విజయవాడ: ఎస్సీల స్థితి గతులను అధ్యయనం కోసం జస్టిస్ బాల కిషన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీకి రాష్ట్రంలో పర్యటిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని కమిటికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ విషయంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని కమిటి దృష్టికి తీసుకుని వెళ్లామని పేర్కొన్నారు. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతి కోసం చేస్తున్న కృషిని వివరించామన్నారు మంత్రి. ఎస్సీలు గతంలో సామాజిక అసమానతలను ఎదుర్కొనేవారని.. సామాజిక పరిస్థితుల దృష్ట్యా వారు మతం మారారని మంత్రి మేరుగ తెలిపారు. మతం మారినా.. ఎస్సీలతోనే కలిసి జీవిస్తున్నారన్నారు. ఎస్సీలకు వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో రూ.58 వేల కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. ప్రభుత్వం కృషిని జస్టిస్ బాల కిషన్ కమిటీ అభినందించిందని చెప్పారు. నాలుగేళ్లలో 12శాతం ఉన్న పేదరికం 6 శాతానికి తగ్గిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయని మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారం కోసం అర్రులు చాస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు.. పవన్ కళ్యాణ్ కు స్థిరత్వం లేదని ఆరోపించారు. 2014లో టీడీపీతో కలిసి పని చేసిన పవన్.. తండ్రి, కొడుకులు అవినీతి పరులని చెప్పాడన్నారు. మరోవైపు.. ఈ నెల 19 న విజయవాడలో అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం వైయస్ జగన్ ఆవిష్కరించనున్నారని తెలిపారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు అంబేడ్కర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేక పోయారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.