగ్యులరైజ్‌ చేయడం జరుగుతుంది. 

1977 నాటి ఏపీ అసైన్డ్‌ భూముల చట్టం పీఓటీ యాక్ట్‌లో చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సెక్షన్‌ 3/2ఏ, సెక్షన్‌ 3/2బీ సవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అసైన్డ్‌ భూమి లేదా అసైన్డ్‌ ఇంటి విక్రయానికి ఇప్పుడున్న గడువు 20 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు తగ్గిస్తూ నిర్ణయించడం జరిగింది. సవరించిన చట్టం అమల్లోకి వచ్చేనాటికి అసైన్డ్‌ భూమి, ఇంటిని ఎవరైనా విక్రయిస్తే వాటి ఆమోదం.. నిర్దేశించిన విధానం, ఫీజుల అనుసరించి విక్రయానికి అనుమతులు ఇచ్చేలా కలెక్టర్లకు నిర్ణయాధికారులు ఇచ్చేలా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 

బందర్‌ పోర్టు నిర్మాణం కోసం రివైజ్డ్‌ డీపీఆర్‌ తయారు చేయడం జరిగింది. గతంలో రూ.5800 కోట్ల పైచిలుకుతో రైట్స్‌ ఇచ్చిన డీపీఆర్‌ను మరోసారి క్షుణ్ణంగా అధ్యయనం చేయడం కోసం నార్వేకు చెందిన పోర్టుల విశిష్ట అనుభవం కలిగిన సంస్థ, చెన్నై ఐఐటీకి అప్పగిస్తే.. వారు రూ.5,155.73 కోట్లతో 36 నెలల్లో పోర్టు నిర్మాణం చేయొచ్చు అని డీపీఆర్‌ ఇచ్చారు. సుమారు రూ.700 కోట్లు ఆదా చేస్తూ రివైజ్డ్‌ డీపీఆర్‌ తయారు చేసి ఇచ్చారు. దానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 

మచిలీపట్నం పోర్టు టెండర్‌ 2021 ఆగస్టు 24 చివరి తేదీగా ఉంది. 24వ తేదీన వచ్చిన టెండర్లలో ప్రభుత్వ రూల్స్‌ ప్రకారం ఫైనల్‌ చేయడం జరుగుతుంది. 

శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టు రివైజ్డ్‌ డీపీఆర్‌కు కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పోర్టు నిర్మాణం కొరకు ఫేజ్‌–1లో భాగంగా రూ.4361.9 కోట్లతో నిర్మాణం చేయడానికి రివైజ్డ్‌ డీపీఆర్‌ను ఆమోదించడం జరిగింది. 30 నెలల్లో పోర్టు నిర్మాణం చేయాలనే లక్ష్యంతో ఇచ్చిన డీపీఆర్‌కు ఆమోదం తెలియజేడం జరిగింది. 

నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద పబ్లిక్‌ ప్రైవేట్‌ పాట్నర్‌షిప్‌ పద్ధతిలో విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన టెక్నో ఎకనమిక్‌ ఫీజుబుల్టీ స్టడీ రిపోర్టుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అదనంగా రూ.10 లక్షల ప్యాకేజీ ఇవ్వడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దాదాపు రూ.550 కోట్ల ఖర్చుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గతంలో సీఎం వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీని అమలు చేసేందుకు మంత్రిమండలి ఈ నిర్ణయం తీసుకుంది. 

చిత్తూరు జిల్లా పుంగనూరులో రవాణా శాఖలో ఒక మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్, సీనియర్‌ లేదా జూనియర్‌ అసిస్టెంట్లు, ముగ్గురు హోంగార్డు పోస్టులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 

ఈనెల 13వ తేదీన నిర్వహించనున్న వైయస్‌ఆర్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాల దృష్ట్యా హైదరాబాద్‌లో ఉన్న లోకాయుక్త కార్యాలయాన్ని కర్నూలు పట్టణానికి తరలించాలని మంత్రిమండలి నిర్ణయించింది. గౌరవ హైకోర్టు అభిప్రాయాల నేపథ్యంలోనే రాష్ట్ర మానవ హక్కుల సంఘ కార్యాలయాన్ని కూడా కర్నూలుకు తరలించాలని మంత్రిమండలి నిర్ణయించింది. 

రాష్ట్రంలో పశుసంపదను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌ భవైనీ బ్రీడింగ్‌ ఆర్డినెన్స్‌ 2021కి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 

రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తుల వినియోగాన్ని పెంచడానికి ఉద్దేశించిన ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం
రాష్ట్ర ఉత్పత్తిలో 30శాతం వరకూ స్థానికంగానే వినియోగం కోసం చర్యలు. తగిన మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేయనున్న ప్రభుత్వం. ప్రీ ప్రాససింగ్‌యూనిట్లు, ప్రాససింగ్‌ ప్లాంట్లు, ఆక్వాహబ్‌లను, వీటికి అనుబంధంగా రిటైల్‌దుకాణాలను ఏర్పాటుచేస్తున్న ప్రభుత్వం.

పశు సంవర్థకశాఖలో 19 ల్యాబ్‌ టెక్నిషియన్, 8 ల్యాబ్‌ అటెండెట్లు  పోస్టుల మంజూరుకు ఆమోదం
కాంట్రాక్టు పద్ధతిలో టెక్నిషియన్లు, అవుట్‌సోర్సింగ్‌ విధానంలో అటెండెంట్ల నియామకం.

రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో విత్తన ఉత్పత్తి పాలసీ ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం. 

ఉద్యానవన పంటల సాగుకు సంబంధించి చట్టసవరణకు కేబినెట్‌ఆమోదం. ఉద్యానవన పంటల సాగులో వచ్చిన అత్యున్నత విధానాలు, పరిజ్ఞానం నేపథ్యంలో నర్సరీలు, వాటినుంచి వచ్చే మొక్కలు తదితర అంశాల్లో ప్రమాణాలను పాటించేలా చేసేందుకు తగిన చర్యల్లో భాగంగా చట్టసవరణ.

రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగు, పంటల పరిస్థితులపై కేబినెట్‌కు వివరాలు అందించిన అధికారులు. ఇప్పటివరకూ 42.27 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేసినట్టుగా వివరించిన అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదైందని, 8.3శాతం సగటును అధిక వర్షపాతం ఉందని తెలిపిన అధికారులు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో లోటు వర్షపాతం ఉందని తెలిపిన అధికారులు
కడపలో 70.2శాతం, అనంతపురంలో 65.6, కర్నూలులో 25.5, చిత్తూరులో 58.6శాతం అధికంగా వర్షపాతం నమోదయ్యిందన్న అధికారులు. అగ్రికల్చర్‌ అడ్వైజరీ సమావేశాలు, పంటల ప్రణాళికపైనా కేబినెట్‌కు వివరణ

రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలను కేబినెట్‌కు వివరించిన వైద్యారోగ్యశాఖ అధికారులు. వ్యాక్సినేషన్‌ పరిస్థితులనూ వివరించిన అధికారులు.
 

Back to Top