ఏపీకి మేజర్‌ పోర్టు ఇవ్వాలి

కేంద్రమంత్రి సోనోవాల్‌ను కోరిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

ఢిల్లీ: విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు మేజ‌ర్‌ పోర్టు ఇవ్వాలని కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్‌ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కోరారు. కేంద్రమంత్రి సోనోవాల్‌తో మంత్రి గౌతమ్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రితో చర్చించారు. ఏపీ మారిటైమ్‌ బోర్డు వ్యవస్థ ద్వారా కోస్టల్‌ డెవలప్‌మెంట్‌ చేస్తున్నామని, ఎగుమతులు 4 నుంచి 10 శాతానికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. 3 మేజర్‌ ప్రాజెక్టులు, 11 ఫిషింగ్‌ హార్బర్‌లకు నిధులు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరినట్టు మంత్రి గౌతమ్‌రెడ్డి వివరించారు. 

అంతకు ముందు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కలిశారు. నెల్లూరు జిల్లాలో పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి సంబంధించిన ప్రతిపాదనలు అందజేశారు. సోమశిల ప్రాజెక్టు పరిసరలు సహా అనంతసాగరం, సంగం మండలాల్లో పర్యాటక ప్రదేశాలుగా మార్చగల ప్రాంతాల గురించి వివరించారు. టెంపుల్‌ టూరిజం అభివృద్ధికి నెల్లూరు జిల్లాలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. 
 

తాజా వీడియోలు

Back to Top