ఢిల్లీ: చంద్రబాబు చేసిన అవినీతి, అక్రమాలకు శిక్ష తప్పదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు ఎవరెవరికి డబ్బులు ఇవ్వమన్నాడో ఆ చిట్టా అంతా పీఎస్ శ్రీనివాస్ డైరీలో రాసిపెట్టుకున్నాడన్నారు. వాటిపై కూడా విచారణ జరుగుతుందన్నారు. ఢిల్లీలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. రూ.2 వేల కోట్ల డబ్బు ఎవరూ ఇంట్లో పెట్టుకొని కూర్చోరని, సూట్ కేసులు ఎన్ని ఉండాలి.. రూ. 2 వేల నోట్లు, రూ. 500 నోట్లు ఎన్ని ఉన్నాయని టీడీపీ నేతలు అడ్డంగా వాదిస్తున్నారన్నారు. రూ.2 వేల కోట్ల అక్రమ సంపాదన అంటే ఆస్తులు, డాక్యుమెంట్లు, అకౌంట్ల నుంచి జరిగిన లావాదేవీలు అన్నీ ఐటీ అధికారులకు లభించాయని, అందువల్లే అక్రమ సంపాదన అంటూ ప్రెస్‌నోట్ విడుదల చేసిందన్నారు. బాబు పీఎస్‌గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్.. చంద్రబాబు ఎవరెవరికి డబ్బులు ఇవ్వమన్నారో.. ఆ లెక్క అంతా.. లావాదేవీలు అన్నీ డైరీలో రాసిపెట్టుకున్నాడన్నారు.
రాష్ట్రం, కేంద్రానికి మధ్య ఉన్న సంబంధాలు రాజ్యాంగ బద్ధంగా ఉంటాయని మంత్రి కొడాలి నాని అన్నారు. రెండు మూడు నెలలు అటు ఇటు అయినా కచ్చితంగా మండలి రద్దు అవుతుందన్నారు. ప్రభుత్వం ప్రజల మేలు కోసం చేసే చట్టాలకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి పెద్ద సభ ఉంటుందని, కానీ చంద్రబాబు ఆ సభను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చాడన్నారు. మెజార్టీ బలం ఉందని పేదల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేసే చట్టాలకు ప్రతిపక్షం మోకాలొడ్డిందన్నారు. అలాంటి సభ అవసరం లేదని ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగిందన్నారు. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వకుండా మంచి కార్యక్రమాలకు అడ్డుపడితే వాళ్లను ఆ దేవుడు కూడా రక్షించలేడని, కచ్చితంగా మండలి రద్దు అవుతుందన్నారు.