వైయ‌స్ జగన్ మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి కాబోతున్నారు

వైజాగ్‌లో వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రమాణస్వీకారం చేయబోతున్నారన్న దుగ్ధతో మాపై విషం కక్కుతున్నారు

చంద్రబాబు, రామోజీపై మంత్రి మేరుగ నాగార్జున ఫైర్‌

తాడేప‌ల్లి:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి ముఖ్య‌మంత్రి కాబోతున్నార‌ని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. సీఎం వైయ‌స్ జగన్ వైజాగ్‌లో ప్రమాణస్వీకారం చేయబోతున్నారన్న దుగ్ధతో మాపై విషం కక్కుతున్నారని చంద్ర‌బాబు,  రామోజీల‌పై మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గురువారం మంత్రి మేరుగ నాగార్జు మీడియాతో మాట్లాడారు. వైయ‌స్ఆర్ సీపీ గెలుస్తుందన్న భయంతో టీడీపీ ఆరోపణలు చేస్తోంద‌ని మంత్రి మండిప‌డ్డారు. అసైన్డ్‌ భూములను కొట్టేయటానికి ప్లాన్ చేశారంటూ రామోజీ తప్పుడు వార్తలు రాశార‌ని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. అసలు రామోజీ ఫిల్మ్ సిటీని అసైన్డు భూములు ఆక్రమించి కట్టలేదా?
ఆ ఆక్రమణల గురించి నీ పత్రికలో ఎందుకు రాయలేద‌ని మంత్రి నిల‌దీశారు. మా ప్రభుత్వం చట్టానికి అనుగుణంగానే పని చేస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు దళితుల భూములను కొట్టేసినట్టు తప్పుడు పనులు చేయమ‌ని స్ప‌ష్టం చేశారు. కుట్రపూరితంగా వ్యవహరించం, అమరావతిలో చంద్రబాబు దళితులకు అన్యాయం చేసిన తీరు దేశమంతా తెలుసు అని గుర్తు చేశారు. సీఎం వైయ‌స్ జగన్ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ అక్కున చేర్చుకున్నారు.  చంద్రబాబు, రామోజీ ఏనాడూ దళితుల బాగోగుల గురించి ఆలోచించర‌ని, వారిద్దరూ దళితుల వ్యతిరేకుల‌ని దుయ్య‌బ‌ట్టారు. వెర్రి కూతలు, వెర్రి వేషాలు వేసే ముందు వాస్తవాలు గ్రహించాల‌ని మంత్రి మేరుగ నాగార్జున హెచ్చ‌రించారు.

Back to Top