తిరుపతి: తిరుపతి ఉప ఎన్నిక పరిశీలకుడిని అని చెప్పుకునే సునీల్ దియోధర్.. ప్రచారానికి వచ్చాడా..? లేక సినిమాలు చూడటానికి వచ్చాడా..? అని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. వకీల్‌సాబ్ సినిమా హిట్ అయితే.. తిరుపతిలో బీజేపీ గెలుస్తుందా..? సినిమాకు, ఎన్నికకు ఏంటి సంబంధం అని నిలదీశారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి ఎందుకు ఓటువేయాలో సూటిగా ఒక సమాధానం చెప్పగలవా.. అని సునీల్ దియోధర్‌ను మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. పాచిపోయిన లడ్డూలు అంటూ బీజేపీని విమర్శించిన పవన్ కల్యాణ్.. నేడు అదే బీజేపీకి ఓటు వేయాలని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీనే మట్టికరిపించిన నాయకుడు సీఎం వైయస్ జగన్ అని, చెంచాగిరి చేసే సునీల్ దియోధర్.. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తిరుపతిలో ప్రెస్‌క్లబ్‌లో మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ''పొద్దున్నే ముస్తాబై 5 గంటలకు సినిమా హాల్ తలుపులు తెరవకపోతే 11 గంటల వరకు సినిమా హాల్ మెట్ల మీద పడుకున్నాను.. వకీల్‌సాబ్ సినిమా టికెట్ తీసుకొని చాలా విజయం సాధించానని చెప్పుకుంటున్నాడు. భారత ప్రభుత్వాన్ని నడిపే ఒక రాజకీయ పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశీలకుడిని అని, తిరుపతిలో బీజేపీని గెలిపిస్తా అని చెప్పుకునే సునీల్ దియోధర్ అనే వ్యక్తి.. చేసే కార్యక్రమం సినిమాలు చూడటం. ఏపీలో సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం రోజుకు నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించాలి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి సుమారు 12లోపు ముగించేయాలి. మీకు బాగా దురద ఉందని తెల్లవారుజామున 5 గంటలకు వెళ్తే షో వేయరు. బెన్‌ఫిట్ షో టికెట్ ధర రూ.వెయ్యి బ్లాక్‌లో అమ్మేదాన్ని ప్రోత్సహిస్తున్నారు. వకీల్‌సాబ్ సినిమా హిట్ అవుతుంది.. తిరుపతి పార్లమెంట్‌లో బీజేపీ గెలుస్తుందని మాట్లాడుతున్నాడు. సినిమా హిట్‌కు, ఎన్నికలకు సంబంధం ఏంటీ..? ఇలాంటి నాయకులంతా బీజేపీని నడపడానికి ఎగేసుకుంటూ ఏపీకి వచ్చారు. పువ్వు గుర్తుకు ఓటేయమని అడిగేందుకు వచ్చాడా.. లేక ఓటర్ల చెవుల్లో పూలు పెట్టడానికి వచ్చాడా..? రెండు పాచిపోయిన లడ్డూలు మా చేతుల్లో పెట్టారని బీజేపీని గతంలో పవన్ విమర్శించారు. చెయ్యి సాచి సాయం అడిగితే చేతిలో బీజేపీ ఉమ్మేసిందని కూడా పవన్ మాట్లాడారు. తెలుగువాడు సాయం అడిగితే చేతిలో ఉమ్మేసే సంప్రదాయం, సంస్కారం ఉన్న మీకు తిరుపతి ప్రజలు మీకెందుకు ఓటేయాలి. దేవుడు బీజేపీ వాళ్లకు, పవన్‌కు సిగ్గెందుకు పెట్టలేదో అర్థం కావడం లేదు. 2019 ఎన్నికల వరకు పవన్ కల్యాణ్ మోడీ, అమిత్‌షా, బీజేపీని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టారు. కాంగ్రెస్ మొదటి ద్రోహి అయితే.. రెండవ ద్రోహి బీజేపీ అని పవన్ మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రాంతీయ పార్టీలకు జీవం ఉండదు.. జాతీయ పార్టీలదే హవా.. జనసేనను బీజేపీలో కలిపేయాలని అమిత్‌షా కోరినట్టు పవన్ చెప్పారు. సినిమా వాళ్లకు ఓట్లు రావని పువ్వు గుర్తువాళ్లంతా 2019లో చెప్పారు. నిలకడ లేని పవన్ రాజకీయ నాయకుడా అని బీజేపీ వాళ్లు మాట్లాడారు. కానీ, ఇవాళ వీళ్లిద్దరూ కలిసి మెలిసి తిరుగుతున్నారు. బీజేపీ, జనసేన కలయిక వ్యాపార పరమైన ఒప్పందంగానే కనిపిస్తుంది. సునీల్ దియోధర్‌ను ఒకటే ప్రశ్నిస్తున్నాం.. తిరుపతి ఉప ఎన్నికలో కమలానికి ఎందుకు ఓటేయాలో చెప్పే దమ్ము లేదు. పవన్ చెప్పాడు కాబట్టి అందరూ ఓటు వేయండి అంటున్నారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపి రాష్ట్రాన్ని విడగొట్టిన బీజేపీకి ఎందుకు ఓటేయాలి. విభజన హామీల్లో భాగమైన కడప ఉక్కును మంజూరు చేయకుండా ఉన్నందుకు మీకు ఓటేయాలా..? రామాయపట్నం, దుగ్గరాజుపట్నం పోర్టు కడతామని హామీ ఇచ్చి ఈ రోజు వరకు హామీని నిలబెట్టుకోనందుకు ఓటు వేయాలా..? ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతంలోని 7 జిల్లాలకు సంవత్సరానికి రూ.350 కోట్ల చొప్పున పదేళ్ల పాటు హామీ ఇచ్చి.. 350 పైసలు కూడా ఇవ్వని మీకు ఓటేయాలా..? కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని 2019 బీజేపీ మేనిఫెస్టోలో పెట్టి.. ఈ రోజు వరకు ఆ ఊసెత్తని బీజేపీకి ఎందుకు ఓటువేయాలి..? పోలవరం నిర్వాసితుల తరలింపునకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి ఇంత వరకు రాతపూర్వకంగా హామీ ఇవ్వనందుకు ఓటు వేయాలా..? విశాఖ రైల్వేజోన్ ఇస్తామని ఈ రోజుకు నెరవేర్చనందుకు ఓటు వేయాలా..? వెంకన్న పాదాల సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి.. మోసం చేసినందుకా..? ఎందుకు బీజేపీకి ఓటు వేయాలో సమాధానం చెప్పాలి. రాష్ట్రానికి పాచిపోయిన లడ్డూలు ఇచ్చినట్టే.. పవన్ సినిమా కూడా పాచిపోయిన సినిమా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హిందీలో, తమిళ్‌లో తీసిన వకీల్‌సాబ్ సినిమా పాచిపోయింది. ఒక్కరిగా వచ్చినా, పవన్, మోడీ కలిసి వచ్చినా, ఎన్ని సినిమాలు ఆడించినా సీఎం వైయస్ జగన్ భయపడేరకం కాదు. సోనియా గాంధీ లాంటి నియంతకే కించెత్తు కూడా భయపడని నాయకుడు సీఎం వైయస్ జగన్. చంద్రబాబు, సోనియా కలిసి ఉద్దేశపూర్వకంగా జైల్లో పెట్టినా మనో ధైర్యంతో పోరాడి కాంగ్రెస్‌ను మట్టికరిపించిన వ్యక్తి సీఎం వైయస్ జగన్. కాంగ్రెస్ పెట్టిన తప్పుడు హత్య కేసులో అమిత్‌షా కూడా ముద్దాయిగా ఉన్నాడు కదా.. ఆయన కూడా వాయిదాలకు తిరిగాడు కదా.. అమిత్‌షా ఎవరికి భయపడ్డాడు.. అమిత్‌షా, వైయస్ జగన్‌కు భయాలు ఉండవు. సునీల్ దియోధర్ లాంటి చెంచాగిరి చేసుకునేవాళ్లు ఇలాంటి పిచ్చికూతలు ఆపాలి. చంద్రబాబు ఆయనకు ఆయనే భజన చేసుకుంటున్నాడు. భజన చేసేవాడు కూడా బాబు పక్కన లేకుండా అయిపోయింది పరిస్థితి. సిగ్గు, లజ్జ, భయం లేకుండా మాట్లాడటం చంద్రబాబుకే సాధ్యం. చంద్రబాబు అంటే సీఎం వైయస్ జగన్‌కు భయమా..? 40 ఏళ్ల ఇండస్ట్రీని గల్లీలో తిరిగే స్థితికి సీఎం తీసుకొచ్చారు. చంద్రబాబు కళ్లను ఆకాశం నుంచి నేలకు దించారు. బహిరంగ సభలో 30 నిమిషాలు మాట్లాడేందుకు వస్తుంటే.. చంద్రబాబుకు భయంగా ఉంది. తిరుపతి ఉప ఎన్నిక ఓడిపోయినట్టేనని ప్రతిపక్షాలు ఒప్పుకున్నాయి. ప్రజాస్వామ్యం మీద అంచెంచలమైన విశ్వాసం ఉన్న నాయకుడు సీఎం వైయస్ జగన్. ఎన్నిక ఏదైనా ప్రజలే దేవుళ్లు.. ప్రజల ఆశీస్సులు కోరే నాయకుడు సీఎం వైయస్ జగన్’ అని మంత్రి పేర్ని నాని అన్నారు.