రైతన్న మేలుకు విప్లవాత్మక నిర్ణయాలు

అన్నదాతకు ఆకాశమే హద్దుగా సీఎం వైయస్‌ జగన్‌ సేవలందిస్తున్నారు

జ్ఞాన మార్పిడి, శిక్షణ కోసం 11 జాతీయ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం

రైతు భరోసా కేంద్రాలతో క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తాం

త్వరలో వైయస్‌ఆర్‌ అగ్రిల్యాబ్స్‌ ఏర్పాటు చేయనున్నాం

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

తాడేపల్లి: రైతుల మేలు విషయంలో ఆకాశమే హద్దుగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పనిచేస్తున్నారని, అన్నదాతకు అండగా విజ్ఞాన మార్పిడి, శిక్షణ కోసం ప్రభుత్వం జాతీయ సంస్థలతో కీలక అవగాహన ఒప్పందాలను కుదర్చుకోవడం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో కాదు.. వ్యవసాయంలోనే నాణ్యత తీసుకువచ్చినప్పుడు సమర్థవంతంగా సేవలు అందించగలుగుతామని, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, సేవలు, వ్యవసాయ విస్తరణలో నాణ్యత, వ్యవసాయ ఉత్పత్తిలో కూడా నాణ్యత ఉండే విధంగా చేయాలని సీఎం చెప్పారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ సమక్షంలో 11 జాతీయ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకున్న అనంతరం మంత్రి కన్నబాబు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయ ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు ఏం మాట్లారంటే.. 

‘జాతీయ సంస్థలతో సుదీర్ఘంగా చర్చించిన తరువాత 11 సంస్థలతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. వ్యవసాయం, పశుసంవర్థక, మత్స్య రంగాలకు సంబంధించి కీలక ఒప్పందాలు చేసుకున్నాం. నాలెడ్జ్‌ పాట్నర్స్‌గా ఉండే సంస్థలు మన వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని, సలహా సంప్రదింపులను అందించడానికి వీరు సేవలు అందిస్తారు. దీంట్లో ప్రధానంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇదొక విప్లవాత్మక అంశంగా దేశం అంతా మన రాష్ట్రంవైపు చేస్తోంది. వ్యవసాయ విస్తరణ ఇప్పటి వరకు కలగానే ఉంది. గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన విజ్ఞానాన్ని, నాణ్యత కలిగిన ఎరువులు, విత్తనాలను ప్రభుత్వమే ధ్రువీకరించి అందించే ఇలాంటి కార్యక్రమాన్ని దేశంలోని మన రాష్ట్రం ప్రప్రథమంగా అమలు చేస్తోంది. ఇది వినూత్నమైన కార్యక్రమంగా భావిస్తున్నాం. దీనికి నాలెడ్జ్‌ సెంటర్ల భాగస్వామ్యం చాలా అవసరం. 

రైతు భరోసా కేంద్రాలు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ కావాలి. రైతులకు అందించే సేవలకు ఆకాశమే హద్దుగా పనిచేయాలని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఇచ్చే సమాచారం సరిపోదు కాబట్టే సైంటిఫిక్‌ రీసెర్చ్‌ సంస్థలు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్ద ల్యాబరేటరీస్‌ ద్వారా కొత్త కొత్త రీసెర్చ్‌ ఎప్పటి కప్పుడు రైతులకు అందే విధంగా చర్యలు తీసుకున్నాం. గ్రామ సచివాలయ వ్యవస్థను ఏ విధంగా ఏర్పాటు చేశామో.. ఈ రాష్ట్రంలో అలాగే రైతు భరోసా కేంద్రంతో ప్రతి రైతుకు సేవలు అందించే ప్రత్యేక కార్యక్రమం ఇది. దీనికి అత్యున్నత సాంకేతిక నైపుణ్యత అవసరం అని చెప్పారు. 11,158 రైతు భరోసా కేంద్రాలకు కూడా జాతీయ సంస్థల సేవలు అందుతాయి. అదే విధంగా రైతులు, ఉద్యోగులు, అధికారులకు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడేషన్‌ కోసం ట్రైనింగ్‌ కూడా ఈ సంస్థలు అందిస్తాయి. అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి కెపాసిటీ బిల్డింగ్‌ జరుగుతుంది. రైతులకు కూడా శిక్షణ నిరంతరం జరిగే ప్రక్రియగా రైతు భరోసా కేంద్రాలు వచ్చిన తరువాత ప్రారంభం అవుతుంది. 

ఇప్పటి వరకు జరిగిన ఒప్పందాలే కాకుండా మరో నాలుగు కీలక విభాగాల్లో త్వరలోనే దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన నాలెడ్జ్‌ పాట్నర్స్‌ను తీసుకొని ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ మార్కెటింగ్, ఆక్వా కల్చర్, ప్రకృతి వ్యవసాయం, బయో ఫెర్టిలైజర్స్‌కు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోనున్నాం. బయో ఫర్టిలైజర్స్, బయో ఫెస్టిసైడ్స్‌ వ్యాపార సంస్థలు రైతుల దగ్గరకు చేర్చుతున్నారు. ఇవి ఎంత వరకు వాడాలనే కన్ఫ్యూజన్‌ రైతులకు ఉంది. దీనికి సంబంధించి ఒక నాలెడ్జ్‌ పాట్నర్‌ను ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. త్వరలోనే ఈ ప్రక్రియ కూడా పూర్తిచేస్తాం. 

సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో అందించే వ్యవస్థను ఇంకా పటిష్ట పరిచి దాదాపు ప్రతి పంటకు సంబంధించిన ఎక్స్‌పర్ట్స్‌ను, రీసెర్చ్‌ ఇనిస్టిట్యూషన్లను త్వరలోనే తీసుకురాబోతున్నాం. వ్యవసాయ ఉత్పత్తుల్లో కాదు.. వ్యవసాయంలోనే నాణ్యత తీసుకువచ్చినప్పుడు సమర్థవంతంగా సేవలు అందించగలుగుతాం. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, సేవలు, వ్యవసాయ విస్తరణలో నాణ్యత, వ్యవసాయ ఉత్పత్తిలో కూడా నాణ్యత ఉండే విధంగా చేయాలని సీఎం చెప్పారు. గ్రామీణంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలంటే 62 శాతం ఉన్న వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేయాలి. ఆ క్రమంలో ఏ నిర్ణయమైనా తీసుకోవాలని చెప్పారు. ఎంయూఓలు కుదుర్చుకున్న సంస్థలు ఆంధ్రప్రదేశ్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకుంటామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల తరువాత వైయస్‌ఆర్‌ ఆగ్రి ల్యాబ్‌లు తీసుకువస్తున్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ల్యాబ్‌ వస్తుంది. వ్యవసాయ అనుబంధం ఉన్న ప్రాంతాల్లో 147 ల్యాబ్‌లు వస్తాయి. ఇవి కాకుండా 13 జిల్లా స్థాయి ల్యాబ్‌లు వస్తాయి.. 4 రేంజల్‌ కోడింగ్‌ సెంటర్లు వస్తున్నాయి. వీటి కోసం ఇప్పటికే టెండర్లు కూడా పిలవడం జరిగింది. 

ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు.. ప్రతినిధులు
స్వామినాథన్‌ ఫౌండేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హరిహరణ్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ న్యూఢిల్లీ రణధర్‌సింగ్, బీ.ఎస్‌.ద్వివేది హెడ్‌ ఆఫ్‌ ది డిపార్టుమెంట్‌ సాయిల్‌ సైన్స్‌ డివిజన్‌–న్యూఢిల్లీ, జీ. జయలక్ష్మి– నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌–హైదరాబాద్, శ్యామ్‌బాబు డైరెక్టర్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఫెర్టిలైజర్‌ క్వాలిటీ కంట్రోల్, శిక్షణ సంస్థ–ఫరీదాబాద్, అరవింద్‌ ఎన్‌.సింగ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ సీడ్‌ రీసెర్చ్, శిక్షణ సంస్థ–వారణాసి, జి.రవీంద్రచారి డైరెక్టర్‌ ఆఫ్‌ సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ డ్రైల్యాండ్‌ అగ్రికల్చర్‌–హైదరాబాద్, త్యాగి జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌–కర్నాల్, మహేష్‌ చందర్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌–ఉత్తర్‌ప్రదేశ్, శోభారాణి జాయింట్‌ డైరెక్టర్‌ సదరన్‌ రీజనల్‌ యానిమల్‌ డిసీజ్‌ డయాగ్నోస్టిక్‌ ల్యాబ్, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ హెల్త్‌ అండ్‌ వెటర్నరీ బయోలాజికల్స్, బి.శేషగిరి హెడ్‌ అండ్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ ఐసీఏఆర్‌ సీఐఎఫ్‌ఏతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది’ అని మంత్రి కన్నబాబు వివరించారు. 
 

తాజా వీడియోలు

Back to Top