స్మార్ట్‌ మీటర్ల టెండర్లలో ‘ఈనాడు’ కూడా పాల్గొనవచ్చు

అధిక రేట్లు అంటూ ప్రభుత్వంపై ఈనాడు పత్రిక అసత్య ప్రచారం చేస్తోంది

విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం

చిత్తూరు: స్మార్ట్‌ మీటర్లపై ఈనాడు పత్రిక అసత్య ప్రచారం చేస్తోందని, కుట్రపూరితంగా రాతలు రాస్తోందని విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. స్మార్ట్‌ మీటర్లపై ఎల్లోమీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి పెద్దిరెడ్డి తిప్పికొట్టారు. మామూలు మీటర్ల కంటే రెండు రెట్లు ఎక్కువ‌గా ధర ఉందని రాసే ఈనాడు యాజమాన్యం.. తక్కువ రేటుకు ఇప్పించేందుకు టెండర్‌లో పాల్గొనవచ్చు కదా..? స్మార్ట్‌ మీటర్ల టెండర్లలో ఈనాడు యాజమాన్యం కూడా పాల్గొనవచ్చని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. టెండర్‌లో ఎంత తగ్గితే ప్రభుత్వానికి కూడా అంత ఆదాయం మిగులుతుందన్నారు. అప్పుడు ప్రభుత్వంతో పాటు ఈనాడు యాజమాన్యానికి కూడా మంచి పేరు వస్తుందని సలహా ఇచ్చారు. 

కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే టెండర్లు పిలిచామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. ఒక వ్యక్తిని ఉద్దేశించి టెండర్లు పిలిచి ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. పూర్తి పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. టెండర్‌లో ఎవరూ పాల్గొనకుండా చేయాలని ఈనాడు అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. వారి పత్రికల్లో ఆల్రెడీ ఎవరికో ఇచ్చేశామని రాస్తున్నారని, అవన్నీ కుట్రపూరిత రాతలేనని చెప్పారు. త్వరలో రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌కు కూడా స్మార్ట్‌ మీటర్లు బిగిస్తామని, కేవలం జవాబుదారీతనం తీసుకొని రావడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. 
 

Back to Top