రేపల్లె: విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేతల అరెస్టులతో చంద్రబాబు కుల రాజకీయాలకు తెరతీయడం సిగ్గుచేటని పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ధ్వజమెత్తారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఈఎస్‌ఐ కుంభకోణంలో రూ.కోట్లు దోపిడీ చేసినట్టు విజిలెన్స్ విచారణలో సాక్ష్యాధారాలతో నిరూపణ అయిందన్నారు. దీంతో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే.. దానికి బీసీ కార్డును అంటగట్టాలని కుట్రలు చేయడం చంద్రబాబు నీచ రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. రేపల్లెలో మంత్రి మోపిదేవి మీడియాతో మాట్లాడుతూ.. జేసీ ట్రావెల్స్‌పై అధికార యంత్రాంగం సమగ్ర విచారణ జరిపి అక్రమాలను బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటే.. కక్ష సాధింపు అంటూ చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని, బాబు తీరును రాష్ట్ర ప్రజలంతా చీదరించుకుంటున్నారన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుని గతంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఏనాడూ వారికి న్యాయం చేసింది లేదన్నారు. బీసీ వర్గాలకు ఆదరణ పేరుతో నాసిరకం పరికరాలను అందించి అక్రమ మార్గంలో కోట్ల రూపాయలు దండుకున్నారన్నారు. సీఎం వైయస్ జగన్ సంక్షేమ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరుతున్న తీరుచూసి ఓర్వలేక విమర్శించడం విపక్ష నేతలు మానుకోవాలని సూచించారు.