గుంటూరు: బడుగు, బలహీనవర్గాల సంక్షేమమే ముఖ్య ఉద్దేశంగా సీఎం వైయస్ జగన్ ఆరు నెలల పాలనలోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఆ పథకాలను చూపించి మా నాయకుడు అని గర్వంగా చెప్పుకుంటున్నామని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. వైయస్‌ఆర్ ఆరోగ్య ఆసరా పథకం ప్రారంభోత్సవంలో ఆమె మాట్లాడుతూ.. పేదవాడు కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేసుకోవాలని గతంలో మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఆయన తనయుడు సీఎం వైయస్ జగన్ రెండు అడుగులు ముందుకు వేసి ఆపరేషన్ చేయించుకున్న వారి కుటుంబాలను ఆదుకునేందుకు వైయస్‌ఆర్ ఆరోగ్య ఆసరా పథకాన్ని తీసుకువచ్చారన్నారు. ఆపరేషన్ చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేలు ఆర్థిక సాయం అందించే కొత్త పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబం పేదల కోసం ఏది చేసినా చరిత్రలో నిలిచిపోతుందని హోంమంత్రి సుచరిత అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైయస్‌ఆర్ ఆరోగ్య ఆసరా పథకాన్ని తీసుకువచ్చారన్నారు. నెలలో సుమారు నాలుగు, ఐదు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ అన్ని రకాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారన్నారు. సీఎం వైయస్ జగన్ పరిపాలనలో భాగస్వాములు అయినందుకు గర్వపడుతున్నామన్నారు. నాడు – నేడు కార్యక్రమం ద్వారా రూ.15 వందల కోట్లు వెచ్చించి ప్రభుత్వ ఆస్పత్రులు అభివృద్ధి చేయాలనుకోవడం ఒక చరిత్రగా చెప్పుకోవచ్చన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు. విద్య, వైద్యం ప్రతీ ఒక్కరికి కావాల్సిన మౌలిక సౌకర్యాలు.. వాటిని సక్రమంగా ప్రజలకు అందించే దిశగా సీఎం వైయస్ జగన్ అడుగులు వేస్తున్నారన్నారు. Read Also: నా మతం మానవత్వం.. కులం మాట నిలబెట్టుకోవడం