చంద్రబాబు కంటే వైయస్‌ జగనే ఎక్కువ రోడ్లు వేయించారు 

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

రహదారులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

వచ్చే వర్షాకాలం నాటికి అన్ని రోడ్లు పూర్తి చేస్తాం

విజయవాడ: ఐదేళ్ల చంద్రబాబు పాలనలో వేసిన రోడ్ల కంటే వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రెండున్నర ఏళ్లలో అధిక రోడ్లు వేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రోడ్ల నిర్వాహణపై ప్రతిపక్ష నేతల ఆరోపణలను మంత్రి ఖండించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలోని అన్ని రోడ్లు కూడా వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రోడ్ల నిర్వాహణపై సీఎం వైయస్‌ జగన్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం రోడ్ల నిర్వహణను పట్టించుకోలేదన్నారు.  రోడ్ల కోసం రూ.6 వేల కోట్ల విలువైన టెండర్లు పిలిచామని చెప్పారు. గత ప్రభుత్వం కంటే అధికంగా పంచాయతీ రాజ్‌ రోడ్లు వేశామన్నారు.
రోడ్లు వేయలేదని చెబుతున్న పవన్‌ కళ్యాణ్, ఇతర నాయకులకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను. మామూలుగా రూరల్‌ రోడ్లలో పంచాయతీ రాజ్‌ శాఖ పాత్ర ఎక్కువగా ఉండాలి. ఆ విధంగానే మా ప్రభుత్వం పని చేస్తోంది. దాదాపుగా 5138 రోడ్లు బ్యాంకు సహకారంతో టెండర్లు పిలిచాం. 1585 రోడ్లు ప్రోగ్రస్‌లో ఉన్నాయి. 865 కిలోమీటర్లు పూర్తి అయ్యాయి. పీఎంజేఎస్‌వై కింద గత ఐదేళ్లలో ఎప్పుడు కూడా 330 కిలోమీటర్లు మాత్రమే చంద్రబాబు తెచ్చారు. 

ఈ రోజు 3185 కిలోమీటర్ల రోడ్లు మా ప్రభుత్వం తెచ్చింది. మా ప్రభుత్వానికి, గత టీడీపీ ప్రభుత్వానికి తేడా ఏంటో గమనించాలి.  దాదాపుగా 9 వేల కిలోమీటర్లు ఈ రోజు మా ప్రభుత్వం కొత్తగా వేసింది. చంద్రబాబు ఐదేళ్లలో 1130 కిలోమీటర్లు వేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా వర్షాలు కురవవు. రోడ్లు బాగుంటాయి. మా అదృష్టం ఏంటంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికి ఎన్నిసార్లు ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తామో అందరికీ తెలుసు. 

వర్షాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రోడ్లు చెడిపోతాయి. అక్టోబర్‌ నెలలోగా అన్ని రోడ్లు పూర్తి చేస్తాం. అత్యధికంగా సీఎం వైయస్‌ జగన్‌ హయాంలోనే నూతనంగా రోడ్లు వేశామని, ఇదే అభివృద్ధికి పెద్ద మైలు రాయి అన్నారు. అభివృద్ధి జరిగితే వాటి గురించి మాట్లాడకుండా ఏదైనా చిన్న తప్పు కనిపిస్తే దాన్ని బూతద్దంలో చూపించి టీడీపీ, దాని తోక పార్టీ జనసేనకు అలవాటు అయ్యింది. అన్ని రోడ్లు కూడా వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. 

అక్రమ మైనింగ్‌ అంతా కూడా చంద్రబాబు హయాంలోనే జరిగిందన్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా మా ప్రభుత్వం సంస్కరణలు తెచ్చిందని చెప్పారు. రిజినల్‌ విజిలెన్స్‌ కమిటీలు ప్రతి జిల్లాలో వేశామని, అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేశామని చెప్పారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top