తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు

అచ్చెన్నాయుడి అరెస్టును కులాలకు ఆపాదించడం హేయం

ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌

శ్రీకాకుళం: ఈఎస్‌ఐ స్కామ్‌లో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టును.. కిడ్నాప్‌గా చంద్రబాబు వక్రీకరిస్తున్నారని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మండిపడ్డారు. మంత్రి కృష్ణదాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. నేరం జరిగినప్పుడు అరెస్ట్‌ సర్వసాధారణమని, చంద్రబాబు, లోకేష్‌ వ్యాఖ్యలు దురదృష్టకరమని దుయ్యబట్టారు. చేసిన తప్పును వదిలేసి అచ్చెన్నాయుడు అరెస్టును బీసీలకు ఆపాదిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈఎస్‌ఈలో అవినీతి జరిగినట్లు విజిలెన్స్‌ నివేదిక ఇచ్చిందని, నివేదిక ఆధారంగా ఏసీబీ అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిందన్నారు. 

తప్పును కప్పిపుచ్చేందుకే టీడీపీ కులాల ప్రస్తావన తీసుకువస్తుందని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ఫైరయ్యారు. కులాల మధ్య చిచ్చుపెట్టడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. గతంలో బీసీ ఓట్లతో గెలిచిన చంద్రబాబు.. వారిని గాలికొదిలేశారన్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదని మంత్రి కృష్ణదాస్‌ స్పష్టం చేశారు. 
 

Back to Top