తాడేపల్లి: ముందే రచించుకున్న ప్లాన్‌లో భాగంగా వివిధ జిల్లాల నుంచి తెలుగుదేశం పార్టీ గూండాలని రప్పించి పుంగనూరులో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పాత సినిమాల్లో బందిపోటు ముఠా ఒక ఊరుమీద దాడిచేసినట్టుగా పుంగనూరులో చంద్రబాబు దౌర్జన్యకాండకు తెగబడ్డాడని మండిపడ్డారు. పోలీసులను తరమండి అని చంద్రబాబు ప్రోత్సహించడం, పోలీసులపై రాళ్లు రువ్వడం, వ్యాన్లను తగలబెట్టడం ఇలా దగ్గరుండి మరీ పుంగనూరులో విధ్వంసకాండను సృష్టించాడని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. విధ్వంస కారకుడు చంద్రబాబే: ప్రాజెక్టుల యాత్ర పేరుతో బయలుదేరిన చంద్రబాబు, నిన్న దురుద్దేశంతో రూటు మార్చుకుని, పుంగనూరు వెళ్తానంటూ నిన్న బైపాస్ రోడ్ వద్ద విధ్వంసం సృష్టించారు. అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో, వారిపై పార్టీ కార్యకర్తలతో దాడి చేయించాడు. ప్రచార వాహనంపై నిల్చొని మైకు పట్టుకుని ఏకంగా పార్టీ కేడర్‌కు ఆదేశాలు ఇవ్వడాన్ని చూశాం. ‘తరమండి.. తరమండి..నా..’ అంటూ రెచ్చగొట్టారు. పార్టీ కార్యకర్తలను పోలీసులపై ఉసి గొల్పారు. రాడ్స్, కర్రలు, రాళ్లు, గాజులతో దాడి చేయించారు. పోలీసు వాహనాలనూ ధ్వంసం చేయించారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు, ఆ విధంగా పార్టీ కేడర్‌ను పోలీసులపైకి ఉసి గొల్పడం ఎంత వరకు సబబు? ఆయనకు ఆ హక్కు ఎవరిచ్చారు?. రాష్ట్రంలో ఎవరైనా నిరసన చేయొచ్చు. కానీ విధ్వంసం చేసే హక్కు ఎవరికీ లేదన్న విషయం చంద్రబాబుకు తెలియదా?. అందుకే నిన్న పుంగనూరులో విధ్వంసానికి పూర్తి బాధ్యుడు చంద్రబాబే. ‘డాన్’లా మారిన చంద్రబాబు: తన నియోజకవర్గంలో రోజురోజుకీ ఉనికి కోల్పోతున్న చంద్రబాబులో ఫ్రస్టేషన్ తీవ్రమవుతోంది. అందుకే కేడర్‌ను రెచ్చగొట్టి వారితో విధ్వంసాలు, అరాచకాలు సృష్టించి.. ఆ విధంగా ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలన్న దుర్బుద్ధితో చంద్రబాబు ఒక డాన్‌లా మారాడు. ఏకంగా రౌడీలు, గుండాలకు అధిపతిలా వ్యవహరిస్తున్నాడు. దీంతో 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు నిజస్వరూపం చూసి ప్రజలూ ఆశ్చర్యపోతున్నారు. పుంగనూరులో నిన్న విధ్వంసం చేసిన వారు జిల్లా వాసులు కారు. ఇతర జిల్లాల నుంచి పుంగనూరుకు రౌడీల్ని తీసుకెళ్లి పాత సినిమాల్లో బందిపోటు ముఠా తరహాలో చంద్రబాబు ఏకంగా పోలీసులపైనే దాడి చేయించాడు. నిన్న పుంగనూరులో జరిగిన విధ్వంసంపై కచ్చితంగా సమగ్ర దర్యాప్తు జరగాలి. చంద్రబాబు కుట్ర: సీఎం శ్రీ వైయస్ జగన్, ఆనాడు విపక్షనేతగా రాష్ట్రంలో మూడున్నర వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా ఎక్కడా చిన్నపాటి ఘర్షణ తలెత్తలేదు. మా పార్టీ కార్యకర్తల్ని క్రమశిక్షణలో పెట్టుకుని, ఒక సంకల్పం కోసం మా నేత చేసిన పాదయత్ర అది. మరి, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న యాత్రలు, పర్యటనలు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో.. ఆయన ఎక్కడికి వెళ్లినా అక్కడ ఎలాంటి ఘోర ఘటనలు జరుగుతున్నాయో స్వయంగా ప్రజలే చూస్తున్నారు. తన పాలనలో ప్రజల మేలు కోసం ఏం చేశామనేది చంద్రబాబు చెప్పుకోలేకపోతున్నారు. అందుకే నిత్యం సీఎంగారిపైనా, ప్రభుత్వంపైనా పిచ్చి విమర్శలు చేస్తూ.. రాష్ట్రంలో ఏదో ఒక అలజడి సృష్టించి, అల్లర్లు చేయించి శాంతి భద్రతల సమస్య సృష్టించాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. అందుకే రూట్‌మ్యాప్‌లో లేని పుంగనూరు టౌన్‌కు వెళ్తానంటూ, నిన్న బైపాస్ రోడ్‌లో విధ్వంసం సృష్టించాడు. అదే బాబూ.. జగన్‌గారి మధ్య తేడా: చంద్రబాబూ.. రాజకీయాల్లో నీ అంత నీతిమాలినోడు ఎవడూ ఉండడని చెబుతున్నాను. అందుకు ఉదాహరణగా చెప్పాలంటే నీ నీతిమాలిన పనులు అనేకం ఉన్నాయి. మ్యానిఫెస్టో పేరుతో 650 హామీలు ఇచ్చి, ఏవీ అమలు చేయకుండా.. చివరకు పార్టీ వెబ్‌సైట్ నుంచి ఆ మ్యానిఫెస్టోనే తొలగించిన చరిత్ర చంద్రబాబుది. అదే మా నాయకుడు, సీఎం శ్రీ వైయస్ జగన్, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నారు. అన్ని రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి ప్రజల మన్ననలు పొందుతున్నారు. అదే నీకు.. జగన్‌గారికి ఉన్న తేడా అని అర్ధం చేసుకోవాలి. అందుకే ఇటీవల నీ పర్యటనల్లో ఒక్కరూ నిన్ను స్వాగతించడం లేదు. పెద్దిరెడ్డిగారిపై ఏమిటా వ్యాఖ్యలు?: కుప్పం సీటు ఈసారి ఎన్నికల్లో గల్లంతవుతుందని, చంద్రబాబు మళ్లీ మరో నియోజకవర్గం వెతికే పరిస్థితి ఉందనేది తేలిపోయింది. అందుకే, ఇప్పుడు మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఇష్టానుసారం మాట్లాడుతూ రెచ్చిపోతున్నాడు. నిన్న కూడా పుంగనూరులో మంత్రి శ్రీ పెద్దిరెడ్డిపై చంద్రబాబు చేసిన విమర్శలు దారుణం. రాజకీయాల్లో సౌమ్యుడిగా పేరున్న, ఎప్పుడూ దీక్షలో ఉండే మంత్రి శ్రీ పెద్దిరెడ్డిపై చంద్రబాబు వ్యాఖ్యలు అత్యంత హేయం. కుప్పం నియోజకవర్గంలో ఎన్నో మంచి పనులు చేస్తున్న మంత్రి శ్రీ పెద్దిరెడ్డిని అక్కడి వారు ఎంతో ఆదరిస్తున్నారు. దాంతో అక్కడ నీ ఉనికి కోల్పోతున్నావు. అన్ని స్థానిక ఎన్నికల్లో నీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అందుకే మంత్రిపై నీకు అంత ఉక్రోషమా?. వారాహి పేరుతో పవన్‌కళ్యాణ్ బూతు పురాణం: మరోవైపు చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్ కూడా వారాహి యాత్ర పేరుతో ఆ వాహనం ఎక్కి బూతు పురాణం చదువుతున్నాడు. తాట తీస్తాం.. తోలు తీస్తాం.. బట్టలూడదీస్తాం.. సై అంటే సై.. అంటూ పార్టీ క్యాడర్‌ను రెచ్చగొడుతూ ఒక ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మరోవైపు అధికారాన్ని లాక్కోవాలని, అందుకు ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని.. అందుకోసం ప్రాణత్యాగానికి సిద్ధం కావాలని పార్టీ సమావేశాల్లో పవన్ పిలుపునిస్తున్నాడు. అంటే తన స్వార్థ రాజకీయం కోసం, తన పదవుల కోసం పార్టీ క్యాడర్ త్యాగం చేయాలని కోరుతున్నాడు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ది ఒకటే సిద్ధాంతం, ఒకటే లక్ష్యం.. అని దీనివల్ల అర్ధమవుతోంది. పోలీసుల గాయాలపై నోరు మెదపవే?: నిన్న పుంగనూరు ఘటనపై పవన్‌కళ్యాణ్ ఏం స్పందించారు? నిత్యం సభల్లో మా నాన్న పోలీసు కానిస్టేబుల్ అని చెప్పుకుంటాడు కదా.. మరి, నిన్న పుంగనూరులో అంతమంది పోలీసులు రక్తమోడుతూ దెబ్బలు తిని గాయాలతో కనిపిస్తే పవన్‌కళ్యాణ్ ఎందుకు స్పందించడు? పోలీసు వాహనాల్ని తిరగేసి తగల బెడితే.. నీ తండ్రి లాంటి వారైన పోలీసులకు తగిలిన దెబ్బలపై నువ్వెందుకు మాట్లాడడం లేదు? వాటి గురించే మాట్లాడని నీవు, నీ దత్తతండ్రి వైఖరిపై ఏం స్పందిస్తావ్?. నీ దత్తతండ్రి జడ్ క్యాటగిరి సెక్యూరిటీలో ఉన్నాడు. ఆయనపై ఒక రాయేసినా గార్డులు కాల్పులు జరిపే పరిస్థితి ఉంది కదా? అలాంటప్పుడు ఆయనపై దాడి ఎక్కడ జరిగింది. నిజానికి ఆయనే పోలీసులపై దాడికి ఉసి గొల్పాడు. రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు?: అసలు, నీవు, నీ దత్త తండ్రి కలిసి ఏ అమాయకులపై కాల్పులు జరిపించాలని ఇవన్నీ చేస్తున్నారు?. అసలు మీరిద్దరూ కలిసి రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు?. మిమ్మల్ని నమ్ముకుని అభిమానులుగానో, పార్టీ కార్యకర్తలుగా ఉన్నవారినో అనవసరంగా గొడవలకు రెచ్చగొట్టి వారిని బలి చేయాలని చూస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసం?. ఏ గ్యారెంటీ ఇస్తారు?: మరోవైపు పప్పు లోకేశ్ యువగళం పేరుతో యాత్ర చేస్తూ.. తన కేడర్‌కు ఏమని చెబుతున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. టీడీపీ కార్యకర్తలు ఎన్ని గొడవలు చేస్తే.. ఎన్ని దాడులు చేస్తే.. ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవులిస్తానని లోకేశ్ పిలుపునిస్తున్నాడు. ఇదేం రాజకీయం? మీరు అధికారంలో లేకపోతే కార్యకర్తలు గొడవలు చేసి కేసులు పెట్టించుకోవాలా?. బంగారం వంటి యువత భవిష్యత్తును నాశనం చేయాలని చంద్రబాబు, ఆయన కుమారుడు ఆలోచిస్తున్నారా? ఇదేనా భావి తరాలకు మీరిచ్చే సందేశం?. గొడవల్లో దిగి, దాడులు చేసి, కేసుల్లో ఇరుక్కోవాలని పరోక్షంగా పిలుపునిస్తున్న నారా లోకేశ్, అదే యువత భవిష్యత్తుకు ఏ విధంగా గ్యారెంటీ ఇస్తాడు?. తరిమి తరిమి కొడతారు: అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలతో రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు చేస్తూ.. వినూత్న, విప్లవాత్మక నిర్ణయాల ద్వారా, సంస్కరణల ద్వారా ప్రజల ఇంటి గడప వద్దనే ప్రభుత్వ పాలన అందిస్తూ.. ఎక్కడా అవినీతికి చోటు లేకుండా, పూర్తి పారదర్శకంగా అన్నీ అమలు చేస్తున్న సీఎం శ్రీ వైయస్ జగన్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటున్నారు. దీంతో తమకు రాజకీయ భవిష్యత్తు లేదని నిర్ధారణకు వచ్చిన చంద్రబాబు రోజురోజుకీ గతి తప్పి, మరింత అనైతికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్నాడు. అదే బాటలో ఆయన పుత్రుడు, దత్తపుత్రుడు నడుస్తున్నారు. అదే పనిగా సీఎంగారిపైనా, ప్రభుత్వంపైనా నిత్యం నోరు పారేసుకుంటూ, బురద చల్లుతూ తూలనాడుతున్నారు. దీన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. అందుకే ప్రజలే ఆ ముగ్గురినీ తరిమి తరిమి కొట్టి, తగిన బుద్ధి చెబుతారని మంత్రి శ్రీ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.