చిత్తూరు: కుప్పంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అందరం సమష్టిగా పనిచేస్తున్నామని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధి కోసం వైయస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న వైయస్‌ఆర్ చేయూత పథకం మూడో విడత కుప్పం నుంచి సీఎం వైయస్ జగన్ శ్రీకారం చుట్టనున్నారని చెప్పారు. అదే విధంగా కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.66 కోట్లు విడుదల చేశామని, అందుకు సంబంధించిన పనులకు సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేస్తారని చెప్పారు. కుప్పం సభ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలకు మంచి మెసేజ్ వెళ్తుందన్నారు.
ఈనెల 22వ తేదీన కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. కుప్పం నుంచి 30ఏళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తూ.. 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన చంద్రబాబు.. కనీసం కుప్పంను మున్సిపాలిటీ చేసుకోలేకపోయారన్నారు. సీఎం వైయస్ జగన్ కుప్పంను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడమే కాకుండా.. చంద్రబాబు అభ్యర్థన మేరకు రెవెన్యూ డివిజన్ కూడా ఇచ్చారన్నారు.
కుప్పం మున్సిపాలిటీకి రూ.66 కోట్ల పనులకు శంకుస్థాపన, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ తదితర కార్యక్రమాల్లో సీఎం వైయస్ జగన్ పాల్గొంటారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. హంద్రీనీవా కాల్వ పూర్తయితే సీఎం వైయస్ జగన్‌కు పేరు వస్తుందని పనులు జరగకుండా చంద్రబాబు అడ్డుకున్నారని, ఆ కాంట్రాక్ట్‌ను క్యాన్సిల్ చేసి వేరేవారికి పనులు అప్పగించాం. ఎన్నికలలోపే పనులు పూర్తవుతాయని మంత్రి చెప్పారు. పాలారు ప్రాజెక్టు, అదేవిధంగా తాగునీరు, సాగునీటి కోసం 1 టీఎంసీ కెపాసిటీ రిజర్వాయర్, కుప్పం నియోజకవర్గ పేదలకు 10 వేల ఇళ్లు.. ఇవన్నీ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు ఎప్పుడూ రాలేదన్నారు. 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిపించిన కుప్పం ప్రజలకు బాబు చేసిందేమీ లేదన్నారు.